అది కాంగ్రెస్‌ ఆలోచనే

ABN , First Publish Date - 2022-06-22T08:46:20+05:30 IST

అగ్నివీరుల్లో కొందరికి సర్వీసు తర్వాత రెగ్యులర్‌ ఆర్మీలో అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం, త్రివిధ దళాలు, కేంద్ర హోం, రక్షణ శాఖలు చెబుతున్నాయి.

అది కాంగ్రెస్‌ ఆలోచనే

కమిటీని వేసి.. అది ఇచ్చిన రిపోర్టు దాచేశారు.. దేశం కోసం రిస్క్‌ చేసే ప్రధాని మోదీ ఒక్కరే


సైన్యమంటే అగ్నివీరులు ఒక్కరే కాదు

మొత్తం ఆర్మీలో వారు కూడా ఒక భాగం 

రెగ్యులర్‌ సర్వీసుకు ఎంపికైనా కఠిన శిక్షణ తప్పనిసరి

మారుతున్న యుద్ధ అవసరాలకోసమే అగ్నిపథ్‌

నిజమైన ఆర్మీ అభ్యర్థులు ఆందోళనల్లో లేరు

జాతీయ భద్రతా సలహదారు ధోబాల్‌ వ్యాఖ్య

విడుదలైన వాయుసేన నోటిఫికేషన్‌

ఎల్లుండి నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలు

బుల్లెట్‌ గురితప్పడం వల్లే రాకేశ్‌ మృతి పోలీసు ఉన్నతాధికారులు వివరణ

పోలీసుల అదుపులో ఆవుల సుబ్బారావు?

ఆయన కార్యాలయంలో ఐటీ సోదాలు

అరెస్టు భయంతో యువకుడి ఆత్మహత్యాయత్నం


న్యూఢిల్లీ, జూన్‌ 21 : అగ్నివీరుల్లో కొందరికి సర్వీసు తర్వాత రెగ్యులర్‌ ఆర్మీలో అవకాశాలు ఉంటాయని కేంద్ర ప్రభుత్వం, త్రివిధ దళాలు, కేంద్ర హోం, రక్షణ శాఖలు చెబుతున్నాయి. ఇప్పుడు భర్తీ అయ్యేవారిలో కనీసం 25 శాతంమందికి రక్షణ శాఖలో ఉద్యోగాలు ఇస్తామనీ అంటున్నాయి. అయితే.. దీనిపై జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ ధోబాల్‌ మరింత స్పష్టతను ఇచ్చారు. ‘‘ భారత సైన్యంలో అగ్నివీరులు ఒకభాగం మాత్రమే. సర్వీసు పూర్తిచేసుకున్నవారిలో కొందరిని రెగ్యులర్‌ ఆర్మీ కోసం ఎంపిక చేసినా, తిరిగి వారు కఠిన శిక్షణను పొంది, తగినంత అనుభవాన్ని గడించాల్సిందే’’ అని అజిత్‌ ధోబాల్‌ పేర్కొన్నారు. మంగళవారం ఏఎన్‌ఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మారుతున్న యుద్ధ సన్నివేశానికి అనుగుణంగా భారత్‌ను సిద్ధం చేసే దార్శనికతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రదర్శిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అగ్నిపథ్‌ పథకాన్ని ధోబాల్‌ గట్టిగా సమర్థించారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకంపై పునరాలోచనలో పడిందని, నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందన్న వార్తలను ఖండించా రు.


‘‘అగ్నిపథ్‌ పథకాన్ని భిన్న దృక్కోణం నుంచి చూడాలి. ఈ పథకం స్వయంభువు కాదు. దేశాన్ని దుర్భేద్యంగానూ, శక్తిమంతంగానూ మలచడమే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన తొలిరోజు నుంచీ మోదీ పనిచేస్తున్నా రు. వ్యవస్థలు, నిర్మాణాలు, సాంకేతికత, మానవ వనరులపై భవిష్య విధానాలు అనే నాలుగు అంశాలను దీనికోసం గుర్తించారు. ఈ దిశగా వేసిన కీలక అడుగే అగ్నిపథ్‌ పథకం’’ అని ధోబాల్‌ వివరించారు. యుద్ధ రంగం స్వరూప స్వభావాలు పూర్తిగా మారిపోయాయని, ప్రస్తుతం కంటికి కనిపించని శత్రువుతో పోరాడాల్సి వస్తోందన్నారు. యుద్ధభూమిపై అతి వేగంగా విస్తరిస్తున్న సాంకేతికత పూర్తి నియంత్రణను సాధించిందన్నారు. అందుకు తగినట్టు సైన్యాన్ని సిద్ధం చేయడానికే అగ్నిపథ్‌ పథకం తెచ్చినట్టు వివరించారు. ఆర్మీ అభ్యర్థుల ఆందోళనలపై ధోబాల్‌ స్పందిస్తూ.. రెండు రకాల శ్రేణులు నిరసనల్లో భాగమవుతున్నాయని చెప్పారు. ఒక శ్రేణి అయోమయంలో ఉన్నదని, దాన్ని ఆసరా చేసుకుని కొందరు రెచ్చగొడుతుంటే.. రెండో శ్రేణి అసహనం, అరాచక మనఃస్థితితో ఆందోళనలు సాగిస్తున్నదని ఆయన విమర్శించారు. ‘25-26 ఏళ్లకు యువకులు జీవితంలో స్థిరపడతారు. ఒక జీవితంలో రెండు వృత్తుల గురించి ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ, అగ్నిపథ్‌ మూడు వృత్తులను అందుబాటులోకి తేనుంది. అగ్నివీరులు తమ సర్వీసు పూర్తి చేసుకునే సమ యానికి మనదేశ సంపద ఐదు ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుంది. అంతటి సంపన్న ఆర్థిక వ్యవస్థను నిర్వహించేందుకు క్రమశిక్షణ, ఆదేశాల పాలన చేసే అత్యధిక సంఖ్యలోని యువత అవసరం. పరిశ్రమలు, కార్పొరేట్‌ రంగాలు వారిని పిలిచి అవకాశాలు ఇస్తాయి.’’ అని ధోబాల్‌ తెలిపారు.


