అది మాయనాడు

ABN , First Publish Date - 2022-05-29T08:32:27+05:30 IST

అది మాయనాడు

అది మాయనాడు

వచ్చే పాతికేళ్లూ జగనే సీఎం

తాడేపల్లిగూడెం, గన్నవరం, బెంజ్‌సర్కిల్‌, నరసరావుపేట సభల్లో మంత్రులు

విజయవాడ, గన్నవరం, ఏలూరు (ఆంధ్రజ్యోతి), నరసరావుపేట, మే 28 : రాష్ట్రంలో సంక్షేమ, సామాజిక విప్లవం నడుస్తోందని సామాజిక న్యాయభేరి సభలో మంత్రులు అన్నారు. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తూ పేదలను ఆర్థికంగా అదుకోవడం చూసి టీడీపీ అధినేత చంద్రబాబు ఒత్తిడికి గురి అవుతున్నారని విమర్శించారు. ‘‘తెలుగుదేశం మహానాడులా కాకుండా నారా వారి మహానాడులా జరిగింది. అదొక మాయనాడు. మహానాడు వేదికపై బీసీ నేత అచ్చెన్నాయుడు ఫొటో లేదు. అలాంటి వేదికపై ఉండటానికి అచ్చెన్నాయుడుకు సిగ్గులేదా?’’ అని ప్రశ్నించారు. సామాజిక న్యాయ భేరి బస్సు యాత్రలో భాగంగా మూడవ రోజైన శనివారం ఉదయం ఎస్సీ, బీసీ, మైనారిటీ మంత్రుల బృందం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం చేరుకుంది. అక్కడనుంచి కృష్ణాజిల్లా గన్నవరం వచ్చింది. తర్వాత విజయవాడ బెంజ్‌సర్కిల్‌కు, అక్కడినుంచి గుంటూరు మీదుగా చిలకలూరిపేట.. అక్కడినుంచి నరసరావుపేటకు చేరుకుంది. నరసరావుపేట సభలో మంత్రులు మాట్లాడారు. ‘‘బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన 17 మందికి మంత్రి పదవులు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ది. గ్రామ సచివాలయాల్లో ఈ వర్గాలవారికి 80 శాతం ఉద్యోగాలు దక్కాయి’’ అని మంత్రి విడదల రజనీ అన్నారు. అధికారంలోకి వస్తాం అంతుచూస్తామని చంద్రబాబు అంటున్నారని, ఆయన తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాలేరని మంత్రి జోగి రమేశ్‌ ఎద్దేవా చేశారు. జగన్‌ సామాజిక విప్లవకారుడని మంత్రి వేణుగోపాలకృష్ణ కొనియాడారు. ‘‘ప్రతిపక్షాలన్నీ ఏకమై  జగన్మోహన్‌రెడ్డిపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే.. ఆయనను ఎదుర్కొనే దైర్యం ఏపార్టీకీ లేదు. మైనారిటీల అభ్యున్నతికి సీఎం పాటు పడుతున్నారు. ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులా చూసుకుంటున్నది. ’’ అని మంత్రి అంజాద్‌  బాషా వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేశ్‌ జగన్‌ను ఓడిస్తానంటున్నారని, కానీ, ఆయనకు అంత సత్తా లేదని మంత్రి అప్పలరాజు అన్నారు.  చనిపోతున్న పార్టీని బతికించుకోవటానికి చంద్రబాబు సహా టీడీపీ నాయకులంతా  మహానాడులో వైసీపీపై బురద జల్లుతున్నారని, లేనిపోని ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని గన్నవరం సభలో మంత్రులు ఆరోపించారు. అధికారంలో ఉన్నప్పుడు దళిత, బలహీన, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి, వారిని రాజాఽ్యధికారంలోకి తీసుకురావడానికి ఏనాడూ చంద్రబాబు ప్రయత్నం చేయలేదన్నారు. ‘‘ఒక మహిళ ఆవేశంతో ఊగిపోతూ.. వైసీపీ నాయకులు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి తొడగొట్టి మరీ తంతాననటం సిగ్గు చేటైన విషయం. బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీలను మీరు కొడతారా’’ అని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ప్రశ్నించారు. కాగా, రాష్ట్రానికి మరో 25 ఏళ్లపాటు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డే సీఎంగా ఉంటారని బెంజ్‌ సర్కిల్‌ సభలో మంత్రి జోగి రమేశ్‌ అన్నారు. బొత్స సత్యనారాయణ బస్సుల్లోకి వెళ్లిపోయారు.


జగన్‌ అవుట్‌డేటెడ్‌ 

నోరు జారిన మంత్రి కారుమూరి 

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గన్నవరం సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్న సందర్భలో తమ అధినేత జగన్‌పై నోరు జారారు. జగన్మోహనరెడ్డి అవుట్‌డేటెడ్‌ అయిపోయాడు....అని రెండు సార్లు సంబోధించారు. వాస్తవానికి ఆయన ఈ వ్యాఖ్యలు చంద్రబాబుపై చే సే క్రమంలో పొరపాటున జగన్‌ పై చేశారు. 


Updated Date - 2022-05-29T08:32:27+05:30 IST