- మూడు వాయిదాలుగా అదే తీరు
- సాయిరెడ్డి తీరుపై ఈడీ అభ్యంతరం
హైదరాబాద్, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసులో రెండో ముద్దాయి, వైసీపీ నేత విజయసాయి రెడ్డి చెప్పిందే చెబుతూ... వాయిదాల మీద వాయిదాలు తీసుకుంటూ కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యంతరం వ్యక్తం చేసింది. గత మూడు వాయిదాలుగా ఇదే వైఖరి ప్రదర్శిస్తున్నారని తెలిపింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఈడీ, సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు విచారణకు వచ్చింది. తొలుత ఈడీ కేసులను విచారణకు చేపట్టరాదని విజయసాయిరెడ్డి తరఫు లాయర్లు కోరారు. ఈ విషయంపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, సర్వోన్నత న్యాయస్థానం స్పందన వచ్చే వరకు తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. దీనిపై ఈడీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గత మూడు వాయిదాలుగా సాయిరెడ్డి ఇదే చెబుతున్నారని తెలిపారు. ఈడీ మోపిన అభియోగాలపై న్యాయస్థానంలో వాదనలకు సిద్ధం కావాలన్నారు. ఈ వాదనల అనంతరం కేసు విచారణను 20వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానం తెలిపింది. కాగా, ఇండియా సిమెంట్స్ కేసు చార్జిషీటు నుంచి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ పేరు తొలగించొద్దని సీబీఐ కోరింది. ఈ కేసులో జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటరు దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని అభ్యర్థించింది. విచారణను 17వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.