ఎట్టకేలకు వార్షిక రుణ ప్రణాళిక ఖరారు

ABN , First Publish Date - 2020-08-07T05:30:00+05:30 IST

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లీడ్‌ బ్యాంకు వార్షిక రుణ ప్రణాళికను ఎట్టకేలకు ప్రకటించారు. బుధవారం కలెక్టర్‌ చేతుల మీదుగా అధికారికంగా

ఎట్టకేలకు వార్షిక రుణ ప్రణాళిక ఖరారు

బ్యాంకుల వారీగా లక్ష్యాలు 

మొత్తం రుణ ప్రణాళిక రూ.1,652 కోట్లు

పంట రుణాలకు రూ.1138.52 కోట్లు కేటాయింపు


(ఆంధ్రజ్యోతి, ఆసిఫాబాద్‌)

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న లీడ్‌ బ్యాంకు వార్షిక రుణ ప్రణాళికను ఎట్టకేలకు ప్రకటించారు. బుధవారం కలెక్టర్‌ చేతుల మీదుగా అధికారికంగా విడుదల చేశారు. అయితే ఇప్పటికే పంట రుణాల జారీ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ నత్తనడకన సాగు తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక కేటాయింపుల విషయానికి వస్తే గతేడాదితో పోల్చి చూసినప్పుడు ఈసారి పంట రుణాల్లో రూ.239.7 కోట్ల మేర పెంపు చేశారు. మొత్తం రూ.1652.50 కోట్లతో తయారు చేసిన ఈ వార్షిక రుణ ప్రణాళికలో ఈదఫా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా, వాణిజ్య రుణాలకు ప్రాధాన్యత ఇచ్చారు. గతంలో కంటే అదనంగా 355.81కోట్లు కేటాయించారు. అలాగే అప్రాధాన్య రంగాలకు రూ.1.07కోట్లు కేటాయిం పులు తగ్గించారు. ప్రాధాన్యత రంగాలకు మాత్రం రూ.356.88 కోట్ల మేరకు కేటాయింపులు పెంచారు. అయితే టర్మ్‌ లోన్ల విషయంలో జిల్లాలో డిమాండ్‌ పెద్దగా కనిపించడం లేదు.


ఇందుకు కారణం ఈ తరహా రుణాలు కేవలం భూముల అభివృద్ధి నీటి వసతుల కల్పన, యంత్ర పరికరాల కొనుగోలు వంటి వాటిపైన ఇవ్వడడమే. దాంతో పెద్దగా రైతులు ఆసక్తి చూపడం లేదు. అయితే గతేడాది వార్షిక రుణ ప్రణాళిక రూ.1296.59 కోట్ల అంచనాతో ఖరారు చేయగా అప్పట్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి జిల్లాకు సంబంధించి గణాంకాలు ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే రుణాల వితరణ మాత్రం కేటాయింపుల స్థాయిలో జరగలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి వార్షిక ప్రణా ళికను ఖరారు చేశారు. లీడ్‌ బ్యాంకు రూపొందించిన ప్రణాళిక ప్రకారం ఈఏడాది మొత్తం రూ.1652 కోట్లతో రుణ ప్రణాళిక తయారు చేయగా గతేడాదితో పోల్చి నప్పుడు రూ.355.81 కోట్లు పెరుగుదల చూపించారు.


బ్యాంకుల వారీగా పంట రుణ ఖాతాలు

జిల్లాలో మొత్తం బ్యాంకులకు చెందిన 50 బ్రాంచీల ద్వారా పంట రుణాలను జారీ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం 1,05,790 రైతు ఖాతాలను పంట రుణాలు పొందేం దుకు అర్హులుగా ఉన్నారు. బ్యాంకుల వారీగా పరిశీలించినప్పుడు ఎస్బీఐలోని 11 బ్రాంచీల పరిధిలో మొత్తం 20వేల రైతు ఖాతాదారులకు గాను రూ.250 కోట్లు, యూనియన్‌ బ్యాంకు (ఆంధ్రాబ్యాంకు) ద్వారా 3,840 మంది రైతులకు రూ.45 కోట్లు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ద్వారా 70,240 మంది రైతులకు రూ.694 కోట్లు, ఆదిలాబాద్‌ కో ఆపరేటివ్‌ బ్యాంకు ద్వారా 11,420 మంది రైతులకు రూ.115కోట్లు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు ద్వారా 180మంది రైతులకు రూ.1.88కోట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ ద్వారా 40 మంది రైతులకు రూ.30లక్షలు, సిండికేట్‌ బ్యాంక్‌ 70 మంది రైతులకు రూ.50లక్షల  చొప్పున రుణాలు జారీ చేయనున్నారు. 


జిల్లాలో పంట రుణాలకు వానాకాలంలోనే డిమాండ్‌ అధికంగా కనిపిస్తుంది. ఈ ఏడాది సీజన్‌ ఆరంభం నుంచే రుణాలు జారీ చేస్తున్నా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమలవడంతో బ్యాంకుల్లో లావాదేవీలు మందకొడిగా సాగాయి. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సాయం కింద జమ చేసిన రైతుబంధు నిధుల విత్‌డ్రాయల్స్‌కు రైతులు ఎగబడటంతో మరో 10 రోజులు బ్యాంకుల లావాదేవీలన్నీ దాని చుట్టే జరిగాయి. దానికి తోడు చాలా మంది రైతులు బకాయిలు చెల్లించక పోవడం కూడా రెన్యూవల్‌ రుణాల జారీ ప్రక్రియ జాప్యం కావడానికి కారణమని బ్యాంకర్లు చెబుతున్నారు. 


పారదర్శకంగా రుణాలు మంజూరు -చెంచు రామయ్య, లీడ్‌ బ్యాంకు మేనేజర్‌

జిల్లాలో వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశాం. గతేడాదితో పోల్చితే ఈసారి రుణాల్లో పెరుగుదల ఉంది. గతేడాది గణాంకాలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల కొంత గందరగోళం ఏర్పడింది. అందుకే ఈసారి పకడ్బందీగా రుణ ప్రణాళికను తయారు చేసి ప్రతి రైతుకు రుణం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాలో ఎక్కువగా వానాకాలం సీజన్‌లో రుణాలకు డిమాండ్‌ ఉంది. యాసంగిలో రుణాలు ఇస్తున్నప్పటికీ రైతుల నుంచి పెద్దగా ఆసక్తి లేదు. ఇక టర్మ్‌ రుణాల విషయానికి వస్తే జిల్లాలో అంతంత మాత్రంగానే తీసుకుంటున్నారు. ఈసారి వార్షిక ప్రణాళికలో అన్ని రంగాలకు సముచితంగా కేటాయింపులు చేశాం. 

Updated Date - 2020-08-07T05:30:00+05:30 IST