గొంతెండుతున్న నంద్యాల

ABN , First Publish Date - 2022-04-10T06:02:30+05:30 IST

నంద్యాల కొత్తగా జిల్లా కేంద్రం అయిందిగాని పాత సమస్యలేవీ పరిష్కారం కాలేదు. కనీసం ఏ పట్టణానికైనా, గ్రామానికైనా ఉండాల్సిన నీటి వసతి కూడా లేదు.

గొంతెండుతున్న నంద్యాల

జిల్లా కేంద్రంలో మంచినీటి కష్టాలు 

నాలుగైదు రోజులకోసారి నీటి విడుదల 

ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టని మున్సిపల్‌ అధికారులు 


నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 7 : నంద్యాల కొత్తగా జిల్లా కేంద్రం అయిందిగాని పాత సమస్యలేవీ పరిష్కారం కాలేదు. కనీసం ఏ పట్టణానికైనా, గ్రామానికైనా ఉండాల్సిన నీటి వసతి కూడా లేదు. నంద్యాల మంచినీటి కోసం తపించిపోతోంది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో నాలుగైదు రోజులకు ఒకసారి కొళాయిల్లో నీరు వస్తోంది. పరిస్థితిని అర్థం చేసుకోడానికి ఇది చాలు. వైసీపీ సీనియర్‌ నాయకుడు కౌన్సిలర్‌ కృష్ణమోహన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న 24వ వార్డు ప్రజలు ఉగాది రోజు సచివాలయం ఎదుట బిందెలతో నిరసన ప్రదర్శన చేశారు. పండగ రోజు కూడా నీరు వదలకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుందిగాని నీరు సరఫరా చేయదా అని ధ్వజమెత్తారు. వేసవిలో సరిగా మంచినీరు వదల్లేదు కాబట్టి నీటిపన్ను కట్టే ప్రసక్తే లేదని భీష్మించుకున్నారు. 


 నంద్యాల పట్టణంలో దాదాపు 2.70 లక్షల జనాభా ఉంది. రోజుకు 32ఎంఎల్‌డీల నీరు అవసరం. కొద్ది రోజులుగా రోజుకు 25ఎంఎల్‌డీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అంటే ఒక రోజుకు 7ఎంఎల్‌డీల నీటి కొరత ఉంది. దీంతో రోజు మార్చి రోజు నీరు వదలాల్సి వస్తున్నదని అధికారులు అంటున్నారు. వేసవి తీవ్రమయ్యాక నీటి ఎద్దడి మరింత పెరిగింది.

 

వెలుగోడు రిజర్వాయర్‌ నుంచి 0.5 టీఎంసీల నీరు : 


నంద్యాల పట్టణ మంచి నీటి అవసరాల కోసం వెలుగోడు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి 0.5 టీఎంసీల నీటిని తెలుగుగంగ మెయిన్‌ కెనాల్‌ ద్వారా కేసీ కెనాల్‌కు మళ్లించి చిన్న చెరువు, ఎస్‌ఎస్‌ ట్యాంకు, పెద్ద చెరువులను నింపేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని టీడీపీ ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి అమృత్‌ స్కీం కింద దాదాపు రూ.137కోట్లతో వీబీఆర్‌ నుంచి నంద్యాలకు నేరుగా పైపులైన్‌ ద్వారా నీటిని తీసుకువచ్చే పనులు ప్రారంభించారు.  ఆ పనులు ఇంకా పూర్తికాలేదు. అమృత్‌ పథకం లక్ష్యం నెరవేరలేదు. అయినా అధికారులు ముందు జాగ్రత్తగా వీబీఆర్‌ నుంచి 0.5టీఎంసీల నీటిని కేసీ కెనాల్‌ ద్వారా నంద్యాల పట్టణ నీటి అవసరాల కోసం తీసుకురావడంలో విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 


మూడు, నాలుగు రోజులకోసారి


 పట్టణంలోని పలు వార్డుల్లో మూడు నాలుగు రోజులకు ఒకసారి, ఒక్కోసారి ఐదురోజులకు ఒకసారి నీరు విడుదల చేస్తున్నారు. విజయభాను కాటన్‌మిల్లు, షాదీక్‌ నగర్‌, నర్సు క్వార్టర్స్‌, సాయిబాబానగర్‌, టీచర్స్‌ కాలనీ, దేవనగర్‌, శ్రమదానం బ్రిడ్జి ఏరియా, రెవెన్యూ క్వార్టర్స్‌, వీసీ కాలనీ తదితర ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. కౌన్సిలర్ల ఒత్తిడితో మున్సిపల్‌ అధికారులు అరకొరగా ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. ఈ ప్రాంతాలతో పాటు వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని పలు ప్రాంతాలలో మంచినీరు కలుషితమై డ్రైనేజీ నీటి వాసనతో నీటి సరఫరా జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. కలుషిత నీరు తాగి పిల్లలు, వృద్ధులు ఆస్పత్రుల పాలవుతున్నట్లు తెలుస్తోంది. 


ప్రత్యామ్నాయం ఏదీ...? : 


వేసవిలో నంద్యాలకు నీటి ఎద్దుడి ఉందని తెలిసీ అధికారులు ప్రత్యామ్నాయం ఆలోచించలేదు. ఏప్రిల్‌ 15 వరకు సరిపోయే నీరు అందుబాటులో ఉందని అధికారులు అంటున్నారు. చిన్న చెరువు, ఎస్‌ఎస్‌ ట్యాంకు, పంపింగ్‌ స్టోరేజీలో నీరును నిల్వ చేశామని, ఆ తర్వాత వెలుగోడు రిజర్వాయర్‌ అధికారులతో మాట్లాడి రావాల్సిన నీటి కోసం ప్రయత్నిస్తామని మున్సిపల్‌ అధికారులు పేర్కొంటున్నారు. 


రోజూ నీరు వదలాలి 


వేసవికాలంలో మున్సిపల్‌ అధికారులు మూడు రోజులకు, ఐదు రోజులకు నీరు వదలుతున్నారు. గత వేసవుల్లో రోజూ నీరు వదిలేవారు. ఒక్కోసారి అర్ధరాత్రి నీరు వదుతున్నారు. రోజూ నీరు వదలాలి. 


- అమీరున్‌బీ, నంద్యాల 


నీటిలో మురుగు వాసన


మంచినీరు కలుషితమై మురుగు వాసన వస్తోంది. ఈ నీరు తాగి రోగాల బారిన పడుతున్నాం. అధికారులు మంచినీటి సరఫరాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిపెట్టడం లేదు. 


 - నాగలక్ష్మి, నంద్యాల


కౌన్సిల్‌లో చర్చించినా ఫలితం లేదు


పట్టణంలోని పలు వార్డుల్లో మంచినీటి సరఫరా సరిగా లేదు. దీనిపై కౌన్సిల్‌ సమావేశంలో చర్చించాం. అయినా సమస్య పరిష్కారం కాలేదు. వ్యక్తిగతంగా మున్సిపల్‌ అధికారులకు చెప్పినా స్పందించలేదు. 


 - జైనాబీ, 27వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ 

Updated Date - 2022-04-10T06:02:30+05:30 IST