వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తదితరులు
డిప్యూటీ సీఎం నారాయణస్వామి
చిత్తూరు కలెక్టరేట్, జనవరి 18: భూ సమస్యలనేవి లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తెలిపారు. మంగళవారం తాడేపల్లె సీఎం క్యాంపు కార్యాలయం నుంచి భూ హక్కు- భూ రక్షా పథకం మొదటి దశ భూ రికార్డులను ప్రజలకు అంకితం చేస్తూ సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చిత్తూరు కలెక్టరేట్ నుంచి ఈ కాన్ఫరెన్స్‌కు డిప్యూటీ సీఎం హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జీడీ నెల్లూరు మండలంలోని అగరమంగళం, గుడిపాల మండలంలోని ముత్తుకూరుపల్లె, చంద్రగిరి మండలంలోని నరసింగాపురం, వాల్మీకిపురం మండలంలోని జమ్మాలపల్లెలోని సచివాలయాల్లో రిజిస్ర్టేషన్లు ప్రారంభమయ్యాయని చెప్పారు. అలాగే ముత్తుకూరుపల్లెలో 165, అగరమంగళంలో 926, నరసింగారపురంలో 126, జమ్మాలపల్లెలో 150 ఎకరాల రీసర్వే జరిపామన్నారు. రానున్న రోజుల్లో 65 మండలాల్లోని అన్ని గ్రామాల్లో రీసర్వే చేపడతామన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ.. వందేళ్ల తర్వాత ఆధునిక సమగ్ర భూ సర్వే చేపట్టినట్లు పేర్కొన్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో అన్ని రికార్డులను అప్‌డేట్ చేశామన్నారు. చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, జడ్పీ చైర్మన్ వాసు, ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి, రాష్ట్ర పాల ఏకరి చైర్మన్ మురళీధర్, పీఎంకే చైర్మన్ వెంకటరెడ్డియాదవ్, మేయర్ అముద, డీఆర్వో మురళి తదితర అధికారులు పాల్గొన్నారు.