ఆ రోజు..

ABN , First Publish Date - 2022-08-14T05:30:00+05:30 IST

స్వాతంత్య్రం వచ్చి నేటికి 75 ఏళ్లు అవుతోంది. బ్రిటీష్‌ పాలనలో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయులకు స్వాత్రంత్యం వచ్చిన రోజు.. పండగ రోజే. చరిత్రలో నిలిచి పోయే ఆ రోజును భారతీయులు ఎన్నటికీ మరిచిపోలేరు.

ఆ రోజు..


- స్వాతంత్య్రం వచ్చిన వేళ.. సందడే సందడి
- ఊరంతా సంబరాలు చేసుకున్నాం
- ఉద్యమకారులకు జేజేలు పలికాం
- జెండా వందనాలతో పండగ వాతావరణం
- ‘ఆంధ్రజ్యోతి’తో నాటి అనుభవాలు పంచుకున్న పెద్దలు


స్వాతంత్య్రం వచ్చి నేటికి 75 ఏళ్లు అవుతోంది. బ్రిటీష్‌ పాలనలో బిక్కుబిక్కుమంటూ గడిపిన భారతీయులకు స్వాత్రంత్యం వచ్చిన రోజు.. పండగ రోజే. చరిత్రలో నిలిచి పోయే ఆ రోజును భారతీయులు ఎన్నటికీ మరిచిపోలేరు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా.. స్వాతంత్య్రం వచ్చిన వేళ.. అప్పట్లో చిన్నారులు, యువకులుగా ఉన్న ఇప్పటి పెద్దలను ‘ఆంధ్రజ్యోతి’ పలుకరించింది. ఈ సందర్భంగా వారంతా ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. తొలి స్వరాజ్య కబురు తెలిసిన క్షణాన.. ఆ సందడే వేరు అంటూ మురిసిపోయారు. స్వాతంత్య్రం వచ్చిన సంగతి ఎలా తెలిసింది. అసలు అప్పుడేం జరిగిందన్నది స్వయంగా వెల్లడించారు. ఊరంతా సంబరాలు చేసుకున్నామని, జెండా వందనాలు చేశామని, పోరాటయోధులకు జేజేలు పలికామని తెలిపారు. ఆ రోజును ఎప్పటికీ మరచిపోలేమని స్పష్టం చేశారు.

బొబ్బిలి/ రాజాం రూరల్‌/ విజయనగరం(ఆంధ్రజ్యోతి), ఆగస్టు 14:

సంబరాలు చేసుకున్నాం
1947 ఆగస్టు 14న అర్ధరాత్రి  12 గంటలకు భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినట్లు రేడియోలో తొలిసారిగా విన్నాం. అప్పుడు నా వయసు 14 ఏళ్లు. బొబ్బిలి పట్టణంలో పెద్దల ఆధ్వర్యంలో భారీ ఊరేగింపు నిర్వహించారు. పట్టరాని సంతోషం ప్రజల్లో పెల్లుబికింది. స్వాతంత్రోద్యమ కాలంలో బొబ్బిలి చాలా చైతన్యవంతంగా ఉండేది.  జాతీయనాయకులు చేస్తున్న పోరాటంపై నిత్యం ఆరా తీస్తూ నైతిక మద్దతు అందించేవారు. నేటి రాజకీయాలు వ్యాపారాత్మకం, కలుషితమై పోయాయి. బొబ్బిలికి చెందిన గోనా సీతారామస్వామి, కోటగిరి సీతారామస్వామి, అయ్యగారి నారాయణమూర్తి, ఆయన కొడుకులు  స్వయంగా ఉద్యమంలో పాల్గొని లాఠీదెబ్బలు తిన్నారు. జైలు శిక్ష అనుభవించారు.
                            - డాక్టర్‌ రెడ్డి సత్యారావు, బొబ్బిలి


పాటలు పాడాం
1947లో ఆగస్టు 14న స్వాతంత్య్రం వచ్చిన విషయాన్ని పత్రికల ద్వారా పూర్తిస్థాయిలో తెలుసుకున్నాం. అంతకుముందుగానే ఓ  ప్రకటన వెలువడడంతో బొబ్బిలి పట్టణ పరిధిలోని గొల్లపల్లి ఎయిడెడ్‌ పాఠశాలలో జాతీయజెండా ఎగురవేశారు. నాకు అప్పుడు 13 ఏళ్లు. ఐదో తరగతి పూర్తి చేశాను. సుమారు రెండువందలమంది విద్యార్థులం అక్కడ హాజరయ్యాం. పాటలు పాడాం. పాఠశాల హెచ్‌ఎం అండ్‌ మేనేజరు మల్లమ్మపల్లి అప్పలస్వామి, చుండూరి గున్నేశ్వరరావు మాస్టార్లు ప్రసంగించారు. నాతో పాటు మరో విద్యార్థి కూడా మాట్లాడాడు.  
                  - వజ్జి రాములు, రిటైర్డ్‌ హైస్కూలు హెచ్‌ఎం, పాతబొబ్బిలి


