దేవదేవుడి దివ్యదర్శనం

ABN , First Publish Date - 2022-01-14T06:44:52+05:30 IST

భక్తజనబాంధవుడు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు వైకుంఠనాథుడిగా భక్తులకు గురువారం దర్శనమిచ్చారు.

దేవదేవుడి దివ్యదర్శనం
యాదాద్రి బాలాలయంలో తూర్పు ద్వారం ద్వారా స్వామివారి దర్శనం

 తరించిన భక్తజనం

 యాదాద్రిలో వైభవంగా వైకుంఠ ఏకాదశి

 స్వామివారిని దర్శించుకున్న భక్తులు

 అధ్యయనోత్సవాలకు శాస్త్రోక్తంగా శ్రీకారం

యాదాద్రి టౌన్‌, జనవరి 13: భక్తజనబాంధవుడు యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడు వైకుంఠనాథుడిగా భక్తులకు గురువారం దర్శనమిచ్చారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం 6.49గంటలకు పరమపదనాథుడి అలంకారంలో స్వయంభు పంచనారసింహుడు బాలాలయ తూర్పు ద్వారం వద్ద వెండి గరుడ వాహనంపై భూదేవి, శ్రీదేవి సమేతంగా దర్శనమిచ్చారు. భక్తులు క్యూలైన్లలో బారులు తీరి స్వామివారి దివ్య దర్శనాన్ని తిలకించారు.


తూర్పుద్వార దర్శనం

జయ జయ ధ్వానాలు, నారసింహ నామస్మరణ, వేద పండితుల పారాయణాలు, అర్చకుల మంత్రోచ్చారణ, మంగళవాయిద్యాల నడుమ లక్ష్మీనరసింహుడు బాలాలయ తూర్పు ద్వారం వద్ద భక్తులకు దర్శనమిచ్చారు. బాలాలయ కల్యాణ మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై లక్ష్మీనృసింహుడు, పరమభక్తాగ్రేసరులు ఆళ్వారాచార్యుల సేవకు అర్చకులు ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వైకుంఠద్వార దర్శన విశిష్టతను అర్చకులు వివరించారు. శ్రీవైష్ణవ ఆలయాల్లో స్వామివారు ఉత్తరద్వార దర్శనం సంప్రదాయం. అయితే యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది తూర్పు ద్వారం చెంతనే వైకుంఠనాథుడుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వైదిక పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లన్‌థిఘళ్‌ లక్ష్మీనరసింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు, ఆలయ అనువంశికధర్మకర్తబి.నర్సింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్‌.గీతారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కాగా, యాదాద్రి అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైకుం ఠ ఏకాదశి సందర్భంగా గురువారం ఉత్తరద్వారం చెంత స్వామివారు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారిని తిరువీధుల్లో ఊరేగించారు.


వైభవంగా ధనుర్మాస వేడుకలు

యాదాద్రీశుడి సన్నిధిలో నిత్యపూజలు, ధనుర్మాస వేడుకలు వైభవంగా కొనసాగాయి. బాలాలయంలో గోదాదేవిని కొలుస్తూ తిరుప్పావై పాశుర పఠనాలు చేశారు. మధ్యాహ్నం బాలాలయం, పాతగుట్ట ఆలయంలో నీరాటోత్సవం నిర్వహించారు. అనుబంధ రామలింగేశ్వరుడి ఆలయంలో, దర్శన క్యూకాంప్లెక్స్‌లో చరమూర్తులకు నిత్య పూజలు స్మార్త సంప్రదాయ పద్ధతిలో కొనసాగాయి. 


అధ్యయనోత్సవాలకు శ్రీకారం

 యాదాద్రీశుడి సన్నిధిలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. బాలాలయ కల్యాణ మండపంలో వేదమంత్ర పఠనాలతో ఉత్సవమూర్తులకు, నమ్మాళ్వార్లకు స్నపన తిరుమంజనాలు నిర్వహించారు. అలంకార సేవ, నమ్మాళ్వార్‌ సేవలను బాలాలయంలో ఊరేగించారు. లక్ష్మీనారసింహుడిని సాయంత్రం వేళ మత్స్యావతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరు రోజులపాటు కొనసాగనున్న అధ్యయనోత్సవాల్లో స్వామివారు దశావతారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆలయ ఖజానాకు భక్తుల ద్వారా రూ.8,64,056 ఆదాయం సమకూరింది. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కు చెందిన భక్తుడు కృష్ణకుమారిరాజ్‌కుమార్‌ రూ.1.25లక్షల విలువైన వెండి సాలగ్రామ హారాన్ని అందజేశారు.


