రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-17T05:15:22+05:30 IST

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ గిరీషా తెలిపారు.

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యం
మెగా చెక్కును రైతులకు అందజేస్తున్న దృశ్యం

రైతులకు చెక్కుల పంపిణీలో కలెక్టర్‌


రాయచోటి, మే 16 (ఆంధ్రజ్యోతి): రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ గిరీషా తెలిపారు. స్థానిక సాయి శుభ కల్యాణమండపంలో సోమవారం జిల్లా స్థాయి వైఎ్‌సఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం నాలుగో ఏడాది మొదటి విడత పెట్టుబడి సహాయం పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతు బాగుంటేనే.. సమాజం బాగుంటుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌ అన్నారు. జిల్లాలో 80 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారని,  నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన బిడ్డనే అన్నారు. వ్యవసాయం చేయడం అంటే నాకు ఎంతో సంతోషమన్నారు. ఇటీవల కురిసిన గాలివాన, తుఫాన్‌ వల్ల 5 వేల ఎకరాల్లో మామిడి పంట దెబ్బతిందన్నారు. నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వానికి నివేదిక అందించినట్లు తెలిపారు. ఈ ఏడాది వైఎ్‌సఆర్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ పథకం కింద జిల్లావ్యాప్తంగా 1,95,552 మంది రైతు కుటుంబాలకు రూ.107.55 కోట్లు జమ చేసినట్లు జాయింట్‌ కలెక్టర్‌ తెలిపారు. అనంతరం రైతులకు మెగా చెక్‌ను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖాఽధికారిణి ఉమామహేశ్వరమ్మ, జిల్లా ఉద్యానవన శాఖాధికారి రవీంద్రనాథరెడ్డి, జిల్లా వ్యవసాయ సలహామండలి సభ్యుడు రవిరాజు, ఏపీఐఐసీ డైరెక్టర్‌ శ్రీనివాసులరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-17T05:15:22+05:30 IST