‘భరోసా’ కాదు.. భారం!

ABN , First Publish Date - 2020-07-06T08:13:06+05:30 IST

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన బోర్ల పథకంపై విమర్శలొస్తున్నాయి. కేవలం బోరు మాత్రం వేసి వదిలేస్తే దానికి మోటారు, విద్యుత్‌ కనెక్షన్లు

‘భరోసా’ కాదు.. భారం!

  • బోరు మాత్రమే తవ్వితే మోటారు ఎవరిస్తారు?
  • జలసిరిలో 6వేలకే బోరు, మోటార్‌, సోలార్‌ సెట్‌ 
  • ఇప్పుడు ఆ ఊసే లేకుండా మార్గదర్శకాలు జారీ 
  • పార్లమెంటు నియోజకవర్గానికి ఒకటే మిషన్‌ 
  • సకాలంలో అందరికీ అందుతాయా అని సందేహాలు
  • వైఎస్‌ఆర్‌ బోర్ల పథకంపై పేదరైతుల్లో అసహనం 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): వైఎస్‌ఆర్‌ రైతు భరోసా ద్వారా ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన బోర్ల పథకంపై విమర్శలొస్తున్నాయి. కేవలం బోరు మాత్రం వేసి వదిలేస్తే దానికి మోటారు, విద్యుత్‌ కనెక్షన్లు సొంతగా ఏర్పాటు చేసుకొనే సామర్థ్యం తమకు లేదని పేదరైతులు వాపోతున్నారు. ఈమాత్రం దానికి ‘ఎన్టీఆర్‌ జలసిరి’ని ఎందుకు రద్దు చేశారని మండిపడుతున్నారు. ఎస్సీ, ఎస్టీలు రూ.6వేలు, ఇతరులు రూ.25వేలు చెల్లిస్తే బోరు, మోటార్‌, సోలార్‌సెట్‌ ఉచితంగా ఇస్తున్న జలసిరి పథకాన్ని రద్దుచేయడం సబబు కాదంటున్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే అమలులో ఉన్న ఎన్టీఆర్‌ జలసిరి పథకాన్ని రద్దుచేసింది. దాని స్థానంలో వైఎ్‌సఆర్‌ రైతు భరోసా ద్వారా బోర్ల పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏడాది తర్వాత దీనికి సంబంధించిన మార్గదర్శకాలను పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ నెల 3న మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక బోరు మెషీన్‌ కొని ప్రభుత్వమే సొంతంగా బోర్లు వేస్తుందని ప్రకటించింది. ఇటీవల బిడ్ల ప్రక్రియ పూర్తిచేసుకుని రైతులను బోర్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. బోరుబావుల పథకం విధివిధానాలు పరిశీలిస్తే ఇది రైతుకు భారమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు ప్రయోజనం లేని పథకం రైతు భరోసా ఎలా అవుతుందంటూ పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.


దీనికీ సిఫారసులేనా... 

వైఎ్‌సఆర్‌ రైతు భరోసా ద్వారా అమల్లోకి తెచ్చిన బోర్లపథకం అమలు కోసం బడ్జెట్‌లో గతేడాది రూ.200 కోట్లు, ఈ ఏడాది రూ.100 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష బోర్లు ఉచితంగా తవ్వాలని, తవ్వకపు ఖర్చు భరించేందుకు రూ.300కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే మోటారు, విద్యుత్‌ కనెక్షనలకు సంబంధించి మాత్రం ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. అసలు వాటి ఊసే ఎత్తలేదు. దీంతో బోర్లు వేసుకున్న తర్వాత మోటార్ల కోసం ఎక్కడకెళ్లాలంటూ పేదరైతులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఈ బోర్లు అందరికీ సకాలంలో అందుతాయా అన్న సందేహాలు నెలకొన్నాయి. ఒక్కో పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక్కో బోరు మిషన్‌ ద్వారా బోర్లు వేయడం వల్ల తమవంతు రావడానికి ఎంత కాలం పడుతుందోనని పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా వీటిని కూడా రాజకీయ నేతలు, పెద్దలు సిఫారసు చేసినవారికే వేస్తారేమోనని, తమదాకా వస్తాయా అని అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఉపయోగపడని సీజన్‌లో బోరు వేసినా ప్రయోజనం ఉండదని రైతులు పేర్కొంటున్నారు.


పేద రైతుకు ‘జలసిరి’

రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల పేద రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పథకం ఎన్టీఆర్‌ జలసిరి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ఇందిర జలప్రభ పేరుతో ఈ పథకం ప్రారంభమైనా... అప్పట్లో నాబార్డు నిధులివ్వకపోవడంతో కొనసాగలేదు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులే స్వయంగా నిరంతర కసరత్తుతో పకడ్బందీగా ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. పేద రైతులందరికీ ఈ పథకం ఉపయోగపడేలా అప్పటి సీఎస్‌ ఎస్పీ టక్కర్‌, ఆ తర్వాత వచ్చిన దినేశ్‌కుమార్‌ సుమారు 10మంది నిపుణులతో కమిటీలు వేసి సమగ్ర మార్గదర్శకాలను రూపొందించారు. దరఖాస్తు ప్రక్రియ నుంచి సర్టిఫికెట్ల సమర్పణ వరకు అన్నీ సరళతరం చేసి శాచ్యురేషన్‌ విధానంలో భూమి ఉన్న ప్రతి పేద రైతుకు బోరు వేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. దీనిపై విస్తృత అవగాహన కలగడంతో రైతులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. పథకం ఊపందుకుంటున్న నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వం రావడం, దాన్ని రద్దుచేయడం జరిగిపోయాయి. 


జలసిరి ద్వారా రూ.6వేలు చెల్లిస్తే ఐదెకరాల లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 200అడుగుల బోరుబావితో పాటు రూ.2.42లక్షల విలువచేసే 5హెచ్‌పీ సోలార్‌పంపు సెట్లను అమర్చేవారు. అగ్రవర్ణాలకైతే రూ.25వేలు చెల్లిస్తే ఈ సౌకర్యాలన్నీ అందేవి. 2018-19కి సంబంధించి 45,300 బోర్లు తవ్వి వాటికి సోలార్‌ పంపుసెట్లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లో 1,2305 బోరుబావులను తవ్వారు. దాదాపు 8,939 బోరుబావులను సోలార్‌ పంపుసెట్లతో శక్త్తిమంతం చేశారు. దీనివల్ల 17,878మంది రైతులు లబ్ధిపొందగా, 44,695 ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇందుకు ప్రభుత్వం రూ.51.26కోట్లు ఖర్చు చేసింది. 2016-17లో ప్రారంభించిన ఈ పథకం అంచలంచెలుగా పేదల్లోకి వెళ్లింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్ష బోర్లు ఏర్పాటుచేసి 10లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే పాత పథకాలేవీ కనపడకూడదన్న లక్ష్యంతో జలసిరి పథకాన్ని రద్దు చేశారని పేద రైతులు వాపోతున్నారు.

Updated Date - 2020-07-06T08:13:06+05:30 IST