కోటి దండాలయ్యా..

ABN , First Publish Date - 2020-07-12T10:11:39+05:30 IST

మూడేళ్లుగా కనిపించని బిడ్డ కోసం..

కోటి దండాలయ్యా..

బిడ్డ ఆచూకి లభ్యం.. 

ఆనందభాష్పాలతో ఆంధ్రజ్యోతికి కృతజ్ఞతలు


మైదుకూరు(కడప): మూడేళ్లుగా కనిపించని బిడ్డ కోసం ఎదురుచూస్తున్న తల్లి ఆవేదనను ‘యాడుండావు నాయనా..!’ అంటూ శనివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురించిన కథనానికి ఫలితం దక్కింది. బిడ్డ ఆచూకీ దొరికింది. దీంతో ‘‘కోటి దండాలయ్యా.. కలకాలం ఆంధ్రజ్యోతి వర్ధిల్లాలి’’ అంటూ ఆ తల్లి ఆనందభాష్పాలతో దీవించింది. 


మైదుకూరు పట్టణంలోని శ్రీరామ్‌నగర్‌కు చెందిన మీరాంబీ భర్త 2017లో చనిపోయాడు. అదే ఏడాది 14 ఏళ్ల కుమారుడు షాజిత్‌ రెహమాన్‌ కనిపించకుండా పోయాడు.  పోలీస్‌స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశారు. బిడ్డకోసం ఆమె నెలనెలా స్టేషన్‌కు తిరుగుతోంది. కనిపించిన వారినంతా బిడ్డకోసం అడుగుతోంది. ఆ తల్లి పడే బాధను శనివారం ‘యాడుండావు నాయనా..!’ అంటూ ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది. దీంతో రెండేళ్ల క్రితం నుంచి కడప బాల శిశువిహార్‌లో ఉంటున్న షాజిత్‌ రెహమాన్‌ ఎవరనేది అధికారులు గుర్తించారు.


వెంటనే ఆ తల్లికి ఫోన్‌ చేసి సమాచారం అందించారు. ఇంకేముంది ఆ క్షణంలో ఆతల్లి ప్రేమ కట్టలు తెంచుకుంది. ఆనంద భాష్పాలు జలజలా రాలాయి. ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికి పేపర్‌లో వచ్చిన కథనం చూపుతూ నా బేఠా వస్తున్నాడు.. అంటూ చెప్పింది.  సోమవారం బిడ్డను అప్పగిస్తామని అధికారులు చెప్పారని తెలిపింది. ఈ విషయంపై ఆంధ్రజ్యోతి కలకాలం వర్ధిల్లాలని, ఈ జన్మలో మిమ్ములను మరవలేనని, నా ఆయుష్షుకూడా పోసుకొని మీరు నిండు నూరేళ్లు సుఖంగా జీవించాలంటూ ఆ తల్లి దీవించింది.


ఇది కూడా చదవండి:


యాడుండావు నాయనా..!

Updated Date - 2020-07-12T10:11:39+05:30 IST