ఆపద వస్తే అంతే!

ABN , First Publish Date - 2022-08-19T04:42:06+05:30 IST

మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో ఆర్టీసీ కార్మికులకు పెద్ద దిక్కుగా ఉన్న డిస్పెన్సరీలో సిబ్బంది లేక పోవడంతో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా తీసుకునే బీపీ, షుగర్‌ మాత్రలు కూడా ఇచ్చేందుకు ఫార్మాసిస్టు సైతం లేక పోవడంతో బయట కొనుగోలు చేస్తే అదనపు భారం పడుతుందని వాపోతున్నారు.

ఆపద వస్తే అంతే!
వైద్యం కోసం ఆసుపత్రి ఎదుట నిరీక్షిస్తున్న ఆర్టీసీ కార్మికులు

- ఆర్టీసీ డిస్పెన్సరీకి సిబ్బంది కరువు  

 - ల్యాబ్‌ టెక్నీషియన్‌ లేక అవస్థలు   

 - ఉన్న సిబ్బందికి మూడు నెలలుగా వేతనాలు లేవు  

 - ఇబ్బంది పడుతున్న 2 వేల మంది కార్మికులు 

మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో ఆర్టీసీ కార్మికులకు పెద్ద దిక్కుగా ఉన్న డిస్పెన్సరీలో సిబ్బంది లేక పోవడంతో వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారు. నెలనెలా తీసుకునే బీపీ, షుగర్‌ మాత్రలు కూడా ఇచ్చేందుకు ఫార్మాసిస్టు సైతం లేక పోవడంతో బయట కొనుగోలు చేస్తే అదనపు భారం పడుతుందని వాపోతున్నారు. 

మంచిర్యాల, ఆగస్టు  18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్టీసీని రోజు రోజుకు ప్రైవేటుపరం దిశగా తీసుకెళ్తున్న ప్రభుత్వం కార్మికులకు వైద్యం అందించడంలోనూ పట్టింపు లేనట్లుగా వ్యవహ రిస్తోంది. సంస్థ పురోభివృద్ధి కోసం తక్కువ వేతనాలతో తమ శ్రమశక్తిని దారపోస్తున్న కార్మికులకు అండగా నిలవాల్సిన యాజమాన్యం ఒకొక్కటిగా సౌకర్యాలను నిలిపివేస్తూ ఇబ్బందులపాలు చేస్తున్నది. మొన్నటికి మొన్న వాలంటరీ రిటైర్డ్‌మెంట్‌ సర్వీస్‌ పేరుతో ఉద్యోగులను సంస్థకు దూరం చేసిన యాజమాన్యం కార్మికులకు చికిత్స అందించాల్సిన వైద్యులను సైతం ఇతర శాఖలకు బదిలీ చేస్తోంది. దీంతో అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. 

- 2వేల మంది కార్మికులు..

మంచిర్యాల ఆర్టీసీ డిస్పెన్సరీ పరిధిలో కుమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లాలకు చెందిన కార్మికులు వైద్య సేవలు పొందుతారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలోని ఊట్నూరు, ఆసిఫాబాద్‌, మంచిర్యాల  డిపోల పరిధిలో సుమారు 2 వేల మంది కార్మికులుండగా వారంతా మంచిర్యాల ఆర్టీసీ డిస్పెన్సరీ పైననే వైద్యం కోసం ఆధారప డుతారు. కార్మికులతో పాటు వారి కుటుంబీకులు సుమారు 3 వేల మంది ఇక్కడ వైద్య చికిత్సలు పొందుతుంటారు. అయితే గతంలో ఇక్కడ ఉన్న పర్మనెంట్‌ ఉద్యోగులను శాశ్వతంగా తొలగించిన యాజమాన్యం ప్రస్తుతం కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులతో నెట్టుకొస్తుంది. గతంలో ఇక్కడ పని చేసిన శాశ్వత వైద్యుడు, నర్సు, క్లర్క్‌తో పాటు ల్యాబ్‌ టెక్నీషియన్‌ను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. వారి  స్థానంలో కాంట్రాక్టు పద్ధతిలో డాక్టర్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో నర్సు, వార్డు బాయ్‌లను నియమించి అరకొరగా చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ 2018 నుంచి ఇక్కడ  ల్యాబ్‌ టెక్నిషియన్‌ లేకపోవడంతో రక్త, మల, మూత్ర పరీక్షలతో పాటు వివిధ టెస్టుల కోసం కార్మికులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సి వ స్తోంది. దీంతో కార్మికులపై అదనపు భారం పడుతున్నది.  ఫార్మాసిస్టు లేక పోవడంతో బీపీ, షుగర్‌ మాత్రలు తీసుకునే కార్మికులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

