శుభ్రతే విరుగుడు

ABN , First Publish Date - 2020-10-15T06:53:05+05:30 IST

కంటికి కనిపించని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజల్లో శుభ్రతపై అవగాహన, ఆసక్తి పెరిగింది. ప్రధానంగా కొవిడ్‌

శుభ్రతే విరుగుడు

మలినాల్లేని చేతులు ఆరోగ్య ద్వారాలు

శానిటైజర్లు, సబ్బులు, లేపనాలతో చేతుల సంరక్షణ

ప్రాణాంతక వ్యాధులకు కారణమవుతున్న అపరిశుభ్రత

‘కరోనా’ నేపథ్యంలో పెరిగిన అవగాహన

నేడు వరల్డ్‌ హ్యండ్‌ వాష్‌ డే


ఖమ్మం సంక్షేమవిభాగం, అక్టోబరు 14:  కంటికి కనిపించని కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రజల్లో శుభ్రతపై అవగాహన, ఆసక్తి పెరిగింది. ప్రధానంగా కొవిడ్‌ వైరస్‌ దరిచేరకుండా ఉండాలంటే పదే పదే చేతులను శుభ్రం చేసుకోవాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలతో యావత్‌ ప్రపంచం హ్యాండ్‌వాష్‌పై దృష్టి పెట్టింది. ప్రతీ ఇంట్లో శానిటైజర్లు, సబ్బులు, యాంటిసెప్టిక్‌ లోషన్లు, లేపనాల వినియోగం పెరిగింది. ఒకడుగు ముందుకేసి కొందరు చేతులకు గ్లౌజులు వినియోగిస్తున్నారు. ఇదంతా అందమైన అరచేతులను, చూడచక్కని వేళ్లను, కంకణాలు కట్టుకునే, వాచీలు పెట్టుకునే మణికట్టును శుభ్రంగా ఉంచుకోవడం కోసమే.. అనుకుంటే పొరపాటే.. దుమ్ము, ధూళితో పాటు ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను దరిచేరనీయకుండా ఉండటం కోసం ప్రతీ ఒక్కరు జాగ్రత్త పడుతున్నారు. నేడు  ‘వరల్డ్‌ హ్యాండ్‌ వాష్‌ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం..


ఆరోగ్యానికి చేతులే ప్రధానం

చేతులు అపరిశుభ్రంగా ఉంటే ఆహారంతో పాటుగా మలినాలు, సుక్ష్మజీవులు శరీరంలోకి చేరతాయి. వాంతులు, విరోచనాలతోపాటు ఎన్నో భయంకరమైన వ్యాధులు చేతుల అపరిశుభ్రతతోనే వస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. చాలా మంది చేతులకు గోరింటారు, గోళ్లకు రంగులు అద్దుకునే సమయంలో వాటిని శుభ్ర పరచడాన్ని విస్మరిస్తున్నారు. గోళ్ల సందుల్లో మట్టి, బ్యాక్టీరియా పెరిగి రుగ్మతలు వస్తాయి. గోర్లు కొరికే అలవాటు ఉన్న వారికి వాటిలోని మలినాలు కడుపులోకి చేరి జీర్ణవ్యవస్థ దెబ్బతింటోంది. తరచుగా చేతులను శుభ్రం చేసుకోకుంటే చాలా సమస్యలు వస్తాయి. దుమ్ము, ధూళి నుంచే కాకుండా వాతావరణపరమైన చలి, వేడి, వర్షం నుంచి రక్షించుకోవడానికి అవసరం అయితే గ్లౌజులు ధరించాలి. ప్రస్తుతం కరోనా బారిన పడకుండా గ్లౌజుల వాడకం పెరిగింది.


కరోనా వైరస్‌ వ్యాప్తితో పెరిగిన అవగాహన

కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రభావంతో ప్రజల్లో చేతుల పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. చేతులను పరిశుభ్రంగా చేసుకోవటానికి సరైన పద్ధతి పాటించాల్సి ఉంటుంది. సబ్బుతో చేతులను పరిశుభ్రంగా చేసుకోవటానికి కనీసంగా 20సెకన్లు సమయం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులపై చర్మమే కాకుండా వేళ్ల మధ్యభాగంలో, అరిచేతిలో, వేళ్ల గోళ్లను సబ్బుతో శుభ్రం చేసుకోవాలని వైద్యులు తెలియజేస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ ఎండ్‌ ప్రీవెన్స్‌ బృందం సర్వే మేరకు కరోనాకు ముందు 90శాతం ప్రజలు కేవలం 5సెకన్లు పాటు మాత్రమే చేతులను శుభ్రం చేసుకోవటానికి కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా వైరస్‌తో ప్రజలకు అవగాహన పెరిగిన వైద్య ప్రమాణాల మేరకు చేతులను ఇంకా పరిశుభ్రంగా ఉంచుకోవటానికి అవగాహన పెంచుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఐదేళ్లలోపు శిశుమరణాల్లో చేతుల ఆపరిశుభ్రతే కారణం అవుతోంది. విరోచనాలు, వాంతులు, డయోరియా వంటి వ్యాదులు వ్యాపించి మరణాలు సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఇప్పుడు స్వైన్‌ ప్లూ, కరోనా కూడా తోడయింది.


గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు..డాక్టర్‌ కోటిరత్నం, ఖమ్మం ప్రభుత్వాసుపత్రి 

చేతుల పరిశుభ్రతపై వైద్యఆరోగ్యశాఖ అధ్వర్యంలో గ్రామస్థాయిలో ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం. ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలకు చేతుల పరిశుభ్రం చేసే విధానాలపై కరపత్రాలు పోస్టర్లతో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లోను సబ్బుతో చేతుల పరిశుభ్రత పెరిగింది. కరోనా ఒక్కటే కాదు, వాంతులు, విరోచనాలు, డయోరియా, ఇతర వ్యాధులు వ్యాప్తిచెందకుండా ఉంటాయి.


పిల్లల చేతులు సబ్బుతో శుభ్రం చేయాలి..డాక్టర్‌ రాకేశ్‌ చల్లగుళ్ల, పిల్లల వైద్యనిపుణుడు, ఖమ్మం

చిన్న పిల్లల చేతులు సున్నితంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు సబ్బుతోనే వారి చేతులను శుభ్రం చేయాలి. సబ్బు అందుబాటులో లేనప్పుడు తక్కువ ఆల్కహాల్‌ శాతం ఉన్న శానిటైజర్లు వాడాలి. చిన్నతనం నుంచే చేతుల పరిశుభ్రత ఆవశ్యకతపై తల్లి,దండ్రులు అవగాహన పెంచాలి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోని కారణంగానే ఐదేళ్ల పిల్లలు ఎక్కువగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. వారికి ఆహారం తీసుకోవడానికి ముందు, బడి నుంచి ఇంటికి వచ్చిన వెంటనే, ఆటలు ముగిసిన తటర్వాత తరుచూ చేతుల పరిశుభ్రత అలవాటు చేయాలి.

Updated Date - 2020-10-15T06:53:05+05:30 IST