పాతికేళ్లుగా అంతే..

ABN , First Publish Date - 2022-04-23T05:35:41+05:30 IST

కోవెలకుంట్ల మేజర్‌ గ్రామ పంచాయతీలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని 150 గదులకు పాతికేళ్లుగా వేలం పాట జరగడం లేదు.

పాతికేళ్లుగా అంతే..
కోవెలకుంట్ల మేజర్‌ గ్రామ పంచాయతీ

వేలంపాట జరగని పంచాయతీ కాంప్లెక్స్‌ రూములు 

కోర్టుకు వెళ్లిన వ్యవహారం 

ప్రభుత్వానికి ఆదాయం గండి  


కోవెలకుంట్ల, ఏప్రిల్‌ 22: కోవెలకుంట్ల మేజర్‌ గ్రామ పంచాయతీలోని షాపింగ్‌ కాంప్లెక్స్‌లోని 150 గదులకు పాతికేళ్లుగా వేలం పాట జరగడం లేదు. అధికారులు షాపింగ్‌ కాంప్లెక్స్‌ల్లో ఉన్న వారికే అప్పుడప్పుడూ కొంత రుసుము పెంచి తిరిగి వారికే కేటాయిస్తున్నారు. దీంతో గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి పడుతోంది. ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 25వ తేదీన బహిరంగం వేలంపాట నిర్వహించాలని కలెక్టర్‌ కోలేశ్వరరావు ఆదేశిచారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో రూముల్లో బాడుగకు ఉంటున్న వారిలో కొంత మంది హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. దీంతో కోర్టు వేలంపాట తాత్కాలికంగా నిలిపివేసింది. గదుల్లో ఉంటున్నవారికి నోటీసులు ఇచ్చి పది రోజుల తర్వాత గ్రామ పంచాయతీ అధికారులు వేలంపాటలు నిర్వహించాలని   ఆదేశించంది. ఏప్రిల్‌ 2న నంద్యాల కొత్త జిల్లాగా ఏర్పడింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌ గదుల్లో ఉంటున్న వారు కొంత బాడుగ పెంచి తమకే గదులు ఇవ్వాలని అధికారులను కోరినట్లు తెలిసింది. నాయకులు కూడా ఈ ఏడాది వేలం వేయకుండా గదుల్లో ఉంటున్నవారికే ఇచ్చేలా చూడమని అధికారులకు తె లిపినట్లు సమాచారం. 


వేలంపాట జరిగితే.. 


కోవెలకుంట్ల మేజర్‌ గ్రామ పంచాయ తీకి 105 గదులకు రూ.50 లక్షలు ఆదాయం వస్తోంది. ఇప్పుడున్న ధరల ప్రకారం వేలం పాటలు నిర్వహించినా రూ.కోటికిపైగా ఆదా యం వస్తుంది. అయినా వేలం వేయకపోవడంతో గ్రామ పంచాయతీ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. 


 హైకోర్టు తీర్పు అమలు చేస్తాం


కోవెలకుంట్ల మేజర్‌ గ్రామ పంచాయతీ తరపున వేలం పాటలు నిర్వహించాలని హైకోర్టును ఆశ్రయించాం. హైకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం నడుచుకుంటాం. 


 - బాలాంజనేయులు కోవెలకుంట్ల మేజర్‌ గ్రామ పంచాయతీ ఈవో 

Updated Date - 2022-04-23T05:35:41+05:30 IST