‘రైతు డిక్లరేషన్‌’ను వివరించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-05-21T05:41:53+05:30 IST

‘రైతు డిక్లరేషన్‌’ను వివరించడమే లక్ష్యం

‘రైతు డిక్లరేషన్‌’ను వివరించడమే లక్ష్యం
మేడ్చల్‌ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న మల్లు రవి

 మేడ్చల్‌/వికారాబాద్‌/కొడంగల్‌/కులకచర్ల, మే 20(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఇటీవల వరంగల్‌ బహిరంగ సభలో ప్రకటించిన ‘రైతు డిక్లరేషన్‌’ను రాష్ట్రంలోని రైతులందరికీ వివరించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారని ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. శుక్రవారం మేడ్చల్‌లోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 21 నుంచి జూన్‌ 21 వరకు గ్రామాల్లో రచ్చబండ పేరుతో వరంగల్‌ రైతు డిక్లరేషన్‌పై రైతులకు వివరిస్తామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ, రైతులు, కౌలు రైతులకు ఏడాదికి ఎకరానికి రూ.15వేల చొప్పున పెట్టుబడి సాయం, ఉపాధి హామీ, రైతు కూలీలకు ఏటా రూ.12వేలు తదితర హామీలను రచ్చబండ కార్యక్రమంలో ప్రజలకు తెలియజేస్తామన్నారు. సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ మేడ్చల్‌ నియోజకవర్గం కో-ఆర్డినేటర్లు వజ్రే్‌షయాదవ్‌, సింగిరెడ్డి హరివర్ధన్‌రెడ్డి, దళిత నాయకుడు ప్రీతం, మహేష్‌, జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షరాలు గోగుల సరిత, ముప్ప రామారావు, కృష్ణయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

  • రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి 

వరంగల్‌ సభలో రాహుల్‌గాంధీ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ను ప్రతి ఒక్కరికీ చేర్చాలనే లక్ష్యంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచన మేరకు వికారాబాద్‌ జిల్లాలో రైతు రచ్చబండ కార్యక్రమాన్ని శనివారం నుంచి నిర్వహిస్తామని మాజీమంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌, డీసీసీ చీఫ్‌ రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రసాద్‌కుమార్‌ నివాసంలో స్థానిక నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. డిక్లరేషన్‌లోని అంశాలను ప్రతి ఇంటికీ చేర్చేలా నాయకులు, కార్యకర్తలు కృషి చేస్తారన్నారు. రైతు రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుడుతామన్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ విశ్వనాథం సత్యనారాయణ, ఎంపీపీ చంద్రకళకమాల్‌రెడ్డి, వికారాబాద్‌ పట్టణ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కిషన్‌, రత్నారెడ్డి, ఎర్రవల్లి జాఫర్‌, మహిపాల్‌రెడ్డి, రఘుపతిరెడ్డి, సతీష్‌, రవిశంకర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, కొడంగల్‌ మండలం అంగడిరైచూర్‌లో నేడు జరిగే రచ్చబండ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ మండలాల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షులు, రైతులు, పార్టీ కార్యకర్తలు, రేవంత్‌రెడ్డి అభిమానులు అధిక సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్‌ మండల నాయకులు పిలుపునిచ్చారు. కొడంగల్‌లో రేవంత్‌రెడ్డి స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. రచ్చబండ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి రానున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో కులకచర్లలో నేడు(శనివారం) రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు టి.రామ్మోహన్‌రెడ్డి రచ్చబండలో పాల్గొంటారని చెప్పారు. పార్టీ మండలాధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు, కార్యదర్శి గోపాల్‌నాయక్‌, మాజీ ఎంపీపీ అంజిలయ్యగౌడ్‌, ఎంపీటీసీ ఆనందం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T05:41:53+05:30 IST