రాజయ్యపేటలో మానవహారంగా ఏర్పడిన విద్యార్థినులు
పలు పార్టీల నాయకులు, మత్స్యకారులు, విద్యార్థుల డిమాండ్
రాజయ్యపేటలో మానవహారం
తహసీల్దార్ కార్యాలయం వరకూ ర్యాలీ
నక్కపల్లి, జనవరి 24 : మండలంలోని రాజయ్యపేటలో మైనర్ బాలికను తీవ్రంగా హింసించి, అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుడ్ని ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా త్వరగా కఠినంగా శిక్షించాలంటూ ఆ గ్రామ మహిళలు, పలు పార్టీల నాయకులు, విద్యార్థినులు భారీ ఆందోళన చేపట్టారు. రాజయ్యపేట గ్రామంలో సోమవారం అంగన్వాడీ కార్యకర్తలు, పాఠశాల బాలికలు, ఆ గ్రామ పెద్దలతో కలిసి మానవహారం నిర్వహించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వీసం రామకృష్ణ, టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు కొప్పిశెట్టి వెంకటేశ్, జడ్పీటీసీ సభ్యురాలు గోసల కాసులమ్మ, రాజయ్యపేట సర్పంచ్ పిక్కి అప్పలనర్స, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు ఎం.అప్పలరాజు, సీడీపీవో నీలిమ, ఐద్వా జిల్లా కార్యదర్శి ఎస్.అరుణ తదితరులు సంఘీభావం తెలిపారు. నిందితుడ్ని శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. గ్రామ పెద్దలు, మత్స్యకార నాయకులు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం నిర్భయ చట్టం ప్రకారం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుం డా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద డీటీకి వినతిపత్రం అందజేశారు. మత్స్యకార నాయకులు పిక్కి కామేశ్వరరావు, ఎం.అప్ప లరాజు, ఎరుపిల్లి నాగేశ్, పిక్కి స్వామి, తాతీలు, రాంబాబు, కోదండరావు, యజ్జల బంగార్రాజు, తదితరులు పాల్గొన్నారు.