ఎవరూ చూడరని

ABN , First Publish Date - 2021-01-24T05:53:34+05:30 IST

తలుపులు మూసేసిన హాల్‌లో వందల మంది, ఏకబిగిన మూడు గంటలు సినిమా చూస్తుంటారు. కరోనాబారిన పడకుండా ఉండేందుకు నిబంధనల మేరకు సినిమా థియేటర్లు నడపాలని ప్రభుత్వం సూచించగా ఉమ్మడి జిల్లాలో దీని అమలు ఎక్కడా కనిపించడం లేదు. మార్కెట్‌ను సొ మ్ము చేసుకోవడమే లక్ష్యంగా థియేటర్ల యజమానులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కరోనా నిబంధనలు పాటించకపోయినా, ధరలు పెంచినా, సీట్లు, మరుగుదొడ్ల సౌకర్యాలు అధ్వానంగా ఉన్నా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.

ఎవరూ చూడరని

థియేటర్లలో యథేచ్ఛగా కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన

కొత్త సినిమా తొలి మూడు రోజులు ఫుల్‌ సీటింగ్‌

మాస్క్‌కు రూ.20, కనిపించని భౌతిక దూరం

పెరిగిన పార్కింగ్‌, టికెట్‌ ధరలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ) : తలుపులు మూసేసిన హాల్‌లో వందల మంది, ఏకబిగిన మూడు గంటలు సినిమా చూస్తుంటారు. కరోనాబారిన పడకుండా ఉండేందుకు నిబంధనల మేరకు సినిమా థియేటర్లు నడపాలని ప్రభుత్వం సూచించగా ఉమ్మడి జిల్లాలో దీని అమలు ఎక్కడా కనిపించడం లేదు. మార్కెట్‌ను సొ మ్ము చేసుకోవడమే లక్ష్యంగా థియేటర్ల యజమానులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కరోనా నిబంధనలు పాటించకపోయినా, ధరలు పెంచినా, సీట్లు, మరుగుదొడ్ల సౌకర్యాలు అధ్వానంగా ఉన్నా చర్యలు తీసుకోవాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో తొమ్మిది నెలల పాటు లాక్‌డౌన్‌ కొనసాగింది. ఈ ప్రభావం సినిమా థియేటర్లపై కూడా పడగా, కొత్త ఏడాదిలో అవి ప్రారంభానికి నోచుకున్నాయి. అయితే కొవిడ్‌ నిబంధనల నడుమ సినిమా థియేటర్లు కొనసాగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించాయి. థియేటర్ల కారణంగా కరోనా వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉండటంతో కఠిన నిబంధనలు విధించారు. సగం సీట్ల మేరకే టికెట్లు విక్రయించడంతోపాటు, టికెట్లు తీసుకునే క్రమంలో భౌతికదూరం పాటించాలి. థియేటర్‌ లోపలికి వచ్చే వారి శరీర ఉష్ణోగ్రతను థర్మల్‌ స్ర్కీనింగ్‌తో తప్పని సరిగా పరీక్షించాలి. చేతుల్లో శానిటైజర్‌ వేయాలి. మాస్క్‌ లేని వారిని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించకూడదు. అయితే ఈ నిబంధనలు ఉమ్మడి జిల్లాలోని సుమారు 32 థియేటర్లలో ఎక్కడా అమలు కావడం లేదు. కొత్త సినిమా రిలీజ్‌ అయిన మొదటి రెండు మూడు రోజులు వంద శాతం సీటింగ్‌ ఉంటోంది. ఓటీటీ, పైరసీతో తొలి వారంలోనే సినిమా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వస్తుండటంతో థియేటర్‌కు వచ్చే వారి సంఖ్య సహజంగానే తగ్గుతుంది. దీంతో రిలీజ్‌ అయిన సినిమా విషయంలో థియేటర్‌ యజమానులు సీటింగ్‌, భౌతికదూ రం నిబంధనను అమలుచేయడం లేదు. భౌతిక దూరం ఉండేలా చూడాల్సిన సిబ్బందిని నియమించడం లేదు. వందల మంది ఎక్కడెక్కడో తిరిగి థియేటర్లకు వస్తుండగా, చేతులు శుభ్రం చేసుకునేందుకు కొన్ని థియేటర్లలో శానిటైజర్లు అందుబాటులో ఉంచడం లేదు. తీరా టికెట్‌ తీసుకొని లోపలికి వెళ్లే వారిని గేట్‌ వద్ద థర్మల్‌ స్ర్కీనింగ్‌ యంత్రంతో శరీర ఉష్ణోగ్రత కూడా చెక్‌ చేయడం లేదు. మాస్క్‌లేనిదే థియేటర్‌లోకి అనుమతి లేదు. కాగా మాస్క్‌లేని ప్రేక్షకుల నుంచి రూ.20 వసూలు చేసి సిబ్బందే మాస్క్‌లు విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల సీట్లు సరిగా లేవు. మరుగుదొడ్ల వద్ద శుభ్రత కొరవడి ప్రేక్షకులు ఇబ్బందిపడుతున్నారు. ఇదిలా ఉండగా, వాహనాల పార్కింగ్‌ ధరలు టూవీలర్‌కు రూ.5, ఫోర్‌ వీలర్‌కు రూ.10 చొప్పున పెంచేశారు.


సినిమాపై అభిమానాన్ని సొమ్ము చేసుకుంటున్నారు : జానీ, ప్రేక్షకుడు

పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా సినిమాపై మోజుతో థియేటర్‌కు వచ్చా. థియేటర్‌ వాళ్లు మా అభిమానాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. మాస్క్‌ లేని కొద్ది మందిగా ఉచితంగా ఇవ్వాల్సి ఉండగా, రూ.20 వసూలు చేస్తున్నారు. సినిమా టికెట్‌ ధర రూ.5 నుంచి రూ.10 పెంచారు. జనం ఎక్కువ వచ్చినప్పుడు పక్కపక్కనే కూర్చోబెడుతున్నారు. శానిటైజర్‌ మేం తీసుకుపోయినవే తప్ప థియేటర్‌లో ఎక్కడా కనిపించడం లేదు. టాయిలెట్లు దారుణంగా ఉన్నాయి. థర్మల్‌ స్ర్కీనింగ్‌ లేనే లేదు.


నష్టాలతో నడుపుతున్నాం : పాంపాటి శంకరయ్య, థియేటర్‌ యజమాని

కరోనా నిబంధనలతో 50శాతం సీటింగ్‌కే అనుమతి ఉంది. ప్రజలు థియేటర్లకు రాకపోవడంతో నెలకు రూ.30 వేలు నష్టపోతున్నాం. కరెంటు బిల్లు నెలకు రూ.60వేల నుంచి రూ.70వేలు, సిబ్బంది జీతాలు రూ.90వేల వరకు ఖర్చ వుతున్నాయి. మాస్క్‌లేకుండా వచ్చే వారిలో కొద్ది మందికి మాస్క్‌లు ఇస్తున్నాం. కొంత మంది దస్తీలు కట్టుకొని వస్తున్నారు. మిత్రులం ఒక్కదగ్గరే కూర్చుంటామని యువకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.


నిబంధనలు పాటించకుంటే చర్యలు : చంద్రశేఖర్‌, అదనపు కలెక్టర్‌ 

కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించిన థియేటర్ల నిర్వాహకులపై చర్యలు తీసుకుంటాం. మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించడంలో లోపాలు ఉన్నా చర్యలు తీసుకుంటాం. బృందాలతో థియేటర్లలో తనిఖీలు నిర్వహిస్తాం.


Updated Date - 2021-01-24T05:53:34+05:30 IST