ఆమ్‌చూర్‌ తగ్గింది

ABN , First Publish Date - 2022-05-22T05:10:05+05:30 IST

వేసవి వచ్చిందంటే మెదక్‌ జిల్లాలో ఆమ్‌చూర్‌ (మామిడి ఒరుగులు) వ్యాపారం జోరుగా సాగుతుంది. కానీ ఈసారి తగ్గింది. వాతావరణం అనుకూలించక పోవడంతో ఆశించిన మేర మామిడి కాత రాకపోవడంతో ధర బాగా పెరిగి ఆమ్‌చూర్‌ వ్యాపారంపై ఈ ప్రభావం పడింది.

ఆమ్‌చూర్‌ తగ్గింది
హవేళిఘనపూర్‌ మండలం శమ్నాపూర్‌లో రోడ్డుపై ఎండబోసిన ఒరుగులు

  ఆశించిన మేర మామిడి దిగుబడి రాకపోవడమే కారణం

 టన్ను మామిడి రూ. 28 నుంచి 35 వేలు 

 నష్టపోతున్న తయారీదారులు


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, మెదక్‌, మే 21: వేసవి వచ్చిందంటే మెదక్‌ జిల్లాలో ఆమ్‌చూర్‌ (మామిడి ఒరుగులు) వ్యాపారం జోరుగా సాగుతుంది. కానీ ఈసారి తగ్గింది. వాతావరణం అనుకూలించక పోవడంతో ఆశించిన మేర మామిడి కాత రాకపోవడంతో ధర బాగా పెరిగి ఆమ్‌చూర్‌ వ్యాపారంపై  ఈ ప్రభావం పడింది. గత సీజన్‌లో మామిడికాయ ధర కూడా తక్కువగా ఉండడంతో టన్నుల కొద్దీ మామిడి కాయలు కొనుగోలు చేసి ఆమ్‌చూర్‌ను తయారు చేశారు. ఈసారి జిల్లాలో మూడుసార్లు ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు కురవడంతో ఆశించినంతగా మామిడి కాత రాలేదు. కొన్ని చోట్ల విపరీతంగా పూత వచ్చినా కాత మాత్రం రాలేదు. కాసిన చెట్లకు కాయ సైజు చిన్నగా ఉన్నది. కొన్ని చోట్ల వడగళ్లతో కాసిన కొద్ది పాటి మామిడి నేలరాలింది. సాధారణంగా మామిడి దిగుబడి ఎకరాకు 3 టన్నుల వరకు వస్తుంది. కానీ ఈసారి ఎకరాకు టన్ను కూడా రాలేదు. దీంతో ఒరుగుల తయారీ కోసం చెట్లను గుత్తాకు తీసుకున్న వారు లబోదిబోమంటున్నారు. ఏప్రిల్‌ నెల రెండో వారం నుంచే తయారీ పనులు మొదలవుతాయి. కానీ కాయల కొరతతో మే రెండో వారం నుంచి తయారీ చేయడం మొదలు పెట్టారు. 


టన్ను మామిడి రూ.35 వేలు 


గతేడాది టన్ను మామిడి కాయ ధర రూ.20వేల నుంచి రూ.22 వేలు ధర పలికితే.. ప్రస్తుతం టన్ను మామిడి ధర రూ.28వేల నుంచి రూ.35 వేలకు చేరింది. టన్ను మామిడికాయలు కోసి ఎండబెడితే క్వింటాల్‌ ఆమ్‌చూర్‌ వస్తుంది. గతేడాది ఆమ్‌చూర్‌ ధర రూ.20వేల నుంచి రూ.22 వేలు పలికింది. ఈసారి మాత్రం క్వింటాల్‌ ఆమ్‌చూర్‌ ధర రూ.23వేల నుంచి రూ.28 వేల వరకు పలుకుతుంది. కాయ రేటు గణనీయంగా పెరిగినా ఆమ్‌చూర్‌కు మాత్రం సరైన ధర రావడం లేదని తయారీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్‌


దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలతో పాటు విదేశాల్లో పెద్ద పెద్ద హోటళ్లలో చేసే వంటకాలల్లో పులుసు కోసం చింతపండుకు బదులుగా మామిడిని వాడుతారు. వేసవిలో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆమ్‌చూర్‌ తయారు చేస్తారు. మెదక్‌ జిల్లాలో ఏళ్ల తరబడి చేస్తున్నారు. మామిడి సీజన్‌ ప్రారంభం కాగానే చెట్లను గుత్తాకు తీసుకుంటారు. విజయవాడ, హైదరాబాద్‌, ఖమ్మం లాంటి ప్రాంతాలకు వెళ్లి మామిడికాయలను టన్నుల చొప్పున కొనుగోలు చేస్తారు. కాయలు తెంపి, కూలీలతో ఒరుగులు తయారు చేయిస్తారు. జిల్లాలో 4 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. సాధారణ రకాల మామిడికాయలను ఒరుగుల తయారీకి వాడుతారు. కొల్చారం, వెల్దుర్తి, హవేళి ఘనపూర్‌, రామాయంపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట మండలాల పరిధిలో ఎక్కువగా తయారు చేస్తారు. తయారు చేసిన తర్వాత నిజామాబాద్‌ మార్కెట్‌లో అమ్ముతారు. మామిడికాయ తరిగిన తరువాత చిన్న సైజు పీచులను విత్తనం కోసం అమ్ముతారు. 60 కిలోల పీచు సంచిని రూ.4 వేలకు అమ్ముతారు. టన్ను మామిడికాయలో 3 నుంచి 4 సంచుల పీచు వస్తుంది. 


కూలీల ఉపాధిపై తీవ్ర ప్రభావం


మామిడికాయ దిగుబడి తగ్గి తయారీదారులు ఆమ్‌చూర్‌ వ్యాపారంపై పెద్ద ఆసక్తి చూపడం లేదు. దీంతో రెండు నెలలపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వందలాది మంది కూలీలకు ఉపాధి లభించకుండా పోయింది. ఆమ్‌చూర్‌ తయారీ కోసం ఒక తట్ట మామిడికాయలు కోసినందుకు రూ.300 వరకు సంపాదిస్తారు. మామిడికాయల దిగుబడి బాగా తగ్గడంతో కూలీలకు పనిదినాలు కూడా తగ్గాయి. వంద మంది పని చేసే చోట 20-30 మంది మాత్రమే పని చేస్తున్నారు.


 

Updated Date - 2022-05-22T05:10:05+05:30 IST