పంజాబ్‌ను ఊడ్చేసిన ఆప్‌

ABN , First Publish Date - 2022-03-11T07:37:04+05:30 IST

ఇది సామాన్యుడి(ఆమ్‌ ఆద్మీ) విలక్షణ తీర్పు..! పంజాబ్‌ చరిత్రలోనే

పంజాబ్‌ను ఊడ్చేసిన ఆప్‌

  • ఆమ్‌ ఆద్మీ ఘన విజయం.. 92 స్థానాలను కైవసం చేసుకున్న ఆప్‌.. గత ఎన్నికల కంటే 72 సీట్లు అధికం
  •  ఓటరు తీర్పుతో మట్టి కరిచిన మహామహులు
  •  ఛన్నీ, సిద్ధూ, బాదల్‌, అమరీందర్‌ ఔట్‌
  •  కాంగ్రెస్‌ కొంప ముంచిన కుమ్ములాటలు
  •  బీజేపీ మెడకు సాగు చట్టాల వ్యతిరేకత
  •  ప్రజల్లో అవిశ్వాసంతోనే అకాలీదళ్‌ పరాజయం
  •  ఓటరు నాడి పట్టిన ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌
  •  ఆకట్టుకున్న ‘ఢిల్లీ మోడల్‌’ వాగ్దానాలు
  •  ‘అవినీతి’పై విసిగిన జనం.. మాన్‌ క్లీన్‌ ఇమేజ్‌కు జై


చండీగఢ్‌, మార్చి 10: ఇది సామాన్యుడి(ఆమ్‌ ఆద్మీ) విలక్షణ తీర్పు..! పంజాబ్‌ చరిత్రలోనే పెనుమార్పు..! 1952 నుంచి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కసారి(1967లో హంగ్‌, రాష్ట్రపతి పాలన) మినహా.. అయితే కాంగ్రెస్‌ - లేదంటే శిరోమణి అకాలీదళ్‌(ఎ్‌సఏడీ) అధికారం చేపట్టే 70 ఏళ్ల సంప్రదాయానికి అడ్డుకట్ట..! మొట్టమొదటి సారి మూడో పార్టీగా ఆప్‌ అధికార పీఠాన్ని దక్కించుకుంది. అదీ.. సాదాసీదాగా కాదు..! 117 స్థానాలున్న అసెంబ్లీలో మేజిక్‌ ఫిగర్‌(59)కు చాలా ఎక్కువగా.. 92 సీట్లను కైవసం చేసుకుంది..! ఇతర పార్టీలను పంజాబ్‌ నుంచి ఊడ్చేసింది. ఇంకా చెప్పాలంటే.. ఆయా పార్టీల తరఫున బరిలో ఉన్న మాజీ సీఎంలు, ఓటమెరుగని నేతలు.. ఇలా ఎందరెందరో మహామహులను మట్టి కరిపించింది.


ఉదయమే ఉత్కంఠకు తెర!

గత నెల 20న పంజాబ్‌ ఎన్నికలు జరగ్గా.. 65.50ు ఓట్లు పోలయ్యాయి. గురువారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైన కొద్ది సేపటికే ఉత్కంఠకు తెరపడింది. సింహభాగం నియోజకవర్గాల్లో ఆప్‌ హవా కొనసాగింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నా.. మధ్యాహ్నాని కల్లా ఆప్‌దే అధికారమని తేలిపోయింది. సాయంత్రానికి తుది ఫలితాలు వెల్లడయ్యాక.. ఆప్‌ 92 సీట్లను సాధించింది. ఇంతకాలం పాలించిన పార్టీలను ఆప్‌ ఊడ్చేసింది. పంజాబ్‌ ఓటర్లు ఆప్‌కు 92 సీట్లను కట్టబెట్టారు. కాంగ్రె్‌సకు గత ఎన్నికల్లో 77 సీట్లు రాగా.. ఈ సారి 59 స్థానాలను కోల్పోయి 18కి పరిమితమైంది. మరో ప్రధాన పార్టీ శిరోమణి అకాలీదళ్‌(ఎ్‌సఏడీ)కు మూడు స్థానాలు దక్కాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగింట బీజేపీ హవా కొనసాగినా.. పంజాబ్‌లో మాత్రం ఓ సిటింగ్‌ స్థానాన్ని కోల్పోయి, రెండింటికి పరిమితం కావాల్సి వచ్చింది. మరో రెండు స్థానాల్లో ఇతరులు పాగా వేశారు.


ఫలించిన కేజ్రీవాల్‌ వ్యూహాలు

పంజాబ్‌ విషయంలో ఆప్‌ చీఫ్‌ వ్యూహాలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. నిజానికి 2014లో దేశమంతా మోదీ హవా కొనసాగుతున్న తరుణంలోనూ పంజాబ్‌లో ఆప్‌ నాలుగు లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో 20 సీట్లను సాధించి, ప్రధాన ప్రతిపక్షం స్థానాన్ని చేజిక్కించుకుంది. ఆ తర్వాత ఆప్‌ ఎమ్మెల్యేలు ఒకరొక్కరుగా కాంగ్రెస్‌ బాట పట్టినా.. నిరుత్సాహపడకుండా పంజాబ్‌పై దృష్టి సారించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒకేఒక్కరు ఎంపీగా గెలిచినా.. అరవింద్‌ కేజ్రీవాల్‌ వెనక్కి తగ్గలేదు. ప్రతికూలాంశాలనే అనుకూలంగా మలచుకున్నారు. కాంగ్రె్‌సకు అధిష్ఠానం అమరిందర్‌ను మార్చి దళితుడైన చరణ్‌జీత్‌ సింగ్‌ ఛన్నీని ముఖ్యమంత్రిని చేసింది. దళితుల ఓట్లకు ఎరవేసింది.


