ఆ బాధ్యతే ప్రధానం

ABN , First Publish Date - 2022-08-19T05:30:00+05:30 IST

మనుషులకు వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సామాజికమైన బాధ్యతలు ఉంటాయి. వీటిలో వ్యక్తిగతమైన, కుటుంబపరమైన వాటి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తాం.

ఆ బాధ్యతే ప్రధానం

మనుషులకు వ్యక్తిగతమైన, కుటుంబపరమైన, సామాజికమైన బాధ్యతలు ఉంటాయి. వీటిలో వ్యక్తిగతమైన, కుటుంబపరమైన వాటి గురించే మనం ఎక్కువగా ఆలోచిస్తాం. సామాజిక బాధ్యతలను పెద్దగా పట్టించుకోం. కానీ అందరి శ్రేయస్సుతో ముడిపడి ఉన్న ఆ బాధ్యతే ప్రధానమైనది. 


ఒక ఊరిలో ఒక తోట ఉంది. అందులో రంగురంగుల పువ్వులు పూసేవి. రకరకాల కాయలు కాసేవి. రోజూ సాయంత్రం ఆ తోటలో పిల్లలు ఆడుకొనేవారు. కావలసిన పూలనూ, పండ్లనూ తీసుకువెళ్ళేవారు. చేసే ప్రతి పనినీ అల్లాహ్‌ సేవగా భావించే తోట యజమాని ఆ తోటను ఎంతో శుభ్రంగా ఉంచేవాడు. పిల్లలు అతనికి అన్నిరకాలుగా సహాయపడేవారు. పండ్లు, పూలు తీసుకున్నందుకు అతనికి కాస్త డబ్బు కూడా ఇచ్చేవారు.


రోజులు గడిచాయి. పిల్లలు పెద్దవారయ్యారు. ఉన్నతమైన చదువుల కోసం, ఉద్యోగాల కోసం పట్టణాలకు వెళ్ళిపోయారు. తోటమాలి వృద్ధుడయ్యాడు. అనారోగ్యంతో మరణించాడు. అతనికి నా అన్నవాళ్ళెవరూ లేరు. పిల్లలు ఇచ్చిన చిల్లర డబ్బును అతను జాగ్రత్తగా దాచేవాడు. ఆ డబ్బుతోనే గ్రామస్తులు అతనికి అంత్యక్రియలు చేశారు.


కొన్నాళ్ళకు మిత్రులందరూ కుటుంబాలతో కలిసి ఆ గ్రామానికి వచ్చారు. చిన్నప్పటి తోటలో వనభోజనం చేద్దామనుకున్నారు. గ్రామం అంతా తిరిగి చూస్తే... పరిస్థితులు దారుణంగా కనిపించాయి. తాము చదువుకున్న బడి కూలిపోయింది. చిన్నప్పుడు ఆడుతూ, పాడుతూ తిరిగిన ప్రదేశాలన్నీ కలుషితమైపోయాయి. వ్యాధులు ప్రబలడానికి ఆస్కారం ఇచ్చేలా ఉన్నాయి. తోటను సంరక్షించేవారు లేక చెట్లన్నీ ఎండిపోయాయి. ఆకులు రాలిపోయాయి. అంతా అడవిలా తయారైంది. తమ చిన్నప్పటి జ్ఞాపకాలు అలా నాశనమైనందుకు వారికి విచారం కలిగింది. పెద్దలు ఉన్నా గ్రామాన్ని పట్టించుకోనందుకు నొచ్చుకున్నారు. అందరూ రంగంలోకి దిగారు. కొన్ని గంటల్లోనే తోటను శుభ్రం చేశారు అలాగే బడినీ, వీధులనూ, ఇళ్ళ పరిసరాలనూ శుభ్రం చేసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. కలిసికట్టుగా బాధ్యత తీసుకొనేలా గ్రామస్తులను ఒప్పించారు.


‘‘మీరు పుట్టిన ఊరిని, దేశాన్ని ఎల్లప్పుడూ ప్రేమించాలి, ఆదరించాలి, గౌరవించాలి. వాటి అభివృద్ధికోసం పాటుపడాలి. న్యాయం, ధర్మం స్థాపించాలి. చిన్నదైనా, పెద్దదైనా... నలుగురికీ ఉపయోగపడే ఏ మంచి పని చేసినా దానికి పుణ్యం కచ్చితంగా లభిస్తుంది’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ స్పష్టం చేశారు. అలా చేసినవారే ఇహ, పరలోకాల్లో సాఫల్యం చెందుతారని తెలిపారు. సామాజికమైన బాధ్యతను నిర్వర్తించడం అల్లా్‌హకు ప్రీతికరం. దైవ విశ్వాసంలో ఆ బాధ్యతను కూడా భాగంగా చేసుకోవాలి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2022-08-19T05:30:00+05:30 IST