విషదోషాలకు విరుగుడు నేపాళం కాయల కూర

ABN , First Publish Date - 2022-05-07T05:30:00+05:30 IST

విషదోషాలకు విరుగుడు నేపాళం కాయల కూర

విషదోషాలకు విరుగుడు నేపాళం కాయల కూర

నేపాళం మొక్క విరేచనాలకు ప్రసిద్ధి. వీటిలో చిన్న నేపాళం, పెద్ద నేపాళం అనే రెండు రకాలు ఉన్నాయి. ఇది రోడ్డు పక్కన పెరిగే మొక్క. దీని వేరుని విరేచన ఔషధాల్లో వాడతారు. ఆకులు, కాయల్ని కూరగా వండుకునే అలవాటు మన పూర్వీకులకుండేది. ఔషధ గుణాలున్న అనేక కూరగాయల లాగానే, దీన్నీ మనం పూర్తిగా మరిచిపోయాం.

దీని వేరు ఏనుగు దంతం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ‘దంతీ’ అనే పేరు వచ్చింది. ఈ మొక్క వేరుని కేవలం ఔషధాల తయారీకి మాత్రమే వాడతారు. లేత నేపాళం కాయలు మృదువుగా పనిచేస్తాయి. కాబట్టి, నలుడు తన పాకదర్పణంలో దీని లేత కాయలతో కూర వండుకోవటం గురించి వివరించాడు. అలసందలతో కూర వండుకున్నట్టే నేపాళం కాయలతోనూ కూర వండుకోవచ్చన్నాడు. పాలు, కొబ్బరి వేసి పరిమళాలు చేర్చి ఇగురు కూరగా వండుకోవచ్చు లేదా నూరి రోటిపచ్చడిగా కూడా చేసుకోవచ్చు. 

ప్రయోజనాలివి...

గాయాలు, పుండ్లు, దుష్టవ్రణాలు త్వరగా తగ్గేలా చేస్తుంది. శరీరానికి బలాన్నిస్తుంది. వేడిని తగ్గించి చలవనిస్తుంది. రక్తస్రావం, బీపీ, పేగుపూత లాంటి వ్యాధుల్లో మేలుచేస్తుంది. కఫం వలన వచ్చే వ్యాధులన్నింటిలోనూ ఇది ఉపయోగపడుతుంది. అలర్జీలను తగ్గిస్తుంది. మలమూత్రాలు సాఫీగా అయ్యేలా చేస్తుంది. శరీరంలో విషదోషాలను హరిస్తుందంటూ నలుడు దీని లేత కాయలతో కూరని గొప్ప ఔషధాహారంగా పేర్కొన్నాడు. నేపాళం కాయలు ముదిరితే గింజలు తీక్షణవిరేచనకారులుగా పనిచేస్తాయి. లేత కాయలు మాత్రం  రోజూ సక్రమంగా కాల విరేచనం మృదువుగా అయ్యేలా చేస్తాయి. అదనంగా ఈ లేతకాయలకు ఉబ్బు, వాపుల్ని తగ్గించే గుణం కూడా ఉంది. అందుకని కీళ్ల వాతం, గుండె జబ్బులు, రక్త హీనత, మొలల వ్యాధి, ఫిస్టులా లాంటి వ్యాధులున్నవారు లేత నేపాళం కాయల కూరని తరచూ తీసుకుంటూ ఉంటే మూత్రం ఫ్రీగా అయి, వంటికి పట్టిన నీరు లాగేస్తుంది. ఆస్తమా, తుమ్ములు, దురదలు, దద్దుర్లు... ఇలాంటివి దీర్ఘకాలంగా బాధిస్తున్నవారు తరచూ ఈ కూరని కొద్దిగా తిని చూడండి. వ్యాధి తీవ్రత తగ్గుతుంది.

లేత నేపాళం కాయల కూరని ఎంత తింటే ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసుకుని తినాలి. తొందరపడి అతిగా తినకూడదు. అలర్జీ అంటే పడకపోవటం. మన శరీరం కొన్ని ఆహార ద్రవ్యాల్ని, పానీయాల్ని, మనం వాడుకునే కొన్ని వస్తువుల్ని అంగీకరించక పోవచ్చు. అంటే, దాని అలర్జీ ఉన్నట్టు భావిస్తాం. ఇలా సరిపడని దాన్ని పడేలా చేసే ఔషధం అంటూ ఏదీ లేదు. అలర్జీ వ్యాధుల్లో వాడించే మందులు సరిపడని వాటిని దారికి తెచ్చేందుకు కాదు. అవి తిన్నప్పుడు లేదా వాటిని వాడినప్పుడు కలిగే చెడు లక్షణాలను తగ్గించటానికి మాత్రమే మందులు ఇస్తున్నారని గమనించాలి. సరిపడని వాటివలన కలిగే అసౌకర్యాల్ని తగ్గించటమే కాకుండా సరిపడని శరీరతత్వంలో మార్పు తేవటానికి ఈ నేపాళమ్‌ లేతకాయల కూర సహకరిస్తుంది. యాంటీ హిస్టమిన్లు, స్టిరాయిడ్లు ఈ పనిని నిర్వర్తించలేవు. అప్పుడప్పుడు నేపాళం కాయల్ని కూర లేదా పచ్చడి చేసుకుని కొద్ది మోతాదులో తీసుకుంటూ ఉంటే, అలర్జీ తీవ్రత తగ్గుతుంది. రెండు మూడురోజులూ వరుసగా తిన్నా ఏమీ కావటం లేదు అనగలుగుతారు. ఇక్కడ, పడని వస్తువులో మార్పేమీ లేదు. కానీ పడని మన శరీర తత్త్వంలో మాత్రమే మార్పు వచ్చింది. అలాంటి మార్పును ఇలాంటి ద్రవ్యాలు తేగలుగుతాయి. 

గంగరాజు అరుణాదేవి

Read more