అప్పుడు 80పైనే.. ఇప్పుడు 60.28 శాతం

ABN , First Publish Date - 2021-04-09T06:26:13+05:30 IST

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు.

అప్పుడు 80పైనే.. ఇప్పుడు 60.28 శాతం

  1. సర్పంచు ఎన్నికల కన్నా తగ్గిన ఓటింగ్‌
  2. ముగిసిన ఎంపీటీసీ, జడ్పీటీసీ పోలింగ్‌


కర్నూలు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. ఎండలు పెరిగే కొద్దీ జనం పలచబడ్డారు. వీలైనంత త్వరగా ఓటు వేసి పనులకు వెళ్లేందుకు ఓటర్లు సమాయత్తమయ్యారు. ఆ ఎన్నికల్లో 80.83శాతం పోలింగ్‌ నమోదైంది. కానీ గురువారం జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మాత్రం ఆ చైతన్యం కనిపించలేదు. ఉదయం 10 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపాడు. 11 వరకు 25.94 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం ఎండ పెరిగేకొద్దీ ఓటింగ్‌ అనూహ్యంగా పెరిగినట్లు రికార్డులు చూపిస్తున్నారు. 11 గంటల వరకు 26 శాతం కూడా పూర్తికాని ఓటింగ్‌ ఒంటి గంటలకు 40.27 శాతం జరిగినట్లుగా ప్రకటించారు. మరో రెండు గంటలు గడిచేసరికి 48.40 శాతం నమోదైనట్లుగా జిల్లా యంత్రాంగం ధ్రువీకరించింది. పోలింగ్‌ ముగిసే సమయానికల్లా 60.28 శాతం ఓటింగ్‌ జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలోని 44 మండలాల్లో 484 ఎంపీటీసీ స్థానాలకు 1785 పోలింగ్‌ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికలు జరిగే చోట్ల 15,56,617 మంది ఓటర్లుండగా 9,38,379 మంది ఓటు వేశారు. ఇందులో పురుషులు 4,82,471 మంది, మహిళలు 4,55,905 మంది, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఉదయం 7 గంటల నుంచి మొదలైన పోలింగ్‌ శాతాలు పరిశీలిస్తే 9గంటలకు 1,49,070 మంది ఓటు వేయగా 9.58 శాతం ఓటింగ్‌ నమోదైంది. 11 గంటలకు 4,03,749 మంది ఓట్లు వేయడంతో 25.94 శాతం ఓటింగ్‌ జరిగింది. ఆ తర్వాత ఒంటిగంటలకల్లా ఓటింగ్‌ పెరగడంతో 40.27 శాతం పోలింగ్‌ నమోదైంది. 3 గంటలకు 48.40 శాతం, పోలింగ్‌ ముగిసే సమయానికి ఏకంగా 60.28శాతం పోలింగ్‌ జరిగిందని అధికారులు ప్రకటించారు. అత్యధికంగా ఆళ్లగడ్డ మండలంలో 10 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా 74.42 శాతం పోలింగ్‌ నమోదైంది. ఆరు ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగిన దొర్నిపాడులో 74.10శాతం, 11 స్థానాల్లో పోలింగ్‌ జరిగిన నందికొట్కూరులో 73.13శాతం ఓటింగ్‌ నమోదైంది. ఉదయం నుంచి ఆదోని, ఎమ్మిగనూరు, కర్నూలు, పత్తికొండ తదితర ప్రధాన ప్రాంతాల్లో ఓటింగ్‌ జరగడంలేదని అధికారులే జిల్లా కేంద్రానికి సమాచారమిచ్చారు.  బయటికి  రావడానికి కూడా భయపడే మండుటెండల్లో భారీ ఓటింగ్‌ నమోదవ్వడం గమనార్హం. కర్నూలు, శ్రీశైలం, కోడుమూరు, పత్తికొండ, ఆదోని నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని పలువురు అభ్యర్థులు పోలీసులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. 


కౌంటింగ్‌ కేంద్రాలకు బ్యాలెట్‌ బాక్సులు

కర్నూలు(న్యూసిటీ): బ్యాలెట్‌ బాక్సులను అధికారులు కౌంటింగ్‌ కేంద్రాలకు  తరలించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాలు వచ్చాక  కౌంటింగ్‌ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌కు సీల్‌ వేశారు. స్ట్రాంగ్‌రూమ్‌ వద్ద మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రాయలసీమ వర్సిటీలోని స్ట్రాంగ్‌ రూములను కలెక్టర్‌ పరిశీలించారు.

Updated Date - 2021-04-09T06:26:13+05:30 IST