త్యాగానికి ప్రతీక మొహర్రం

ABN , First Publish Date - 2022-08-10T06:45:53+05:30 IST

త్యాగానికి ప్రతీక మొహర్రం

త్యాగానికి ప్రతీక మొహర్రం

మచిలీపట్నం టౌన్‌, ఆగస్టు 9 : ఇమాం హుస్సేన్‌ త్యాగనిరతికి, సహనానికి ప్రతీక మొహర్రం అని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నం కోనేరుసెంటర్‌లో నిర్వహించిన చెస్ట్‌బీటింగ్‌ కార్యక్రమంలో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. గాయాలకు గురయిన ముస్లింలకు రవీంద్ర, మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబా ప్రసాద్‌,  ఇలియాస్‌ పాషా, సయ్యద్‌ ఖాజా, ఆసుపత్రి మాజీ డైరెక్టర్‌ అజీం, తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు హసీంబేగ్‌,  ఫిరోజ్‌, యూసూఫ్‌ బేగ్‌ సేవలందించారు. కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, చిత్తజల్లు నాగరాము, దింటకుర్తి సుధాకర్‌, అన్నం ఆనంద్‌, దేవరపల్లి అనిత, మరకాని పరబ్రహ్మం, పి.వి. ఫణికుమార్‌, పడమట నాగరాజు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేశారు.

గుడివాడ : మొహర్రం పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణంలోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మియాఖాన్‌ మసీదు ప్రార్థనల్లో వైసీపీ రాష్ట్ర నాయకుడు దుక్కిపాటి శశిభూషణ్‌ పాల్గొని ఉపవాస దీక్షలను విరమింపచేశారు. పట్టణంలోని మసీదులు మంగళవారం ఖురాన్‌ పఠించి శాంతిస్థాపనకు ప్రాణాలు త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకున్నారు. టీడీపీ గుడివాడ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు ముస్లింలకు మొహర్రం శుభాకాంక్షలు తెలిపారు. 

చల్లపల్లి : త్యాగాలకు ప్రతీక మొహర్రం షహదత్‌ను ముస్లింలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పీర్ల ఆస్థానా వద్ద నుంచి అలంకరించిన పీర్లను యువకులు పురవీధుల్లో ఊరేగించారు. ముస్లింలు వారికి స్వాగతం పలికి నీరువారుపోసి ధుని, పానకం, మరమరాలు, బెల్లం సమర్పించారు. చల్లపల్లిలోని తూర్పు, పడమరవైపు ఉన్న పీర్ల పంజా ఆస్థానాల కమిటీల ఆధ్వర్యంలో ఈ మొహర్రం షహదత్‌ కార్యక్రమాలు జరిగాయి.

గుడ్లవల్లేరు : మండలంలో పవిత్ర మొహర్రంను ఘనంగా నిర్వహించారు. కౌతవరం కొత్తపేటకు చెందిన ముస్లింలు పీర్ల గ్రామో త్సవం ఘనంగా నిర్వహించారు. డోకిపర్రు తురాయిపాలెంలో పీర్ల ఊరేగింపు నిర్వహించి పండుగను ఘనంగా నిర్వహించారు.

నాగాయలంక : మొహర్రం పండుగను ముస్లింలు మంగళవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నాగాయలంక లోని జామియా మసీదులో మత పెద్ద షేక్‌ సత్తార్‌ ఖురాన్‌ గ్రంథాన్ని పఠించి, మొహర్రం విశిష్టతను తెలిపారు. త్యాగానికి ప్రతీక అని అభివర్ణించారు. మండలంలోని ముస్లింలు మసీదుకి వచ్చి ప్రార్థనలు చేశారు.

కూచిపూడి: మొహర్రం సందర్భంగా కాజ గ్రామంలో  భారీ ఇమామ్‌ ఊరేగింపు కార్యక్రమం జరిగింది. వారి త్యాగాలు సమర్పించుకుంటూ నిప్పులు గుండం కార్యక్రమం జరిగింది. ఇందులో మాజీ వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌ సయ్యద్‌ మతిన్‌, ముజవర్‌ ఎండి.హుస్సేన్‌, ఎస్‌.డి.మజీద్‌, ఎస్‌కె.ఇస్మాయిల్‌, ఎస్‌.డి.బాజీ, ఎస్‌.కె.ఉస్మాన్‌, బహదూర్‌ ఆలీ తదితరులు పాల్గొన్నారు. 

తోట్లవల్లూరు  : తోట్లవల్లూరు, ఐలూరులో మంగళవారం మొహర్రం వేడుకలు జరిగాయి. త్యాగానికి ప్రతీకకగా నిలిచే మొహర్రం  వేడుక సందర్భంగా మసీదు వద్ద యువకులు రక్తతర్పణం చేశారు. అనంతరం పీర్ల ఊరేగింపు నిర్వహించారు. సోమవారం రాత్రి పలువురు యువకులు నిప్పుల గుండంలో నడిచారు. ఈ కార్యక్రమాన్ని కమిటీ పెద్దలు షేక్‌ జబ్బార్‌, అమీర్‌ఖాన్‌ పఠాన్‌, షేక్‌ భాషా, షేక్‌ హసన్‌ పర్యవేక్షించారు.


Updated Date - 2022-08-10T06:45:53+05:30 IST