జాతీయ రహదారులపై సంక్రాంతి రద్దీ

యాదాద్రి, జనవరి13 (ఆంధ్రజ్యోతి), చౌటుప్పల్‌ రూరల్‌, చౌటుప్పల్‌ టౌన్‌, కేతేపల్లి: జాతీయ రహదారులపై గురువారం పండుగ రద్దీ నెలకొంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వారు సంక్రాంత్రి పండుగకు సొంతూళ్లకు బయల్దేరడంతో హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారులపై తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. ఎక్కువగా ఏపీ రాష్ట్రానికి వెళ్లే ప్రజలు సొంత వాహనాల్లో బయల్దేరారు. దీంతో వాహనాల రద్దీ ఏర్పడింది. ఇక పల్లెలు, పట్టణాల్లో సంక్రాంతి సందడి ప్రారంభమైంది. పంతంగి టోల్‌గేటు నుంచి గురువారం 50వేలకు పైగా వాహనాల రాకపోకలు సాగించినట్టు సమాచారం. మొత్తం 16 గేట్లకు 10 గేట్ల ద్వారా విజయవాడ వైపు వాహనాలను పంపించారు. ఫాస్టాగ్‌ ఉండటంతో ఎలాంటి ట్రాఫిక్‌ జామ్‌ కాలేదు. ట్రాఫిక్‌ నియంత్రణకు, జీఎంఆర్‌ సిబ్బంది పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఈ టోల్‌గేటును యాదాద్రి డీసీపీ నారాయణరెడ్డి సందర్శించారు. కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద 12గేట్లకు ఏడు గేట్లను విజయవాడ వైపునకు వెళ్లే వాహనాలకు, 5 గేట్లను హైదరాబాద్‌ వెళ్లే వాహనాలకు కేటాయించారు. పగటి సమయంలో రద్దీగా ఉన్న గూడూరు టోల్‌ప్లాజా వద్ద రాత్రికి వాహనాలు లేక నిర్మానుష్యంగా మారింది. అయితే వర్షం, పొగమంచు కారణంగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పట్టణ ప్రజలు గ్రామాలకు పయనమవడంతో బస్టాండ్లు రద్దీగా మారాయి. చౌటుప్పల్‌లో ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడకుండా ట్రాఫిక్‌ సీఐ విజయ్‌మోహన్‌ పర్యవేక్షణలో పోలీసులు 24 గంటలు పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు.


నేడు భోగి సంబురాలు

మోత్కూరు, జనవరి 13: భోగితో మూడు రోజుల సంక్రాంతి పండుగ ఈ నెల 14న ప్రారంభంకానుంది. ఇప్పటికే పట్టణాల్లో ఉంటున్న ప్రజలు పల్లెబాట పట్టడంతో గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి సందడి నెలకొంది. తొలి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ నిర్వహించనున్నారు. భోగి రోజు త్లెలవారు జామున భోగి మంటలు వేస్తారు. పాత వాటిని వదిలేసి నూతన జీవనం ఆరంభించేందుకు గుర్తుగా భోగి మంటలు వేస్తారు. కొందరు భోగి మంటలపై కుండల్లో పాలు పొంగించి, అందులో బియ్యం పోసి పొంగళి చేస్తారు. కొందరు నీళ్లల్లో రేగుపండ్లు వేసి భోగి మంటలపై కాచి ఇంటిల్లిపాది తలస్నానం చేస్తారు. మరికొందరు రేగు పళ్లను నాణేలతో కలిపి పిల్లలపై పోస్తారు. దీ ఇప్పటికే పల్లెల్లో గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు ప్రారంభమయ్యాయి. పతంగులతో పిల్లలు సందడి చేస్తుండగా, మహిళలు పిండి వంటల్లో నిమగ్నమయ్యారు.



Updated Date - 2022-01-14T06:44:52+05:30 IST