‘పల్లెప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాలి

ABN , First Publish Date - 2021-06-17T05:30:00+05:30 IST

‘పల్లెప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాలి

‘పల్లెప్రగతి’తో గ్రామాల రూపురేఖలు మారాలి
పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌లో పర్యటిస్తున్న కలెక్టర్‌ పౌసుమిబసు

  •  వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు
  • పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌లో పర్యటన
  • శ్మశానవాటిక నిర్మాణం, పారిశుధ్యంపై అసంతృప్తి

పరిగి : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాల రూపు రేఖలు మారిపోవాలని వికారాబాద్‌ కలెక్టర్‌ పౌసుమిబసు సూచించారు. గురువారం మండల పరిధిలోని సయ్యద్‌మల్కాపూర్‌ గ్రామంలో ఆమె పర్యటించారు. గ్రామంలోని విధులన్నీ కలియతిరిగారు. మురికి కాలువల్లో పేరుకుపోయిన చెత్తచెదారం తొలగించకపోవండం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వననర్సరీలో మొక్కల లెక్కల్లో తేడాలు ఉండడంపై ఉపాధి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్మశానవాటిక నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతుందని సర్పంచ్‌ని కలెక్టర్‌ ప్రశ్నించారు. ఇప్పటివరకు చేపట్టిన పనులకు బిల్లు ఇవ్వకపోవడంతో జాప్యం జరిగిందని సర్పంచ్‌ సమాధానమిచ్చారు. రాష్ట్రమంతటా పూర్తయితే ఇక్కడే ఎందుకు పూర్తి చేయించలేకపోయారని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో శ్మశానవాటిక పనులను ఎంపీడీవో, ఏఈ, సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, కార్యదర్శులు దగ్గరుండి పూర్తిచేయాలని ఆదేశించారు. వారంరోజుల్లో పనులు చేయించకపోతే సర్పంచ్‌, కార్యదర్శులకు షోకాజ్‌ నోటీస్‌ ఇవ్వాలని డీపీవోను కలెక్టర్‌ ఆదేశించారు. గ్రామంలో దెబ్బతిన్న మురికికాలువల మరమ్మతులకు తిరిగి ప్రతిపాదనలు తయారు చేయాలని ఏఈని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్ళను నోటీసులు ఇచ్చి కూల్చివేయాలని సూచించారు. సయ్యద్‌మల్కాపూర్‌ ప్రవేశంలో స్వాగత తోరణం కట్టించాలని సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతిలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి నిర్మించడమే కాకుండా, వాటిని వినియోగించే విధంగా చూడాల్సిన బాధ్యత కూడా సర్పంచ్‌, కార్యదర్శులదేనని అన్నారు. అలాగే ఇంటింటా మొక్కలు నాటించి పెంచే బాధ్యతను తీసుకోవాలన్నారు. పంచాయితీ పరిధిలోని ఖాళీ స్థలాల్లో కూడా మొక్కలు నాటించాలని సూచించారు. పల్లెప్రగతిని పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డీపీవో రిజ్వానా, ఇన్‌చార్జి ఎంపీడీవో దయానంద్‌, సర్పంచ్‌ ఫయూమ్‌ సుల్తానా, ఉపసర్పంచ్‌ చంద్రయ్య, ఆర్‌ఐ నరేందర్‌, కార్యదర్శి సంతోష్‌, తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్‌ను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలి

 (ఆంధ్రజ్యోతి వికరాబాద్‌ జిల్లా ప్రతినిధి) : వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్‌ కలెక్టరేట్‌ భవన సముదాయాన్ని గురువారం కలెక్టర్‌  పౌసుమిబసు తనిఖీ చేశారు. కలెక్టరేట్‌లో కొనసాగుతున్న వివిధ పనులను ఆమె పరిశీలించారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్‌ రానున్న నేపథ్యంలో ఆవరణ మొత్తం పచ్చదనంతో విలసిల్లేలా ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. హెలీప్యాడ్‌ నిర్మాణంతో పాటు ఇతర అసంపూర్తి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్‌ భవనాన్ని అన్ని హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్‌స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం పక్కన నిర్మిస్తున్న గోదాం పనులను పరిశీలించారు. పనులు వేగవంతంచేసి నెల రోజుల్లో గోదాంను స్వాధీన పరచాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కాగా ఈ గోదాంలో ఎన్నికల ఈవీఎంలను భద్రపరచనున్నట్లు ఆమె చెప్పారు. కార్యక్రమంలో  అదనపు కలెక్టర్లు మోతీలాల్‌, చంద్రయ్య, ఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ లాల్‌సింగ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులారమేష్‌, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T05:30:00+05:30 IST