Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 22 Jul 2022 14:14:22 IST

సినిమా రివ్యూ : ‘థాంక్యూ’ (Thankyou)

twitter-iconwatsapp-iconfb-icon

చిత్రం : థాంక్యూ 

విడుదల తేదీ : జూలై 22, 2022

నటీనటులు : నాగచైతన్య, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికాగోర్, ప్రకాశ్ రాజ్, సంపత్ రాజ్, రాజశ్రీ నాయర్, తులసి, ఈశ్వరీరావు, మిర్చీ హేమంత్. భరత్‌రెడ్డి తదితరులు

సంగీతం : తమన్

సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరామ్

నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్

దర్శకత్వం : విక్రమ్ కె కుమార్

‘మజిలి, లవ్‌స్టోరీ, బంగార్రాజు’ చిత్రాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు నాగచైతన్య. తదుపరిగా ‘మనం’ చిత్రంతో తన ఫ్యామిలీకి మెమరబుల్ హిట్టిచ్చిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రెండోసారి నటించిన చిత్రం ‘థాంక్యూ’. ఈ సినిమా ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చింది. విడుదలకు ముందు టీజర్, సింగిల్స్, ట్రైలర్‌తో మంచి స్పందనను దక్కించుకున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాల్ని ఏమేరకు అందుకుంది? చైతూ ఖాతాలో మరో హిట్టు పడిందా? అనే విషయాలు రివ్యూలో చూద్దాం. (Thankyou movie review)

కథ

నారాయణపురం అనే చిన్న గ్రామానికి చెందిన అభిరామ్ (నాగచైతన్య) పట్టుదలతో.. అమెరికా చేరి అక్కడ జాబ్ కన్సల్టెన్సీ రావు (ప్రకాశ్ రాజ్) సహాయంతో వైద్య అనే యాప్ డవలప్ చేసి బిలీనియర్ అవుతాడు. అయితే తన సక్సెస్‌కు కారణం తనేనని, తాను సొంతంగా ఎవరి సహాయం లేకుండా ఎదిగాననే అహంకారంతో బ్రతికేస్తుంటాడు. ఈ జెర్నీలో అతడికి ప్రియా (రాశీఖన్నా) పరిచయం అవుతుంది. అభిరామ్‌తో సహజీవనం చేస్తుంటుంది. అయితే అభిరామ్‌లోని మార్పుకు ప్రియా చాలా బాధపడుతుంది. అభిరామ్ స్వార్ధం కారణంగా రావు చనిపోతాడు. దాంతో ప్రియ అభిరామ్‌ను వదిలేసి వెళ్ళిపోతోంది. తన సక్సెస్‌కు రావు ప్రధాన కారణమని తెలుసుకున్న అభిరామ్‌ను గిల్టీ ఫీలింగ్ వేధిస్తుంటుంది. ఆ తర్వాత తన సక్సెస్ వెనుక చాలా మంది వ్యక్తులున్నారని అభి రియలైజ్ అవుతాడు. అప్పటి నుంచి ఓ థాంక్యూ టూర్ వేస్తాడు. మరి అభిరామ్ వారి పట్ల తన కృతజ్ఞతా భావాన్ని ఎలా చూపిస్తాడు? అతడి సక్సెస్ టూర్ ఎలాంటి పరిస్థుతులకు దారి తీసింది? అనేదే మిగతా కథ. (Thankyou movie review)

విశ్లేషణ

జీవితంలో మన ఎదుగుదలకు చాలా మంది కారణమవుతారు. ఎంత ఎదిగినా, మనం ఉన్నత స్థితిలోకి రావడానికి కారణమైన వారి పట్ల మనం ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉండాలి.. అనే సింగిల్ లైన్ కథాంశమిది. ఇలాంటి ఫీల్ గుడ్ కాన్సెప్ట్‌ను రెండు గంటల సినిమాగా చెప్పాలనుకున్నాడు దర్శకుడు విక్రమ్. ఆ ప్రయత్నం పూర్తిగా కాకపోయినా.. కొంతవరకూ సక్సెస్ అయింది. అయితే ఇలాంటి కథాంశాలకు స్పేస్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి.. మూడు దశల్లో కథానాయకుడి కేరక్టర్ ను ఎస్టాబ్లిష్ చేశాడు. వాటిని అతడి థాంక్స్ టూర్‌కు లింక్ చేయడం మెప్పిస్తుంది. ఆ మూడూ ‘ప్రేమమ్’ తరహాలో ప్రేక్షకులకు మంచి ఫీల్‌ను ఇస్తాయి. ఫస్టాఫ్ ను చక్కటి ఎమోషన్స్, రొమాంటిక్ సీన్స్ తో నడిపించే ప్రయత్నం చేశాడు. అక్కడక్కడా చిన్న ట్విస్టుల రూపంలో ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలు వస్తాయి. ఫ్లాష్ బ్యాక్‌లో మాళవికా నాయర్, చైతూతో వచ్చే సన్నివేశాలు కొత్తగా అనిపిస్తాయి. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఫస్టాఫ్‌లో కథేంటో రివీల్ చేయకుండా.. అభిరామ్ తన జెర్నీకి సహకరించినవారికి థాంక్స్ చెప్పాలని రియలైజ్ అవడంతో ఇంటర్వెల్ ముగుస్తుంది. 