కానీ, కేజ్రీవాల్‌ దళితులకు ఉచిత విద్య, పోటీ పరీక్షల సన్నద్ధతకు ఉచిత శిక్షణ హామీలతో కాంగ్రెస్‌ ఆశలను ఆవిరి చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెద్దపెద్ద వాగ్దానాల జోలికి పోలేదు. ‘ఢిల్లీ మోడల్‌’ను ప్రచారం చేశారు. అంటే.. ఉచిత విద్య, చౌక వైద్యం, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు(పంజాబ్‌లో కరెంటు చార్జీలు ఎక్కువ), సురక్షిత తాగునీటి సరఫరాను ప్రధాన హామీలుగా ప్రకటించారు. డ్రగ్స్‌ సమస్యను సమూలంగా పరిష్కరిస్తానని ప్రకటించారు. గురుగ్రంథ సాహిబ్‌ను అవమానించిన వారిని శిక్షిస్తానంటూ ఆకట్టుకున్నారు. రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగ సమస్యలకు పరిష్కారం చూపుతానని వాగ్దానం చేశారు.


పంజాబ్‌ ఓటర్లలో 45ు (96 లక్షలు) మహిళలే అని గుర్తించి.. 12 మంది విద్యాధికులైన మహిళలకు టికెట్లిచ్చారు. మహిళలకు ప్రతినెలా రూ. 1,000 ఇస్తానని వాగ్దానం చేశారు. ఈ పరిణామాలన్నీ ఓటర్లలో ఆప్‌ ఆదరణకు ప్రధాన కారణాలయ్యాయి. కేంద్ర తీసుకువచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌ రైతులు ఢిల్లీ శివార్లలో నిరవధిక ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆ ఆందోళనలకు మద్దతిచ్చి, సహకరించారు. ఈ పరిణామం కూడా రైతుల్లో ఆప్‌ పట్ల ఆదరణ పెరగడానికి కారణమైంది.



ఆ పార్టీలవి స్వయంకృతాపరాధాలే!

కాంగ్రెస్‌, ఎస్‌ఏడీ పార్టీల స్వయంకృతాపరాధాలు కూడా ఆమ్‌ ఆద్మీ పార్టీకి కలిసివచ్చాయి. అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్‌ బలహీనమైంది. పీసీసీ చీఫ్‌ నవ్‌జోత్‌ సింగ్‌ సిద్ధూకు.. సీఎంగా ఉన్నప్పుడు అమరీందర్‌కు మధ్య వివాదాలు భగ్గుమన్నాయి. ఛన్నీని సీఎం చేసినా.. ఆయనతో సిద్ధూకు సఖ్యత లేదు. ఈ పరిణామాలకు తోడు.. పరస్పర అవినీతి ఆరోపణలు కాంగ్రెస్‌ కొంప ముంచాయి. ఎస్‌ఏడీ కూడా ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయింది. సాగుచట్టాల తర్వాత ఆ పార్టీ ఎన్‌డీయేను వీడినా.. రైతుల్లో నమ్మకాన్ని చూరగొనలేకపోయింది. దాంతో ప్రజలు ప్రత్యామ్నాయంగా ఆప్‌ వైపు చూశారు.


కలిసివచ్చిన మాన్‌ క్లీన్‌ ఇమేజ్‌

సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నేరుగా ఓటర్లనే ఫోన్‌ ద్వారా అభిప్రాయాలను అడిగారు. సీఎం అభ్యర్థిగా భగ్వంత్‌ మాన్‌ క్లీన్‌ ఇమేజ్‌ కూడా ఆప్‌ విజయానికి ప్రధాన కారణాల్లో ఒకటి. అవినీతితో విసిగిపోయిన పంజాబ్‌ ఓటర్లను మాన్‌ నేపథ్యం ఆకట్టుకుంది. ఆయన రెండు సార్లు ఎంపీగా గెలిచినా.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన ఆస్తులు తగ్గుతూ వస్తున్నాయి. సర్పంచిగా గెలిచినవారు కూడా కోట్లు కూడబెట్టుకుంటున్న తరుణంలో.. ఆయన ఏమాత్రం ఆస్తులు సంపాదించలేదు.


 




ఖట్కర్‌ కలాన్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం

తమ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం రాజ్‌భవన్‌లో జరగదని పంజాబ్‌ కాబోయే సీఎం భగ్వంత్‌ మాన్‌ స్పష్టం చేశారు. స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌ కలాన్‌లో సీఎంగా తాను, తన మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఉంటుందని వివరించారు. ఇకపై మంత్రులు సరిహద్దులు, గ్రామాలను సందర్శించి ప్రజల వద్దే పాలనను అందిస్తారని చెప్పారు. క్రీడలను ప్రోత్సహించేందుకు గ్రామాల్లో స్టేడియాలు నిర్మిస్తానని చెప్పారు. మన విద్యార్థులు వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌ వంటి దేశాలకు వెళ్లకుండా.. ఇక్కడే వైద్య కళాశాలలు నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలను పెట్టడాన్ని నిషేధిస్తానని.. కేవలం భగత్‌సింగ్‌, అంబేడ్కర్‌ ఫొటోలు ఉండేలా చర్యలు తీసుకుంటానని వివరించారు.


Updated Date - 2022-03-11T07:37:04+05:30 IST