ప్రాణాలతో తిరిగి రాగలిగా.. మీ సీఎంకు థాంక్స్: మోదీ

ABN , First Publish Date - 2022-01-05T22:27:08+05:30 IST

భద్రతా కారణాల రీత్యా ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దు కావడం, తిరిగి బటింటా విమానాశ్రయానికి..

ప్రాణాలతో తిరిగి రాగలిగా.. మీ సీఎంకు థాంక్స్: మోదీ

చండీగఢ్: భద్రతా కారణాల రీత్యా ప్రధాని నరేంద్ర మోదీ ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దు కావడం, తిరిగి బటింటా విమానాశ్రయానికి ఆయన చేరుకోవడం వంటి ఘటనలు బుధవారం పంజాబ్‌లో చోటుచేసుకున్నారు. ''ప్రాణాలతో బటిండా విమానాశ్రయానికి చేరుకున్నా. మీ ముఖ్యమంత్రికి థాంక్స్'' అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా అధికారులతో అన్నట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ ట్వీట్ చేసింది.


దీనికి ముందు బటిండా నుంచి ఫిరోజ్‌పూర్‌కు కాన్వాయ్‌లో ప్రధాని బయలుదేరారు. అక్కడి ఫ్లైఓవర్‌ను రైతులు దిగ్బంధించడంతో ప్రధాని తన కారులోనే సుమారు 20 నిమిషాల పాటు నిలిచిపోయారు. ప్రైవేటు కార్లు సైతం పీఎం కాన్వాయ్‌ వైపు రావడంతో దీనిని  భద్రతా వైఫల్యంగా కేంద్ర హోం శాఖ (ఎంహెచ్ఏ) తప్పుపట్టింది. అనంతరం ప్రధాని ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయింది. ప్రధాని కాన్వాయ్ వెళ్లేంతవరకూ రోడ్లపై ఇతర వాహనాల రాకపోకలు లేకుండా చూడటంలో పంజాబ్ ప్రభుత్వం విఫలమైందని ఎంహెచ్ఏ ఆరోపించింది. పంజాబ్ పోలీస్ డీజీపీ ఆధ్వర్యంలో తగిన భద్రతా ఏర్పాట్లు జరిగినట్టు ధ్రువీకరించడంతోనే ప్రధాని రోడ్డు ప్రయాణం చేపట్టినట్టు తెలిపింది. ముందుగా అనుకున్న ప్రకారం హుస్సైనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారక స్థూపం వద్దకు హెలికాప్టర్‌లో ప్రధాని చోరుకోవాల్సి ఉంది. అయితే వర్షం, దారి సక్రమంగా కనిపించకపోవడంతో రోడ్లు ప్రయాణం సాగించాలని నిర్ణయించారు.


సెక్యూరిటీ లోపం ఉత్తదే...

ప్రధాని పర్యటనలో భద్రతా లోపం జరిగనట్టు వచ్చిన ఆరోపణలను పంజాబ్ ప్రభుత్వ ప్రతినిధి డాక్టర్ రాజ్‌కుమార్ వెర్కా తోసిపుచ్చారు. ''ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారం. బీజేపీ నేతలు జనాలను సభకు రప్పించడంలో విఫలం కావడంతో ర్యాలీ ఫ్లాప్ అయింది'' అని  ఆయన అన్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ప్రధాని ఫిరోజ్‌పూర్ ర్యాలీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే తాజా పరిణామాలతో ప్రధాని ర్యాలీ రద్దయింది. కాగా, ముఖ్యమంత్రి చరణ్‌జిత్ ఛన్ని కనీసం ఫోను కూడా ఎత్తలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు.

Updated Date - 2022-01-05T22:27:08+05:30 IST