ఇక సెకండాఫ్ అంతా.. అభిరామ్ ఎలా థాంక్స్ చెప్పాడు అనే అంశం చుట్టూనే తిరుగుతుంది.  హీరో గోల్ ఏంటో ఇంటర్వెల్ దగ్గర రివీల్ చేయడంతో సెకండాఫ్ అంతా అతడు థాంక్స్ చెప్పడమే లక్ష్యంగా పెట్టుకోవడం ప్రేక్షకులకు కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చే మరో ప్లాష్ బ్యాక్ లో అవికాగోర్ పాత్ర ఎంటర్ అవుతుంది. అయితే ప్రేక్షకులు ఊహించినట్టు ఆమె కథానాయిక కాకపోవడం ఒక ట్విస్ట్ అని చెప్పాలి. అవికాగోర్, చైతూ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఎమోషనల్‌గా కదిలిస్తాయి. అలాగే మరికొన్ని సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కానీ సినిమాకి బలమైన కాన్ఫ్లిక్ట్స్ లేకపోవడంతో.. చాలా ఫ్లాట్‌గా సాగుతుంది కథనం. సినిమాకి అదే మైనస్ పాయింట్.  హాకీ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మెప్పిస్తాయి. ఇక ఈ సినిమాలో హైలైట్‌గా నిలిచే మహేశ్ బాబు రిఫరెన్సెస్ తో వచ్చే సన్నివేశాలు అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పోకిరి కటౌట్ నేపథ్యంలో వచ్చే సన్నివేశం అయితే థియేటర్స్‌లో విజిల్స్ వేయిస్తుంది. 


అభిరామ్‌గా నాగచైతన్య మూడు దశల్లోని పాత్రల వేరియేషన్స్‌ను చక్కగా ప్రెజెంట్ చేశాడు. అలాగే ఎమోషన్స్‌నూ బాగా క్యారీ చేశాడు. ‘ప్రేమమ్’ స్థాయిలో రొమాన్స్‌నూ బాగా పండించాడు. ప్రియగా రాశీఖన్నా తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పాలి. చైతూ మారాలని తపనపడే ప్రియురాలిగా చక్కటి ఎమోషన్స్‌తో ఆ పాత్రలో మెప్పించింది. రావుగా ప్రకాశ్ రాజ్ కనిపించేది చాలా తక్కువే అయినా.. ఉన్నంతలో ఆ పాత్రకు ప్రాణం పోశారు. మిగిలిన తారాగణమంతా వారి పాత్రల మేరకు బాగా చేశారు. పీసీ శ్రీరామ్ కెమేరా పనితనం గురించి పనిగట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన విజువల్స్‌తో మంచి ఫీల్‌ను కలిగించారు. ఇక తమన్ సంగీతం ఊహించిన స్థాయిలో లేకపోయినా పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. బీవీయస్ రవి అందించిన కథలో కమర్షియాలిటీ పాళ్ళు చాలా తక్కువ ఉండడంతో.. ఒక వర్గం ప్రేక్షకుల్నే ఈ సినిమా అలరించే అవకాశాలున్నాయి. మొత్తానికి విక్రమ్ కె కుమార్ ‘థాంక్యూ’ చిత్రంతో ఒక ఫీల్‌గుడ్  సిన్సియర్ అటెమ్ట్ అయితే చేశాడు. (Thankyou movie review)

ట్యాగ్‌లైన్ : అభిమానులకు మాత్రమే 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement