24ఏళ్ల యువతి.. ‘ఆపరేషన్ గంగా’లో ముఖ్య పాత్ర.. తాజాగా కీలక విషయాలు వెల్లడి!

ABN , First Publish Date - 2022-03-12T21:01:07+05:30 IST

ఆమె పేరు మహాస్వేత చక్రబర్తి. వయసు కేవలం 24ఏళ్లు మాత్రమే. కానీ భారత ప్రభత్వం కొద్ది రోజుల క్రితం ప్రాంభించిన ‘ఆపరేషన్ గంగా’లో కీలక పాత్ర పోషించింది. సుమారు 800 మంది భారత విద్యార్థులను ఉక్రెయి

24ఏళ్ల యువతి.. ‘ఆపరేషన్ గంగా’లో ముఖ్య పాత్ర.. తాజాగా కీలక విషయాలు వెల్లడి!

ఎన్నారై డెస్క్: ఆమె పేరు మహాస్వేత చక్రబర్తి. వయసు కేవలం 24ఏళ్లు మాత్రమే. కానీ భారత ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం ప్రాంభించిన ‘ఆపరేషన్ గంగా’లో కీలక పాత్ర పోషించింది. సుమారు 800 మంది భారత విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా ఇండియాకు తరలించింది. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో తన అనుభవాలను పంచుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రష్యా-ఉక్రెయిన్ మధ్య ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైంది. దీంతో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న సుమారు 20వేల మంది భారత విద్యార్థులు, పౌరుల విషయంలో భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసకుంది. అక్కడ చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు ఫిబ్రవరి 26న ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించింది. అంతేకాకుండా ప్రైవేటు విమాన సంస్థలు కూడా ఇందులో పాల్గొనాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే కోల్‌కతాకు చెందిన 24ఏళ్ల మహాస్వేత చక్రబర్తి రంగంలోకి దిగింది. ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో పని చేస్తూ.. భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించింది. 6 విమానాల ద్వారా 800పైగా విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చింది. 



కాగా.. తాను పని చేస్తున్న సంస్థ నుంచి అర్ధరాత్రి వేళ తనకు ఫోన్ రావడంతో.. కేవలం రెండు గంటల్లోనే విధుల్లో చేరిపోయి ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు తాజాగా వెల్లడించింది. రోజుకు 13-14 గంటలు విమానం నడిపినట్లు చెప్పిన ఆమె.. విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యం ఇచ్చి అందులో పాల్గొన్నట్టు వివరించారు. అంతేకాకుండా ‘ఉక్రెయిన్-రష్యా భయాందోళనల మధ్య అక్కడ చిక్కుకున్న ఓ 21ఏళ్ల విద్యార్థినికి తీవ్ర ఒత్తిడి వల్ల ఫిట్స్ వచ్చాయి. కొద్ది సమయం తర్వాత ఆ విద్యార్థి స్పృహలోకి వచ్చింది. తర్వాత నా చేతిని పట్టుకుని సింపుల్‌గా తనను తన తల్లి దగ్గరకు చేర్చాలని కోరింది’ అని తనకు ఎదురైన అనుభవాన్ని మహాస్వేత చక్రబర్తి పేర్కొన్నారు. ఈ సంఘటనను తన జీవితంలో మర్చిపోలేనని వెల్లడించారు. 


ఇదిలా ఉంటే.. మహాస్వేత చక్రబర్తి ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ‘ఆపరేషన్ గంగా’కు ముందు వందే భారత్ మిషన్‌లో కూడా ఈమె పాల్గొన్నారు. వందలాది ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వ్యాక్సిన్‌లను కోల్‌కతాకు తరలించారు.




Updated Date - 2022-03-12T21:01:07+05:30 IST