ముంజ తింటే కూల్‌.. కూల్‌!

ABN , First Publish Date - 2022-05-09T05:02:05+05:30 IST

ముంజ తింటే కూల్‌.. కూల్‌!

ముంజ తింటే కూల్‌.. కూల్‌!
కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రి సమీపంలో తాటి ముంజల విక్రయం

  • ఎండల దుష్ప్రభావాలకు విరుగుడు తాటి ముంజలు
  • చిన్నా, పెద్ద అందరూ తినే సహజసిద్ధ పదార్థం
  • ఆటోలు, బైక్‌లపై తెచ్చి అమ్మకాలు
  • రూ.60కి డజన్‌ చొప్పున విక్రయాలు
  • కొడంగల్‌, వికారాబాద్‌, పరిగి ప్రాంతాల్లో విరివిగా లభ్యం

కొడంగల్‌ రూరల్‌/పరిగి మే 8: వేసవి వేడి విరుగుడుకు మంచి పదార్థం తాటి ముంజలు అనడంలో అతిశయోక్తి లేదు. ఏప్రిల్‌, మే నెలల్లో రాష్ట్రం అంతటా తాటి ముంజలు విరివిగా లభిస్తాయి. అదే తీరుతో వాటికి డిమాండ్‌ ఉంటుంది కూడా. చల్లదనాన్నిచ్చి, ఆరోగ్యానికి మేలు చేసేవి.. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేని సహజ సిద్ధ పదార్థం తాటి ముంజలు. వేసవిలో వాటి క్రేజే వేరు. ఎండ నుంచి ఉపశమనానికి ముంజలకు మించిన పదార్థం లేదు. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ఇవి లభిస్తున్నాయి. తాటి చెట్ల నుంచి ఆటోలు, బైక్‌లపై తెచ్చి వాటిని రోడ్ల పక్కన, పట్టణాల్లో అమ్ముతున్నారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ముంజలంటే చిన్నాపెద్ద అంతా ఇష్టపడుతారు.


  • ఐస్‌ యాపిల్‌కు ఉన్న ఆదరణే వేరు!

తాటి ముంజలను కన్నడంలో తాటి నుంగులు అంటారు. ముంజలు శరీరానికి చల్లదనాన్నిస్తాయి. వీటిని ఐస్‌ యాపిల్‌ అని కూడా పిలుస్తారు. దీన్ని బట్టే తెలుస్తోంది.. వీటిల్లో లభ్యమయ్యే పోషకాలెన్ని ఉంటాయనేది. ఎండ కాలంలో దీన్ని చాలా మంది తింటారు. కుల్కచర్ల, దోమ, అంతారం, పరిగి రూరల్‌ ప్రాంతాల నుంచి ఆటోల్లో తెచ్చి రోడ్ల పక్కన, బస్టాండ్ల వద్ద, హైవేల చెంత టెంటు వేసుకొని ముంజలు అమ్ముతున్నారు. ముంజలు గర్భిణుల ఆరోగ్యానికి మరింతగా ప్రభావ వంతంగా పనిచేస్తాయి. సులువుగా జీర్ణం అవుతాయి. గ్యాస్‌ ట్రబులున్న వారు ముంజలు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగవుతుందని వైద్యులూ సూచిస్తారు.


  • ముంజలతో ఉపయోగాలివీ ...

తాటి ముంజల్లోని నీరు(తాటి కల్లులాంటి పదార్థం) దివ్వ ఔషధం. ఎంత ఎండలోనైనా చలువ చేస్తుంది. వృద్ధులకు, పిల్లలకు, గర్భిణులకు, శారీరకంగా బలహీనంగా ఉన్న వారికి తక్షణ ఉపశమనం, శక్తి ఇస్తుంది.

వాంతులు, కడుపు వికారంగా ఉన్నప్పుడు ముంజలు తింటే పది నిమిషాల్లోగా ఉపశమనం పొందుతారు.

చర్మం పొడిబారకుండా రక్షణ కవచంగా పనిచేస్తుంది. ఎండ కాలంలో రోజూ రెండు ముంజలు తింటే శరీరం ఆరోగ్యంగా, కాతివంతంగా ఉంటుంది. దురద సమస్యా రాదు.

ముంజలతో జీర్ణవ్యవస్థ బాగా పనిచేసి అలర్జీ, ఎసిడిటీ సమస్యలు రావు.

ముంజల్లోని సోడియం, పొటాషియం, ఎలక్ర్టోలైట్లు డీహైడ్రేషన్‌ రాకుండా శరీల సమతుల్యతను కాపాడుతాయి. ఎండలతో శరీరం కోల్పోయే పోషకాలన్నింటినీ శీఘ్రంగా అందజేస్తాయి.

Read more