అందుకే ఆయన మాస్టారు!

ABN , First Publish Date - 2022-09-19T06:25:34+05:30 IST

కథలు రాస్తూ రాస్తూ రాయడం ఆపి, కథా నిలయం నిర్మించి దాని కోసం పనిచేస్తూ రాలిన కథకుడు కాళీపట్నం రామారావు. ఆయన కథ ఎంత గొప్పదో అంతకు రెండు రెట్లు కథకు చేసిన సేవ గొప్పది...

అందుకే ఆయన మాస్టారు!

కథలు రాస్తూ రాస్తూ  రాయడం  ఆపి, కథా నిలయం  నిర్మించి దాని కోసం  పనిచేస్తూ రాలిన కథకుడు కాళీపట్నం రామారావు. ఆయన కథ ఎంత గొప్పదో అంతకు రెండు రెట్లు కథకు చేసిన సేవ గొప్పది. అతనెళ్ళిపోయాడు. అతని కథ-సేవ మిగిలాయి. ఆయన అడుగుజాడల్లో కథల వివరం పరచుకొని ఉంది. పరమ మితభాషి, అనవసర పదం, అక్షరం, వాక్యం ఒక్కటీ కథలో ఉండదు. మనుషుల మనస్తత్వాన్ని పరిశీలించడం ఇష్టం. ఆ అలవాటు పాత్ర సృష్టిలో వ్యక్తం అయింది. ‘వథ’ కథలో వాలిని చంపే సమయాన రాముని అంతర్మథనంలో రచయిత పరిశీలన దాగి ఉంది. నడక నెమ్మది, మాట నెమ్మది మొత్తంగా మనిషి నెమ్మదస్థుడు. అతని లాగే కథ కూడా నెమ్మదిగా నడుస్తుంది. లోతుగా, నిశ్చలంగా ఉంటుంది. అలజడి, అంతర్మథనం అతని మూలాలు. వాటిని సన్నివేశంగా రూపుకట్టించాడు. ‘చావు’ను దాని చుట్టూ ఉన్న బీభత్సాన్ని, ఆ క్రమంలోనే సంఘ నిర్మాణంలోని లోపాల్ని వాటి వల్ల తలెత్తిన ఘర్షణను చిత్రించాడు. కథను మనోరంజకం కోసం కాక, జీవిత సత్యాలను అర్థం చేయించడం కోసం రాశాడు.


కేవలం కథరాస్తే కారా గుర్తుండే వాడుకాదు. పని తప్ప మరొకటి తెలియనట్లు జీవించాడు. కడదాకా కథ కోసం, కథా నిలయం కోసం తపించాడు. ఏ పనైనా సూటిగా, తేటగా, నిర్భయంగా, నిబ్బరంగా చేసాడు. ఒప్పుకున్నా, వ్యతిరేకించినా నిబద్ధంగా నడిచాడు. అదే విధానంలో కథ రాసాడు.


‘‘పాఁవు మీకు బగఁమంతుడితో సమానమా!... సెప్పండి... దండా లెట్టుకుందాం. పాఁవు మాయఁమై పోద్ది... కాదు పాఁవుని సంపడం పాపఁవంటారా? అప్పుడూ తగువు నేదు! మీ పాఁవుని మీ యింట నెట్టుకోండి, నానెల్లిపోతాను. ఇదీ అదీ కాదు- పాము కరస్తాది, అది యిసపురుగు అంటే మాటాడకండి, సంపి అవతల పారేస్తాను. పుట్టమీదెయ్యమన్నా యెయ్యను. ఆ తరువాత మెరమెరలొద్దు...’’ (‘భయం’ కథ). మాట, నడక, వాక్యం అంతా... నిక్కచ్చి. 


తన జీవితంలో ‘‘అభిమానాల’’కు ఆత్మగౌరవానికి పెద్దపీట వేశాడు. అందువల్ల ఒంటరయ్యాడు. పని అతనికి తోడైంది. మనిషికి స్థిరమైన ఆదాయం ఉండా లనుకున్నాడు. అచ్చమైన బడి పంతుల్లా సమయపాలన, అర్థవంతమైన జీవితం గడిపాడు. పొద్దంతా పనిచేసినా పొట్టనిండని కాలంలో క్రమశిక్షణతో పనిచేసి కథకు కాలం కేటాయించాడు. కథా సృజన చేశాడు. కథా నిర్మాణశాస్త్రం రాశాడు. కథా ప్రచారం జరిపాడు. కథానిలయం కట్టాడు. నిగర్విగా గడిపాడు. క్లిష్టపరిస్థితులను ఎదుర్కొన్నాడు. భరించాడు కనుకనే- ‘‘దీనికి తెలియడం లేదమ్మా! అన్నీ అమరిన వాళ్ళకి అనుభవించాలనే ఉంటుంది. కాని బరువులు మొయ్యా లని ఉండదు. ఏదో ఎదురుదెబ్బ తగిలి తలకి మించిన భారం నెత్తిన పడాలి. లేదా అనుభవానికి ఆటంకాలేర్పడాలి. అప్పుడు గాని వాళ్ళకి బాధ్యత గుర్తుకు రాదు’’ (‘సంకల్పం’) అని రాయగలిగాడు.


