అనుభవంలో ఉన్న భూమిని ఎలా ఇస్తారు

ABN , First Publish Date - 2022-08-10T04:35:53+05:30 IST

తమ అనుభవంలో ఉన్న భూమిని ఇళ్ల నిర్మాణానికి ఎలా ఇస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అనుభవంలో ఉన్న భూమిని ఎలా ఇస్తారు
మాట్లాడుతున్న బాధితులు

బాధితుల ఆవేదన

తోటపల్లిగూడూరు, ఆగస్టు 9 : తమ అనుభవంలో ఉన్న భూమిని ఇళ్ల నిర్మాణానికి ఎలా ఇస్తారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని నరుకూరులో మంగళవారం ఎంపీటీసీ రఘుబాబుతో కలిసి  ఆ గ్రామానికి చెందిన ఆకుల రమణమ్మ, మస్తానమ్మ, లక్ష్మి విలేఖరులతో మాట్లాడారు. 103 సర్వే నెంబరులో 1.38 సెంట్ల భూమిని 50  ఏళ్ల నుంచి అనుభవిస్తున్నామని, కోర్టు కేసులో ఉన్న ఈ భూమిపై ఇటీవల కోర్టు తమకు అనుకూలంగా తీర్పు చెప్పిందన్నారు.   అయినా వైసీపీ నాయకులు దౌర్జన్యంగా ఆ భూమిలో భూమి పూజ చేసి ఇల్లు కడుతున్నారని వాపోయారు. తామంతా ఆ భూమి మీద ఆధారపడి బతుకుతున్నామని తెలిపారు. ఆ భూమిని పంచుతారని అధికారులకు తెలియదా అని ప్రశ్నించారు. ఎస్టీలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, తమ భూములు లాక్కుని వారికి ఇవ్వడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.  తమకు న్యాయం జరిగే దాకా పోరాటం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జితేంద్ర, మన్యం కిరణ్‌, ఆకుల జయకుమార్‌, స్థానికులు, తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ భూమిని ఎస్టీల ఇళ్ల స్థలాలకు ఇచ్చాం

 ప్రభుత్వ భూమిని గిరిజనులకు ఇవ్వడం తప్పా అని వైసీపీ మండల కన్వీనర్‌ ఉప్పల శంకరయ్యగౌడ్‌ అన్నారు. కాలువ గట్టు మీద ఉన్న యానాదుల ఇళ్ల కోసం ఈ ప్రభుత్వ భూమిని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశామని తెలిపారు. కట్టడాలను అడ్డగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఆయన వెంట ఆకుల మధు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-10T04:35:53+05:30 IST