ఊరంతా ఉత్సాహం
స్వాతంత్య్రం వచ్చిన నాటికి నా వయసు 19 ఏళ్లు. బానిస బతుకులకు విముక్తి కలిగిందని ఊరంతా ఉవ్వెత్తున ఉత్సాహం వెల్లివెరిసింది. ఎన్నో పండుగలను కలిసి చేసుకున్నంత సందడి కనిపించింది. ఎవరి జేబుల్లో ఎంత ఉంటే అంత సునాయాసంగా ఖర్చుచేశాం. గాంధీ, బోసు, పటేల్‌, అల్లూరి సీతారామరాజు వంటి వారి పేర్లు వింటే జనమంతా ఉబ్బితబ్బిబ్బయ్యేవారు. విశాఖలో గాంధీ, నెహ్రూ మీటింగులకు వెళ్లడానికి మా తోటి యువకులమంతా పరుగులు తీసేవారం.
            -  సిద్దా సత్యనారాయణ, శ్రీకళాభారతి అధ్యక్షుడు, బొబ్బిలి


పత్రికలు చూసి తెలుసుకున్నాం
స్వాతంత్య్రం వచ్చిన విషయాన్ని దినపత్రికలు చూసి తెలుసుకున్నాం. మా గురువుగారు ఆకుండి రాజేశ్వరరావు మాస్టారు పోస్టుమాస్టర్‌గా కూడా పనిచేసేవారు. ఆయన పత్రికలు తెప్పించేవారు. ఆయన ద్వారా ఊరందరికీ ఈ సమాచారం తెలిసింది. ప్రజలంతా ఎంతో ఆనందించారు. నాకు అప్పుడు ఎనిమిదేళ్లు.  సైకిలు తొక్కుతుండగా బ్రిటీషు పోలీసులకు కనిపిస్తే వాటిని లాక్కునేవారు. రైతులు నాటుబండిపై ఎక్కి కనిపించినా పోలీసులు సహించేవారు కాదు. ఓ రోజు మా అందరి సైకిళ్లను తీసుకెళ్లడానికి పోలీసులు వస్తున్నారని తెలుసుకొని ఓ గోదాములో సైకిళ్లను పెట్టి వాటిని వేరుశనగ కాయలతో కప్పి భద్రపరుచుకున్నాం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఎర్ర రంగు టోపీ పోలీసులంటే ప్రజలంతా భయపడేవారు.
     - కందుల ధర్మరాజు, రిటైర్డ్‌ టీచరు, గజరాయునివలస, బాడంగి మండలం.

నాన్న చెప్పారు
మనకు స్వాతంత్య్రం వచ్చిందని, ఇకపై తెల్లదొరలతో కష్టాలు ఉండవని అప్పట్లో మా నాన్న శ్రీరామాచారి చెప్పారు. అప్పటికి నా వయసు 23 ఏళ్లు. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు తెలిసీ తెలియని వయసులో పెళ్లి చేశారు. అప్పటికే నాకు ఇద్దరు కొడుకులు. మా ఆయన అప్పారావు ఆచారి 1943లోనే మరణించారు. స్వాతంత్య్రం వచ్చిన మూడు రోజుల తరువాత మాకు విషయం తెలిసింది. చాలా ఆనందం అనిపించింది. ఆ రోజుల్లో బంగారు ఆభరణాలు తయారు చేసి పర్లాకిమిడి, బొబ్బిలి, విజయనగరం రాజులకు అమ్మేవారు. అమ్మ, నాన్నలే నాకు పెద్ద దిక్కుగా నిలిచారు. ప్రస్తుతం కొడుకు, మనవడు, మనవడి భార్య, ముని మనవడు, మనవరాళ్లతో ఉంటున్నాను.
                - మండా గున్నరాజమ్మ, బుక్కా వీధి, రాజాం