మనిషిని మనిషిగా చూసిన కథకుడు. కథను కూడా మనిషిగా తలచిన మనిషి. అందుకే, ‘‘ఆమె ఆవేశం మనకు అర్థం కావాలంటే ఆమె స్థానంలో మనముండాలి. అంతేకాదు ఆమె గుండె కూడా మనకుండాలి’’ (‘హింస’) అని చెప్పగలిగాడు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించాక మనసు మార్చుకొని బహుమతుల డబ్బు అందుకున్నాడు. కథకు గుడి కట్టాడు. అలా ఆచరణే సిద్ధాంతంగా రూపొందింది. ‘‘చిలికి చిలికి గాలివాన అయింది’’ అన్నట్లు వీరి కథ ఎక్కడో మొదలై, సంఘర్షణకు దారితీసి, సంక్లిష్టతలోకి వెళుతుంది. ఆ చిక్కుముళ్ళ తొలగింపే ముగింపు అవుతుంది. అందులో స్పష్టత ఉంటుంది. అది పాఠకుణ్ణి చైతన్యపరుస్తుంది. తనకు తెలిసిన విషయాన్నే కథగా మలచాడు. చెప్పాల్సిన విషయాన్ని ఎంతగా తెలుసు కుంటాడో తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది.


చంటిపిల్లను వదిలి తల్లి నీళ్ళకు వెళుతుంది. మెలకువ వచ్చిన పిల్ల గుక్కపెట్టి ఏడుస్తుంది. చాలాసేపటికి తల్లి వచ్చి పాలిస్తుంది. పాలు తాగకుండా పిల్ల ఏడుస్తూనే ఉంటుంది. కడుపునొప్పో, కాలునొప్పో అని అందులోని మరో పాత్రతో పాటూ పాఠకులూ అనుకునే స్థాయిలో చిత్రీకరణ ఉంటుంది. ఆ సమయంలో ‘‘తల్లి చన్ను ఉప్పూరడం వల్ల పిల్ల పాలు తాగుతూ భీకరంగా ఏడుస్తుంది. చన్ను కడుక్కొని పాలు తాగిస్తుంది’’ (‘జీవధార’) అని రాస్తాడు. తల్లి కనుక చన్ను కడుక్కోవాలనుకుంది. రచయితది కూడా తల్లిమనసే కనుక అలా రాయగలిగాడు. ఇలాంటి వాక్యాలు ఆయన సూక్ష్మ పరిశీలనకు, కథ పట్ల ఆయన నిబద్ధతకు ఉదాహరణలు.


దోపిడీ జరిపేది కొందరు. జరిపించేది మరికొందరు. దోపిడీకి గురయ్యేవారు కొందరు. ఎదిరించేవారు మరి కొందరు. వీరందరికి కథలో సమాన ప్రాధాన్యం ఇచ్చాడు. న్యాయం, ధర్మం అంటూ పాత్రలచే చర్చ పెట్టించి తీర్పులు చెప్పించాడు. కథ జరిగేది సామాన్య మనుషుల మధ్య కనుక వారి భాషను వాడాడు. ఘర్షణకు గల పునాది కారణం వద్ద మొదలై మెల్ల మెల్లగా విస్తరించుకుంటూ కథకు ముగింపు నిచ్చాడు. భూమి పొరల్లాగా కథలో ఈ తతంగమంతా పొరలు పొరలుగా విస్తరించి ఉంటుంది. ‘యజ్ఞం’ లాంటి కథలు ఇందుకు ఉదాహరణలు.


