చైనాను చియాన్ వూ అనే చక్రవర్తి పాలించిన కాలం అది. క్రీస్తుశకం 490లో... నాన్ చి వంశంలో ఫుడైషి జన్మించాడు. టుంగ్యాంగ్ జిల్లా అతని జన్మస్థానం. ‘ఫు’ అనేది అతని ఇంటి పేరు. ‘డైషి’ అంటే ‘గొప్ప విద్వాంసుడు’ అని అర్థం. అతనికి షాన్హు, ఫుక్సి, షాంగ్లిన్ డైషి అనే పేర్లు కూడా ఉండేవి. కానీ అతని పాండిత్యాన్ని బట్టి ఫ్యుడైషీగానే ప్రసిద్ధి చెందాడు. పదహారేళ్ళ వయసులో అతనికి వివాహం అయింది. ఇద్దరు కుమారులు కలిగారు.
ఇరవై నాలుగేళ్ళ ప్రాయంలో ఒక భారతీయ సన్న్యాసిని అతను కలిశాడు. ఆయన ఒక పర్వత శిఖరాన్ని చూపించి... ‘‘అక్కడ ధ్యానం చేస్తూ ఉండు’’ అని ఫ్యుడైషికి సలహా ఇచ్చాడు. ఆయన మాటలు అనుసరించి... ఎంతో శ్రద్ధగా ధ్యానాన్ని సాగించాడు ఫ్యుడైషి. అతనికి ఒకసారి ముగ్గురు బుద్ధులు.... శాక్యముని, విమలకీర్తి, దీంపాకరుడు దర్శనం ఇచ్చారు. వారి దేహాల నుంచి కాంతిరేఖలు వెలువడి, ఫుడైషిలోకి ప్రవేశించాయి. దాంతో అతని జీవితం పూర్తిగా మారిపోయింది. చైనాలో అతణ్ణి గురువుగా గౌరవించగా, జపాన్ వారు దైవ స్థానం ఇచ్చారు. ‘గ్రంథాలయ దైవం’గా అతణ్ణి పిలిచేవారు. గ్రంథాలయ పద్ధతిని అతడే ప్రవేశపెట్టేడనీ, ‘రింజో’(తిరిగే పుస్తకాల అర)లను ఆయనే కనుగొన్నాడనీ అంటారు. షువాంగ్లిన్ ఆలయాన్ని కూడా అతనే నిర్మించాడంటారు.
బోధిధర్మకు ఫ్యుడైషి సమకాలీకుడు. ఆ ఇద్దరితో చక్రవర్తికి పరిచయం ఉంది. చక్రవర్తి చియాన్ వూ ను ‘బుటై’ అని కూడా అంటారు. గౌతమ బుద్ధుడి బోధలను బాగా గ్రహించినవాడిగా, చక్కని వ్యాఖ్యానకర్తగా ఫ్యుడైషి ఆ రోజుల్లో పేరు పొందాడు. మరీ ముఖ్యంగా వజ్ర సూత్రంపై ఫ్యుడైషి వ్యాఖ్యానాన్ని విన్నవారందరూ అతణ్ణి ‘మిరోకు’ (రాబోయే బుద్ధుడు)గా పరిగణించి, ప్రశంసించేవారు. ఈ విషయం చక్రవర్తికి తెలిసింది. తమ రాజసభలో ప్రసంగించాల్సిందిగా ఫ్యుడైషిని ఆహ్వానించాడు. అతను ప్రసంగించాల్సిన రోజు రానే వచ్చింది.
సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. అందరూ ఫ్యుడైషి రాకకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూశారు. ఆయన రాగానే సభలో నిశ్శబ్దం ఆవరించింది. ఫ్యుడైషి వేదికను ఎక్కి నిలబడ్డాడు. అందరి కళ్ళూ ఆయననే చూస్తున్నాయి. ఆయన మాటలు వినడానికి అందరూ ఆత్రుతగా ఉన్నారు. ఫ్యుడైషీ ఒక్కసారిగా ఉరిమాడు. తన చేతిలోని దండాన్ని ప్రసంగం బల్ల మీద గట్టిగా కొట్టాడు. నిదానంగా నడిచి, సభా ప్రాంగణం నుంచి బయటకు వెళ్ళిపోయాడు. రాజుతో సహా సభలో ఉన్నవారంతా నిశ్చేష్టులయ్యారు.
ఫ్యుడైషి అనుచరుడైన షికో నెమ్మదిగా చక్రవర్తి దగ్గరకు వెళ్ళి... ‘‘ప్రభూ! అర్థమైందా?’’ అని అడిగాడు.
చక్రవర్తి నిరాశగా తలను అటూ ఇటూ ఊపాడు.
‘‘ఎంత శోచనీయం? ఫ్యుడైషి ఇంత సుదీర్ఘమైన ప్రసంగం ఇంతకు మునుపు ఎన్నడూ చేయలేదు. మీ మీద కరుణతో... మీకు బాగా అర్థం కావాలని అంత సుదీర్ఘ ప్రసంగం చేశారు’’అన్నాడు షికో.
ఇంతకూ ఫ్యుడైషి తన ప్రసంగంలో ఏం చెప్పాడు? దీనికి ఓషో వివరణ ఇస్తూ ‘‘సత్యం అంటే సత్యమే. దాని గురించి చెపఁడానికి మరేం లేదు. దానికి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. దాని గురించి ప్రసంగాలు, ప్రవచనాలు చెయ్యనక్కరలేదు. అది మన చుట్టూనే ఉంది. మనలో ఉంది. అది లేకుండా మనం లేము. దాని నుంచి మనం దూరంగా పారిపోలేం.
మనం నిద్రపోయినా, మనకు తెలియకపోయినా, సత్యం మనతోనే ఉంది. ఈ సత్యం తెలుసుకున్న వారికి ఎలాంటి సిద్ధాంతాలూ అవసరం లేదు’’ అన్నారు. సభలో అందరినీ ఈ సత్యం తెలుసుకోవాలంటూ అప్రమత్తం చేయడానికి ఫ్యుడైషి ఉరిమాడు. అదే స్థిరమైనదని గట్టిగా చెప్పడం కోసం బల్ల మీద దండంతో కొట్టాడు. గంటలు, రోజులూ కొనసాగే ప్రవచనాలకు అలవాటు పడినవారికి ఇది అర్థం కాదు. గౌతమ బుద్ధుడితో సహా ఎందరో గురువులు వేదికలమై మౌనంగా కూర్చొని, లేచి వెళ్ళిపోయిన కథలు ఎన్నో ఉన్నాయి.
రాచమడుగు శ్రీనివాసులు