నిజమైన ఆర్మీ అభ్యర్థులు ఇళ్లకు పరిమితమై రిక్రూట్‌మెంట్‌కు సిద్ధమవుతున్నారన్న ఆయన.. దహనాలు, హింసకు పాల్పడేవారికి వేరే దురుద్దేశ్యాలు ఉన్నాయని ఆరోపించారు. 2006లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రక్షణ శాఖ అగ్నిపథ్‌ వంటి ఆలోచనతో ముందుకు రాగా.. బీఎ్‌సఎఫ్‌ డీజీ నేతృత్వంలో ఒక కమిటీని వేశారని.. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పటికీ వెలుగు చూడలేదని ధోబాల్‌ తెలిపారు. 

 

వాయుసేన నోటిఫికేషన్‌

వాయుసేన మంగళవారం అగ్నిపథ్‌ నోటికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 24వ తేదీ 10 గంటల నుంచి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను ప్రారంభిస్తామని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆన్‌లైన్‌లో జరిగే ఈ ప్రక్రియకు చివరి గడువు జూలై ఐదు. ఆన్‌లైన్‌ పరీక్ష, లిఖితపరీక్ష, పత్రాల పరిశీలన, దేశ దారుఢ్య పరీక్షలు, ఎడాప్టబిలిటీలో రెండు పరీక్షలు, వైద్య పరీక్షలు  అనే దశల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. 10+2 / సీబీఎ్‌సఈ పాఠ్యాంశాల ఆధారంగా పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు, సంప్రదాయ సైనిక విధానం యథాతథంగా కొనసాగుతుందని మిలిటరీ వ్యవహారాల విభాగం సంయుక్త కార్యదర్శి లెఫ్టినెంట్‌ జనరల్‌ అనిల్‌ పురీ వివరించారు. అనాదిగా ఉన్న రెజిమెంట్‌ పద్ధతిని అగ్నిపథ్‌ కోసం సవరిస్తారన్న వాదనలను ఆయన ఖండించారు. ఆందోళనలతో త్రివిధ దళాలు పునరాలోచనలో పడ్డాయన్న  వార్తలను ఆయన తోసిపుచ్చారు. నిర్దేశిత గడువులోనే రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ ఉంటుందన్నారు. 


అగ్నిపథ్‌ పిటిషన్‌పై నిర్ణయం సీజేఐదే

అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ విచారణపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తగిన నిర్ణయం తీసుకుంటారని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచాలని తెలిపింది. తాను దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరపాలని న్యాయవాది హరీష్‌ అజయ్‌ సింగ్‌ మంగళవారం న్యాయమూర్తులు జస్టిస్‌ సీటీ రవి కుమార్‌, జస్టిస్‌ సుధాన్షు ధూలియాల ద్విసభ్య వెకేషన్‌ ధర్మాసనం ముందు ప్రస్తావించారు. తమ వాదన వినకుండా ఏ నిర్ణయం తీసుకోవద్దంటూ కేంద్ర ప్రభుత్వం కేవియెట్‌ పిటిషన్‌ను దాఖలు చేసింది.


మాజీ సైనికులను ఎందరిని తీసుకున్నారు?

ఆనంద్‌ మహింద్రాకు నెటిజన్ల ప్రశ్న

అగ్నివీరులకు నాలుగేళ్ల తర్వాత తమ సంస్థలో ఉద్యోగాలిస్తామని మహింద్రా గ్రూప్‌ సంస్థల అధిపతి ఆనంద్‌ మహింద్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. భారత నావికాదళం మాజీ చీఫ్‌, చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అరుణ్‌ ప్రకాశ్‌ సహా పలువురు మాజీ సైనికాధికారులు కూడా వీరిలో ఉన్నారు. అత్యుత్తమ క్రమశిక్షణ, నైపుణ్యం కలిగిన అగ్నివీరులకు కార్పొరేట్‌ రంగంలో భారీ ఉద్యోగావకాశాలు ఉన్నాయని సోమవారం మహింద్రా ట్వీట్‌ చేశారు. మీ సంస్థలో వారికి ఏ ఉద్యోగాలిస్తారని సోమవారమే ఓ నెటిజన్‌ ప్రశ్నించగా, ‘లీడర్‌షిప్‌, టీమ్‌వర్క్‌, ఫిజికల్‌ ట్రైనింగ్‌... పరిశ్రమలకు మార్కెట్‌-రెడీ ప్రొఫెషనల్‌ సొల్యూషన్లను కూడా అగ్నివీరులు అందించగలరు. ఆపరేషన్ల నుంచి అడ్మినిస్ర్టేషన్ల వరకు అన్ని విభాగాల్లోనూ, సప్లై-చైన్‌ మేనేజ్‌మెంట్‌లోనూ వారికి ఉపాధి అవకాశాలు ఉంటాయి’ అని ఆనంద్‌ జవాబిచ్చారు.

Updated Date - 2022-06-22T08:46:20+05:30 IST