మాష్టారు మంచి ఉపాధ్యాయుడు అనడానికి ‘అప్రజ్ఞాతం’ కథ ఉదాహరణ. మంచి ఉపాధ్యాయుడు విషయాన్ని జీవితానికి అన్వయించి చెబుతాడు. నమ్మిన నిజాన్ని ఉదాహరణ సహితంగా విద్యార్థుల ముందుంచుతాడు. ప్రశ్నలతో చర్చను రాజేస్తాడు. సరిగ్గా ఇదే ధోరణిలో ఈ కథ సాగింది. ‘‘ఒక్క మాటలో చెప్పాలంటే అతను దోపిడీ చేయలేదు. అతని వల్ల దోపిడీ జరిగింది. ఫలితం భౌతికంగా ఒకటే అయినా నైతికంగా రెంటికి తేడా ఉంది.’’ ఈ కథా వస్తువు చెప్పడానికి పల్లెటూరిని నేపథ్యంగా చేసుకొని రైతు, వ్యాపార వర్గాల్లో జరుగుతున్న దోపిడీని కళ్ళకు కట్టించాడు. వడ్డీ లెక్కలు చెబుతున్నప్పుడు మాష్టారిలోని గణిత ఉపాధ్యాయుడి విశ్వరూపం కనిపిస్తుంది. ఇందులోని సుదర్శనం బెత్తం వాడని మాష్టారుని తలపిస్తాడు.


మితభాషి మర్మం తెలుసుకోవడం కష్టం. చాన్నాళ్ళు స్నేహం చేస్తేనే కాని అర్థం కాడు. చేసే పని, మాట, రాత, కూడా అలానే ఉంటవి. కనుకనే కారా కథలు మొదటి సారి చదవగానే అర్థం కావు. ప్రతీది పూసగుచ్చినట్లు చెప్పాలనే నిజాయితీ వల్ల కథల నిడివి పెరిగింది. పచ్చినిజాలను సైతం నిర్మొహమాటంగా ఇంజెక్టు చేసే విధానం కథకు నైతికతను చేకూర్చింది. కథ చదువుతుంటే రచయిత నిరామయ, నిర్మమకారత అర్థమయి ఒక్కోసారి చేష్టలుడిగిపోతాము. ఇదంతా వ్యక్తి దృష్ట్యానో, కుటుంబ నేపథ్యంగానో కథను నడపడం వల్ల కలిగిన చిక్కు. ఇది కత్తిమీద సాములాంటిది. ప్రవాహ సదృశ సామాజిక చలనాల్ని సమర్థంగా చిత్రించాలంటే, కుటుంబ సంబంధాల్ని మించిన పనిముట్లు లేవు. అది తెలిసినవాడు కనుకనే ‘ఆర్తి’, ‘హింస’ లాంటి కథలు రాయగలిగాడు. అడుగు వర్గాల సంసారాల్లో గాని, ప్రవృత్తుల్లో గాని గోప్యత ఉండదు. పైగా సామాజిక అంతరం స్పష్టంగా కనపడుతుంది. సామాజిక అమరికను, ఇంటా బయటా జరుగుతున్న వివక్షను అర్థవంతంగా చెప్పే వీలు కలుగుతుంది. ఉత్తరాంధ్ర అడుగువర్గాల జీవితాల్ని, భాషను అందుకు ఎంచు కున్నాడు. వారి ప్రాపంచిక దృష్టి, ఆనాటి స్థలకాలాలు అతడిని కథకుడిగా మార్చాయి.


నిత్య జీవితంలోని మామూలు సన్నివేశంలో కూడా జీవిత సత్యాలను, లోతులను, తాత్వికతను, తేటగా అలవోకగా కథగా మలచే నేర్పరి కారా. అతనిలోని తార్కికుడు వెంట్రుకను సైతం వెయ్యి వక్కలుగా చీల్చగల సమర్థుడు. సామాజిక చలన సూత్రాల పట్ల అవగాహన, తగిన ప్రాపంచిక దృక్పథం, జ్ఞానం, సైద్ధాంతిక భూమిక, ఎందుకు రాస్తున్నాననే ఎరుక కలిగి ఉండడం వల్ల అత్యంత అల్ప విషయమైనా అఖండ రూపాన్ని సంతరించుకొని అతని చేతిలో కథగా కుదురుకుంది. ‘తీర్పు’ కథ అందుకు ఉదాహరణ చిన్నపిల్లల మధ్య అట్ట కోసం జరిగిన పంచాయితీని ‘సంపద పంపిణీ’గా చూపాడు. ఆయన ఆలోచన, మాట, రాత, నడక, వ్యవహారం, అలవాట్లు, చివరకు వేసుకునే కిళ్ళీ కూడా ప్రత్యేకమే. తను అనుకున్నట్లుగా నిండుజీవితాన్ని ఫలవంతంగా, నిమ్మలంగా, ప్రయోజనాత్మకంగా గడిపి కళ్ళు మూసాడు. భగీరథుడు గంగను భూమార్గం పట్టించినట్లు, కథను కంచి దారి నుంచి కథానిలయం వైపు మళ్ళించాడు. కేవలం సంస్కరణవాద, ప్రగతిశీల వాద, మధ్య తరగతి జీవిత కథల్ని రాస్తే ఇంత వ్యాప్తి కలగక పోవు. అన్నింటికి మించి ప్రేమాస్పదుడు కనుకనే అందరివాడయ్యాడు.


