కొందరు నమ్మిన దానికే కట్టుబడి ఉంటారు. ఎంత డబ్బు ఇచ్చినా కూడా దానినే పాటిస్తారు. ఒక అమెరికన్ నటుడికి వ్యాక్సిన్ వేసుకోవడం ఇష్టం లేదు. వ్యాక్సిన్ వేసుకుని షూటింగ్‌కు రావాలని చెప్పగా అందుకు నిరాకరించారు. టీకా వేసుకోవడానికి నిరాకరించి దాదాపుగా 9మిలియన్ డాలర్ల (దాదాపుగా రూ.66కోట్లు)పాత్రను పొగొట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే..
ఐస్ క్యూబ్ ఒక అమెరికన్ నటుడు, ర్యాపర్. సోని టీవీ నిర్మించబోయే ‘‘ ఓ హెల్ నో ’’ అనే కామెడి షోలో నటించాల్సి ఉంది. ఆ కామెడీ షోలో నటించేందుకు ఆయనకు పారితోషికంగా 9మిలియన్ డాలర్లను(దాదాపుగా రూ.66కోట్లు) చెల్లించడానికి నిర్మాతలు అంగీకరించారు. షూటింగ్‌కు వచ్చే ముందు వ్యాక్సిన్ వేసుకుని రావాల్సిందిగా వారు సూచించారు. కానీ, ఆయన టీకాను వేసుకోవడానికి నిరాకరించారు. పారితోషికాన్ని వదులుకోవడానికి సిద్దపడి ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు.
ఈ కామెడీ షోలో నటించాలంటే తప్పకుండా అందరూ వ్యాక్సిన్ వేసుకోని రావాలని నిర్మాతలు ముందుగానే చెప్పారు. ఐస్‌క్యూబ్ ప్రతినిధులు ఇంతవరకు దీనిపై స్పందించలేదు. 2020 జూన్‌లో ఐస్‌క్యూబ్ కరోనాపై ఒక ట్వీట్ చేశారు. ‘‘ ప్రపంచంలోని డాక్టర్లలందరూ కరోనా వైరస్‌పై అబద్ధాలు చెప్పడం ఆపేయండి. ప్రజలందరికీ నిజాలు మాత్రమే కావాలి ’’ అని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం సోనీ ఎంటర్టైన్మెంట్ ఐస్ క్యూబ్ పాత్ర కోసం మరొకరిని వెతికే పనిలో పడింది.