Jul 28 2021 @ 04:35AM

అందువల్లే అలా స్పందించా!

‘‘శరణ్‌ నాయర్‌ అని మాకో స్నేహితుడున్నాడు. మేం రష్యా వెళ్లినప్పుడు తను సరదాగా వ్లోగ్స్‌ చేశాడు. ఓ వ్లోగ్‌లోని 10సెకన్ల నిడివి గల వీడియో తీసుకుని వెబ్‌ మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్టు రాశారు. అందువల్లే, నా స్నేహితులతో నేనేం చేస్తున్నానన్నది నా వ్యక్తిగత నిర్ణయమని స్పందించా’’ అని ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ అన్నారు. తెలుగులో ఆమె నటించిన ‘ఇష్క్‌’ శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా, రష్యా పర్యటన, ఇతర సంగతుల గురించి మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలివీ...


‘‘నన్ను సంప్రదించిన రెండు రోజుల్లోనే ‘ఇష్క్‌’లో నటిస్తానని చెప్పా. అప్పటికే మలయాళ ‘ఇష్క్‌’ చూశా. సాధారణ ప్రేమకథ కాదు. కొత్తగా ఉంటుంది. అయితే, అందులో కథానాయిక చేసినట్టు కాకుండా నా శైలిలో నటించమని దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజు చెప్పారు. ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. చాలా ఇంటెన్స్‌ ఫిల్మ్‌ కావడంతో సవాలుగా తీసుకుని నటించా.


‘ఓ బేబీ’ చూశా. తేజా సజ్జా బాగా నటించాడు. అయితే, అప్పుడు తన పేరు నాకు తెలియదు. ‘ఇష్క్‌’లో హీరో తేజా అని చెప్పారు. ఫొటో చూసి ‘ఓ... పేరు తేజానా’ అనుకున్నా. చిత్రీకరణలో, తెలుగు డైలాగులు చెప్పడంతో నాకు చాలా సహాయపడ్డాడు. సెట్స్‌లో హుషారుగా ఉంటాడు. అందర్నీ నవ్విస్తాడు. మెగా సూపర్‌గుడ్‌ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ఆర్‌బి చౌదరి, ఎన్వీ ప్రసాద్‌, వాకాడ అప్పారావు, పారాస్‌ జైన్‌లకు థ్యాంక్స్‌.


మలయాళ సినిమా రీమేక్‌ అయినప్పటికీ... కథలో ఆత్మను చెడగొట్టకుండా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మార్పులు చేశాం. మలయాళంలో కథాబలమున్న చిత్రాలు ఎక్కువ. తెలుగులో కమర్షియల్‌ చిత్రాలెక్కువ. మలయాళ ప్రేక్షకుల అభిరుచి వేరు. తెలుగు ప్రేక్షకుల అభిరుచి వేరు. అక్కడికి, ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. సినిమా ఏదైనా ప్రేక్షకులకు వినోదం అందించడమే మా లక్ష్యం. కథాబలమున్న చిత్రాల మధ్య కమర్షియల్‌ చిత్రాలూ కావాలి. ఎప్పుడూ కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చూడలేం కదా! నటిగా కమర్షియల్‌, కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చేస్తా. రెండూ చేయడం నాకిష్టమే.


ప్రస్తుతం తెలుగులో సందీప్‌ కిషన్‌తో ఓ సినిమా చేస్తున్నా. హిందీలో రెండు చిత్రాలు ఉన్నాయి. మలయాళంలో మంచి కంటెంట్‌ బేస్డ్‌ సినిమా చేయాలని, అటువంటి కథ కోసం ఎదురుచూస్తున్నా.


ఇటీవల రష్యా వెళ్లొచ్చా. నా స్నేహితుల్లో ఒకరు కుటుంబంతో సహా అక్కడ స్థిరపడ్డారు. అతను స్నేహితులందర్నీ ఒకసారి కలవాలనుకున్నాడు. రెండు మూడేళ్ల తర్వాత విదేశాలు వెళ్లే అవకాశం వచ్చింది. సరేనని స్నేహితులతో నేనూ వెళ్లా. మేమంతా పది రోజులు సరదాగా ఎంజాయ్‌ చేశాం.’’