ఆనందానికి అవధుల్లేవు
స్వాతంత్య్రం వచ్చే ముందు ప్రతిరోజు భయం భయంగా గడిపేవాళ్లం. అప్పటికి నా వయసు 15 ఏళ్లు. 11వ ఏటే వివాహమైంది. చిన్నప్పుడు నా తోటి పిల్లలతో ఆడుకుందామని బయటకు వచ్చినా భయం వేసేది.  పెళ్లి తరువాత కూడా బంకర్లలో ఉండేవాళ్లం. ఇంట్లో నుంచి బయటకు పెద్దలు రానిచ్చేవారు కాదు. బాంబులు పడతాయని చెప్పేవారు. ఇంటి పక్కన, మధ్యలో సుమారు 10-15 అడుగుల లోతున బంకర్లు తవ్వి అందులో నివశించేవారం. వీధి దీపాలు వెలగకుండా చేసేవారు. స్వాతంత్య్రం వచ్చినట్లు తెలిశాక చాలా ఆనందించాం.
            - కట్టమూరి వెంకటసుబ్బలక్ష్మి, మండపం వీధి, విజయనగరం

అంతటా ఆనందోత్సవాలు
ఆగస్టు, 14, 1947 నాటికి నాకు 15 ఏళ్లు. దేశవ్యాప్తంగా ఉద్యమాలు ఒక్కసారిగా ఆగి ఆనందోత్సవాలు కనిపించాయి. 15న ఉదయం నుంచీ సంబరాలు ప్రారంభమయ్యాయి. మేమంతా చిన్న పిల్లలం. ఇప్పుడున్నంత కమ్యూనికేషన్‌, నెట్‌వర్క్‌ అప్పట్లో లేవు. రేడియోలు కూడా అరుదు. స్వాతంత్య్ర సంగ్రామంలో ఎంతో మంది మరణించారు. జైలు జీవితం అనుభవించారు..  వారు సాధించిన స్వాతంత్ర్యానికి నేటి  ప్రజలు అర్థమివ్వాలి.
                - పెద్దింటి అప్పారావు, విజయనగరం

వాడవాడలా వేడుకలు

 1947 ఆగస్టు 15 స్వాతంత్య్రం నాటికి నాకు 15 ఏళ్లు. స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు జరుగుతుండేవి. తాలుకా కార్యాలయం నుంచి స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించాలని ఆదేశాలొచ్చాయి. పాఠశాలల్లో జాతీయ జెండా ఎగురవేశాం. స్వాతంత్య్ర వేడుకలు వాడవాడలా జరిగాయి. పిల్లలు, తల్లిదండ్రులు కూడా ఆ పండగలో భాగస్వాములయ్యారు.
స్వాతంత్య్రం వచ్చినట్లు.. వేడుకలు జరుపుకుంటున్నట్లు గ్రామగ్రామానికి ఫిర్కా కార్యాలయాల ద్వారా సమాచారం అందించారు.
                -  వి.ప్రకాశరావు, రిటైర్డ్‌ ఉపాధ్యాయుడు, చినకేర్జల గ్రామం.

సందడి చేశారు
నేను 1931లో  గరుగుబిల్లి మండలం వల్లరగుడబ గ్రామంలో జన్మించాను. 1948లో అడ్డాపుశిల గ్రామంలోని మేనేజ్‌మెంట్‌ స్కూల్లో ఉపాధ్యాయునిగా చేరాను. 1947 ఆగస్టు 15వ తేదీన పత్రికల ద్వారా స్వాతంత్య్రం వచ్చినట్లు తెలిసింది. ఆ రోజు ఎక్కడి చూసినా సందడే కనిపించింది. ప్రజలంతా ఒక్కసారిగా బయటకు వచ్చి ఊపిరి పీల్చుకున్నారు.
            - చిట్టిబాబు మాస్టారు(రిటైర్డ్‌), సీతారాంపురం,గరుగుబిల్లి మండలం

ఉపాధ్యాయులే చెప్పారు
నాకు 98 ఏళ్లు. గరుగుబిల్లి మండలం గొట్టివలసలో చదువుకున్నాను. 1947 ఆగస్టు 15నాకు ఇప్పటికీ గుర్తుంది. మా గ్రామంలోని బోర్డు స్కూల్లో స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. ఉపాధ్యాయులు జెండా ఎగుర వేశారు. స్వాతంత్య్రం వచ్చినట్లు ఉపాధ్యాయులే పిల్లలకు వివరించారు. అప్పట్లో బతకటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. బ్రిటీష్‌ వారు పన్నుల కోసం తీవ్రంగా ఒత్తిడి తెచ్చేవారు. ఆస్తులు జప్తు చేస్తామని భయపెట్టేవారు.
                - తెర్లి కృష్ణమూర్తినాయుడు, వైకేఎం కాలనీ, పార్వతీపురం
=======
                                                     

Updated Date - 2022-08-14T05:30:00+05:30 IST