అసంబద్ధ పీఆర్సీని రద్దు చేయాల్సిందే

ABN , First Publish Date - 2022-01-28T06:16:31+05:30 IST

అసంబద్ధ పీఆర్సీని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

అసంబద్ధ పీఆర్సీని రద్దు చేయాల్సిందే
రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న ఉద్యోగులు

 రిలే నిరాహార దీక్షలో ఉద్యోగ సంఘాల డిమాండ్‌

కర్నూలు, జనవరి 27(ఆంధ్రజ్యోతి): అసంబద్ధ పీఆర్సీని రద్దు చేసే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగ సంఘాల నాయకులు స్పష్టం చేశారు. పీఆర్సీ ఉద్యమ సాధన కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి నాలుగు జేఏసీల ఆధ్వర్యంలో ధర్నా చౌక్‌ వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తొలి రోజు దీక్షలో కర్నూలు డివిజన్‌ పరిధిలోని ఉద్యోగులు పాల్గొన్నారు. ఏపీజేఏసీ సెక్రటరీ జనరల్‌ హృదయరాజు మాట్లాడుతూ అశుతోశ్‌ మిశ్రా కమిటీ నాలుగేళ్ల పాటు శ్రమించి పీఆర్సీ నివేదిక ఇస్తే దాన్ని కాదని సీఎస్‌ కమిటీ ఇచ్చిన నివేదికను అమలు చేయడం దారుణమన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత పీఆర్సీ వస్తే ఐఆర్‌ కన్నా తక్కువ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని, పైగా ఇక నుంచి పదేళ్లకోసారి కేంద్రం మాదిరి పీఆర్సీ ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. పోరాడి సాధించుకున్న హెచ్‌ఆర్‌ఏను శ్లాబులుగా మార్చి ఇవ్వడం వల్ల ఉద్యోగులు చాలా నష్టపోతున్నారన్నారు. అడిషనల్‌ క్వాంటం పెన్షన్‌ విధానాన్ని తీసివేయడం తగదన్నారు. పాదయాత్రలో భాగంగా కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, వారికి మిగతా ఉద్యోగుల మాదిరే జీతాలు ఇస్తామని చెప్పి ఇపుడు మాట మార్చడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 62 ఏళ్లకు పెంచడం వల్ల నిరుద్యోగులకు నష్టం వాటిల్లుతోందని, నాలుగో తరగతి ఉద్యోగులకు తప్ప మిగతా వారికి రిటైర్మెంట్‌ వయసు గతంలో మాదిరే ఉంచాలని డిమాండ్‌ చేశారు. ఏపీజేఏసీ నాయకుడు సీహెచ్‌ వెంగళరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన పీఆర్సీ వల్ల ఉద్యోగులు నష్టపోతున్నా, ప్రభుత్వం మాత్రం ఉద్యోగులకు మేలు చేస్తున్నామని చెప్పడం అన్యాయమన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన యాప్‌ల వల్ల ఉద్యోగులకు పనిభారం ఎక్కువ అవుతోందని, ఎపుడెపుడు వీఆర్‌ఎస్‌ తీసుకుని రిటైర్‌ అవుదామా అని చూస్తున్నారని అన్నారు. సచివాలయ ఉద్యోగులు పీజీలు చదివి రూ.15 వేలకే ఉద్యోగాలు చేస్తున్నారని, వారిని పర్మినెంట్‌ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని మండిపడ్డారు. సీపీఎస్‌ రద్దు గురించి ప్రభుత్వం మాట మారుస్తోందన్నారు. దీక్షలో ఏపీజీఈఏ నాయకులు, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-28T06:16:31+05:30 IST