అతనెక్కువ మాట్లాడకపోవడం వల్లనేమో ఆయన కథల్లో సంభాషణలు అధికంగా ఉంటాయి. ‘ఆదివారం’ కథలో సంభాషణల ద్వారానే పాత్రను, కథను కళ్ళకు కట్టించాడు. మాట వరసకైనా బయటపడడు. కథ ముగింపులో తేటతెల్లమవుతాడు. ‘‘డబ్బుతో వ్యవహారం ఎలాంటిదంటే- ఇచ్చేవాడికి పుచ్చుకునే వాడు లోకువ అనుకుంటాం, నిజానికి ఇచ్చేవాడే యిచ్చుకునే వాడికి లోకువ. అది నా పర్సనల్‌ ఎక్స్‌పీరియన్స్‌’’ (‘శాంతి’) ఈ మాటలో మాష్టారి దృష్టి, వాక్య పటిష్టత తెలుస్తుంది. ఈ మాటకు ప్రాసంగిక ఎప్పుడూ ఉంటుంది. వ్యవసాయ, పారిశ్రామిక, రాజకీయ రంగాలను వాటి వల్ల వచ్చిన మార్పులు వ్యక్తుల్ని, వ్యవస్థను ఏ విధంగా మార్చాయో కథల ద్వారా చెప్పాడు.


పాఠకుల తీరిక- ఓపికలు, పత్రికల స్పేస్‌, రచయితల శ్రద్ధాసక్తులు, సమయభావాల వల్ల కావచ్చు మొత్తానికి కథ నిడివి తగ్గింది. చిన్న కథ కంటే పెద్దగా ఉన్న మాష్టారి కథలు చదవడం కష్టంగా మారింది. కథా నిర్మాణం గురించి అరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పిన కా.రా. ‘‘నాకు కథానిక సమగ్ర స్వరూపం అర్థం కాలేదు’’ అనడం వారి వినమ్రతకు సూచిక. అది కరువైన నేటి కాలాన మాష్టారు అర్థం అవడం ఒకింత కష్టమే. కథా పోటీల ద్వారా లక్షల పంపకం జరుగుతుంది. ఈ సందర్భాన ‘స్వార్జితం కాని విత్తం మనిషిపాలిటి మహా భయంకరమైనది’’ అని చెప్పి ఆచరించిన రామారావు గారి అభిప్రాయం కాలంచెల్లినదిగా కనపడుతుంది. ‘‘గృహరుణాలో!’’ అని చెవుల్లో ఇల్లు కట్టుకొని పోరుతున్న బ్యాంకుల చెప్పుడు మాటలు విని, ఇండ్లు కట్టుకుంటున్న లోన్ల వర్తక వర్తమానమిది. మూడు పదుల కాలం మించి ఉద్యోగం చేసి, పెన్షన్‌ తీసుకుంటూ సొంత ఇల్లు కట్టుకోని పంతులుగారు కథకు ఇల్లుకట్టాడని తెలిసి ముక్కున వేలువేసుకునే వాళ్ళు కొందరు. దానికి వార్షికోత్సవాలు జరిపి వచ్చినవాళ్ళకు భోజనాలు పెట్టిం చాడని విని ఆశ్చర్యపోయేవారు మరికొందరు. మనిషి బతుకు అతని చేతుల్లో లేదని కథలు రాసి తెలుసు కున్నాడు. ఎవరి చేతిలో ఉందని అన్వేషించి కథలు రాసాడు. ఇంత చేసిన ఈయన ‘‘నేనే స్వయంగా ఏ దారీతెన్నూ కనిపించక కొట్టుమిట్టాడుతుంటా. నేనెవరికైనా ఏం చెబుతాను’’ అని అన్నాడు. నమ్మదగ్గ మాట లేనా ఇవి? ఆకులందున అణగిమణగినట్లు బతికిన ఈయనకు ఇంత కీర్తి ఎలా వచ్చింది. ఎలా వచ్చిందంటే... బతికిన తీరువల్ల వచ్చింది. శ్రమిస్తే ఆయనలా కథ రాయగలం. పరిశ్రమిస్తే అలాంటి నిలయం కట్టగలం. అలా బతకడం మాత్రం బహు కష్టం. కాళీపట్నపు వేకంట సూర్యరామ సుబ్రమణ్యేశ్వరరావు కాస్తా కా.రా.గా మారినట్లు, కా.రా. కథగా మిగిలారు. 

బి.వి.ఎన్‌. స్వామి

92478 17732


Updated Date - 2022-09-19T06:25:34+05:30 IST