Jul 26 2021 @ 04:00AM

నాలోని నటుణ్ణి వెలికితెచ్చే పాత్ర చేశా!

‘‘హీరోగా ప్రయాణం ప్రారంభించిన తొలినాళ్లలోనే ఇటువంటి సినిమాలో చేసే అవకాశం రావడం నా అదృష్టమనుకుంటున్నాను. చాలా అరుదుగా ఇటువంటి పాత్ర చేసే అవకాశం వస్తుంది. కథ, కథనంతో సంబంధం లే కుండా నా నటన గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారు. నాలోని నటుణ్ణి వెలికితెచ్చే పాత్ర పోషించా’’ అని తేజా సజ్జా అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘ఇష్క్‌’. నాట్‌ ఎ లవ్‌ స్టోరి... ఉపశీర్షిక. థియేటర్లలో శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా తేజా సజ్జా చెప్పిన సంగతులు...


కరోనా రెండో దశ తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు వస్తారో? రారో? అనే సంశయాల నడుమ కథపై నమ్మకంతో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగల సత్తా ఉన్న చిత్రమిది. హీరో హీరోయిన్‌ ప్రేమకథలకు పూర్తి భిన్నమైనది. మూసధోరణిలో ఉండదు. ఎంతో అనుభవమున్న ఆర్‌బీ చౌదరిగారు ఏడేళ్ల తర్వాత ఈ సినిమా నిర్మిస్తున్నారంటే కథపై ఉన్న నమ్మకమే కారణం.


ఓ వ్యక్తి జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల సమాహారమే ఈ చిత్రం. ‘తర్వాత ఏం జరుగుతుంది?’ అనే ఉత్కంఠ కలిగిస్తూ, ఊహకు అందని మలుపులతో సినిమా సాగుతుంది. కథనం కొత్తగా ఉంటుంది. సినిమాలో సన్నివేశాలు, పతాకస్థాయి భావోద్వేగాలు ఆద్యంతం ప్రేక్షకుణ్ణి కుర్చీ అంచున కూర్చోబెడతాయి. రీమేక్‌ చిత్రమైనా... తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా చాలా మార్పులు చేశాం. దాదాపు 20 నిమిషాల నిడివి తగ్గించాం. అయితే, మూలకథను మార్చలేదు. ప్రస్తుతం పరిశ్రమలో నిలదొక్కుకోవాలంటే ఇటువంటి ప్రయోగాలు చేయాల్సిందే.


ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ అభినయం ఈ సినిమాకు ప్రధానాకర్షణ. సెట్స్‌లో గ్లామర్‌ హంగులకు దూరంగా ఉంటుంది.


నా తదుపరి చిత్రం ‘హను-మాన్‌’కు పురాణాలతో సంబంధం లేదు. సూపర్‌హీరో కథాంశంతో తెరకెక్కుతోంది. ఇప్పటికి 15 రోజులు చిత్రీకరణ చేశాం. అక్టోబర్‌కు పూర్తి చేయాలని భావిస్తున్నాం. పాన్‌ ఇండియా స్థాయిలో, ఐదు భాషల్లో విడుదలవుతుంది. ఆ సినిమా హీరోగా నా స్థాయిని మరింత పెంచేలా ఉంటుందని నమ్మకంగా చెప్పగలను.