ఆ.. ఏమవుతుందిలే..!

ABN , First Publish Date - 2022-01-25T05:26:28+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది.

ఆ.. ఏమవుతుందిలే..!
ఆదోనిలో ఇలా..

  1. కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ పట్ల నిర్లక్ష్యం
  2. మాస్కులు ధరించని జనం
  3. లక్షణాలు ఉంటే సొంత వైద్యం
  4. చూసీ చూడనట్లుగా అధికారులు
  5. ఆందోళన కలిగిస్తున్న వైరస్‌ ఉధృతి


జిల్లాలో కొవిడ్‌ థర్డ్‌వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ సామాజిక వ్యాప్తి దశకు చేరిందని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. జిల్లాలో సోమవారం 1,551 కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 28.14 శాతంగా నమోదైంది. వారం వ్యవధిలో కరోనా కేసులు ఏడు రెట్లు పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో జనం ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లకూడదు. మాస్కు లేకుండా ఇంటి నుంచి కాలు బయట  పెట్టకూడదు. కానీ ఇవేవీ కనిపించడం లేదు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలు, మార్కెట్లు.. ఎక్కడ చూసినా రద్దీ ఉంటోంది. మాస్కులు ధరించకుండానే నిర్భీతిగా తిరుగుతున్నారు. కర్నూలు నగరంలోని పలు ప్రాంతాల్లో సగం మంది మాస్కులు లేకుండానే తిరుగుతున్నారు. వాహన ప్రయాణాల్లోనూ ఇదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. ‘ఆ ఏమౌతుందిలే.. లక్షణాలు ఉంటే డోలో, సిట్రిజెన్‌ వాడితే అయిపాయ..’ అనుకుంటున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణి వైరస్‌ ఉధృతికి కారణమౌతోంది. 


కర్నూలు(హాస్పిటల్‌), జనవరి 24: జిల్లాలో మాస్కును ధరించడం మొక్కుబడిగా కనిపిస్తోంది. చాలా మంది వాటిని ధరించడమే లేదు. రద్దీ ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతున్నారు. మాస్కు ధరించని వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి. అయినా జిల్లాలో తనిఖీలు, జరిమానాలు నామమాత్రంగా జరుగుతున్నాయి. పోలీసులు వాహనదారులపై మాత్రమే నిఘా పెడుతున్నారు. మిగిలినవారు మాస్కులు ధరించకపోయినా పట్టించుకోవడం లేదు. భౌతికదూరం, శానిటైజర్ల వినియోగం కూడా బాగా తగ్గిపోయింది. 


నాయకులూ అంతే..

వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా కరోనా నిబంధనలు పాటించడం లేదు. సభలు, సమావేశాలు జరిగినప్పుడు కొంతమంది మాస్కులు  ధరించడం లేదు. వారే ఇలా వ్యవహరించడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ఆదోనిలోనూ అంతే..

ఆదోని(అగ్రికల్చర్‌): ఆదోనిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో గత నెల నుంచి ఇప్పటి వరకు 250 పైగా కేసులు నమోదయ్యాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఉంటుంది. అయినా ప్రజలు మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదు. రెవెన్యూ డివిజన్‌ కేంద్రం కావడంతో నిత్యం ఐదు నియోజకవర్గాల నుంచి వేలాది మంది వచ్చి వెళుతుంటారు. నిత్యావసర సరుకులు, కూరగాయలు, వైద్యం, మార్కెట్‌ యార్డు, దుస్తులు తదితర పనుల మీద వచ్చేవారితో ఆదోని కిటకిటలాడుతుంటుంది. వీరిలో చాలా మంది మాస్కులు ధరించడం లేదు. గ్రామీణ ప్రజలతోపాటు పట్టణ ప్రజల్లోనూ ఇదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. రద్దీగా ఉండే ఎంఎం రోడ్డు, ఝాన్సీలక్ష్మీబాయి కూరగాయల మార్కెట్‌, షరాఫ్‌ బజార్‌, సూపర్‌ బజార్‌, పెద్దమసీదు ఏరియా, వసంత టాకీస్‌ రోడ్డు, కాలేజీ రోడ్డు, తిక్కస్వామి దర్గా సర్కిల్‌, కొత్త బస్టాండ్‌, పీఎన్‌ రోడ్డు వంటి ప్రాంతాల్లో రద్దీ ఎక్కువ. ఇలాంటి ప్రాంతాల్లోనూ కొవిడ్‌ నిబంధనలు అమలు కావడం లేదు. 


నంద్యాలలో ఇలా..

నంద్యాల టౌన్‌, జనవరి 24: నంద్యాలలో గత పది రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. రోజూ వందల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం జిల్లాలోనే అత్యధికంగా 328  కేసులు వెలుగు చూశాయి. ఈ వేవ్‌లో ఆరోగ్యపరంగా తీవ్రత తక్కువగా కనిపిస్తోంది. దీంతో జనం జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చినా హోం ఐసొలేషన్‌లో ఉంటూ, మందులు వాడుతున్నారు. కొవిడ్‌ కేర్‌ సెంటర్లకు వెళ్లడానికి చాలామంది మొగ్గుచూపడం లేదు. గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, జలుబు, గొంతు జీర పోవడం లాంటివి సాధారణంగా వచ్చేవేనని జనం తేలిగ్గా తీసుకుంటున్నారు. ఈ లక్షణాలలో ఏవో కొన్ని కనిపిస్తే డాక్టర్ల సలహా మేరకు కొందరు మందులు వాడుతున్నారు. మరికొందరు మెడికల్‌ షాపులకు వెళ్లి కొని వాడుతున్నారు. లక్షణాలు ఉన్నా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకునేందుకు మొగ్గు చూపడం లేదు. పాజిటివిటీ పర్సంటేజీ ఎక్కువగా ఉందని, ప్రజలందరూ కచ్చితంగా జాగ్రత్తలు పాటిస్తేనే నియంత్రణ సాధ్యమని వైద్యులు హెచ్చరి స్తున్నారు. కానీ జనం పెడచెవిన పెడుతున్నారు. మాస్కులు లేకుండా నిర్లక్ష్యంగా బయట తిరుగు తున్నారు. రద్దీ ప్రాంతాల్లో భౌతిక దూరం మాటే కనిపించడం లేదు. 


కస్తూర్బాలో 22 మందికి పాజిటివ్‌

పెద్దకడబూరు, జనవరి 24: పెద్దకడబూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో కరోనా కలకలం రేపింది. సోమవారం కేజీబీవీ పాఠశాల ప్రిన్సిపాల్‌ చైతన్య స్రవంతి మాట్లాడుతూ 17 మంది విద్యార్థు లకు, ఐదుగురు టీచర్లకు కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపారు. దీంతో డీఈవో ఆదేశాల మేరకు పాఠశాలకు మూడు రోజులు పాటు సెలవులు ప్రకటించినట్లు చెప్పారు.


మాస్కు మరిచిపోవద్దు..

థర్డ్‌ వేవ్‌ వైరస్‌ ఉధృతంగా వ్యాపిస్తోంది. కొందరు భయం లేకుండా ఇష్టమొచ్చినట్లు రోడ్లపై తిరుగుతున్నారు. వైరస్‌ ప్రభావం లేదని చాలామంది మాస్కులు పెట్టుకోవడం లేదు. ప్రతి ఒక్కరూ మాస్కు పెట్టుకుని భౌతికదూరం పాటించాలి. శానిటైజర్‌ వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి. 

 - డా.సి. ప్రభాకర్‌ రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్‌, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి 

Updated Date - 2022-01-25T05:26:28+05:30 IST