- మూడు నెలలుగా వేతనాలు నిలిపివేత..

ప్రస్తుతం మంచిర్యాల డిస్పెన్సరీ పరిధిలో కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుడు విధులు నిర్వహిస్తుండగా నర్సు, వార్డు బాయ్‌లు ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్నారు. వైద్యుడు 2018 అక్టోబర్‌  25న మంచిర్యాలలో విధుల్లో చేరగా మిగతా వారు కూడా దాదాపు అదే సమయంలో డిస్పెన్సరీలో చేరారు. గతంలో వీరికి వేతనాలు సరిగ్గానే అందగా మూడు నెలల నుంచి జీతాలు విడుదల చేయడం లేదు. ఏకదాటిగా మూడు నెలలుగా వేతనాలను రీజనల్‌ మేనేజర్‌ నిలిపి వేయడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యుడితో సహా సిబ్బంది పేర్కొన్నారు. డిస్పెన్సరీకి ఈ నెలకు సరిపడా మందులు ఈ నెల 8వ తేదీన చేరాయి. కాగా ఫార్మాసిస్టు లేక పోవడంతో నెలనెలా బీపీ, షుగర్‌ మాత్రలు తీసుకునే కార్మికులతో పాటు ఇతరత్ర మందులు కూడా పొందలేక పోతున్నారు.  మూడు నెలలుగా  వేతనాలు నిలిపివేయడంతో డాక్టర్‌ రాజీనామా చేసి వెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. కాగా వేతనాల కోసం రీజనల్‌  మేనేజర్‌కు ఫోన్‌, మెస్సెజ్‌ చేసినా స్పందించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. సిబ్బంది కొరత కారణంగా బీపీ, షుగర్‌ పరీక్షలు తప్పనిసరి  పరిస్ధితుల్లో ప్రైవేటులో చేయించుకోవల్సి వస్తోందని కార్మికులు వాపోతున్నారు. 

వైద్యుడు అందుబాటులో లేక ఇబ్బందులు..

- రాజమల్లు, డ్రైవర్‌  

ఆర్టీసీ డిస్పెన్సరీకి ఎనిమిది రోజులుగా ఆసుపత్రికి వస్తున్నా వైద్యుడు అందుబాటులో ఉండడం లేదు. వైద్యుడికి వేతనం అందడం లేదనే ఉద్దేశ్యంతో ఆసుపత్రికి రావడం లేదని చెబుతున్నారు. యాజమాన్యం కార్మికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలి. 

వేతనాలు చెల్లించడం లేదు..

జోగేందర్‌, డిస్పెన్సరీ మెడికల్‌ ఆఫీసర్‌  

మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. రీజనల్‌ అధికారులకు విన్నవించుకుందామంటే ఫోన్‌లకు స్పందించడం లేదు. ఫార్మాసిస్టు లేకున్నా ఇప్పటి వరకు కార్మికులకు నిరంతర సేవలు అందిస్తున్నాం. వేతనాలు ఇవ్వకపోతే విధులెట్లా నిర్వహిం చేది. అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2022-08-19T04:42:06+05:30 IST