తంగవేలు.. జేజేలు

ABN , First Publish Date - 2021-09-01T09:49:25+05:30 IST

టోక్యో పారాలింపిక్స్‌లో పతకాల మోత మోగుతూనే ఉంది. గత రెండు రోజుల్లోనే ఏడు మెడల్స్‌తో వహ్వా.. అనిపించిన దివ్యాంగ అథ్లెట్లు.. మంగళవారం మరో మూడింటితో మురిపించారు. టీ42 హైజం‌ప్‌లో మరియప్పన్‌ తంగవేలు రజతం, శరద్‌ కుమార్‌ కాంస్యంతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించగా.. కేవలం నాలుగేళ్ల క్రితమే షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న సింగ్‌రాజ్‌ అదాన కాంస్యంతో సత్తా చాటుకున్నాడు...

తంగవేలు.. జేజేలు

  • పారాలింపిక్స్‌లో వరుసగా రెండో పతకం
  • హైజంప్‌లో రజతం సొంతం..శరద్‌కు కాంస్యం 
  • షూటింగ్‌లో సింగ్‌రాజ్‌ కంచు మోత

టోక్యో పారాలింపిక్స్‌లో పతకాల మోత మోగుతూనే ఉంది. గత రెండు రోజుల్లోనే ఏడు మెడల్స్‌తో వహ్వా.. అనిపించిన దివ్యాంగ అథ్లెట్లు.. మంగళవారం మరో మూడింటితో మురిపించారు. టీ42 హైజం‌ప్‌లో మరియప్పన్‌ తంగవేలు  రజతం, శరద్‌ కుమార్‌ కాంస్యంతో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించగా..   కేవలం నాలుగేళ్ల క్రితమే షూటింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న సింగ్‌రాజ్‌ అదాన కాంస్యంతో సత్తా చాటుకున్నాడు. దీంతో మొత్తం పది పారా మెడల్స్‌తో భారత్‌ 30వ స్థానంలో కొనసాగుతోంది.



స్వర్ణంపై గురిపెట్టినా.. 

పురుషుల హైజంప్‌ టీ42 ఈవెంట్‌లో భారత్‌కు రజతం, కాంస్యం దక్కింది. అయితే డిఫెండింగ్‌ చాంపియన్‌ మరియప్పన్‌ తంగవేలు ఈసారి కూడా స్వర్ణం సాధిస్తాడని అంతా ఆశించారు. కానీ వర్షంతో అతడి కృత్రిమ కాలి సాక్స్‌ తడిగా మారడంతో పూర్తి స్థాయిలో రాణించలేకపోయాడు. చివరకు మూడో ప్రయత్నంలో 1.86 మీటర్ల ఎత్తు జంప్‌ చేసిన తంగవేలు రజతం అందుకున్నాడు. స్వర్ణ ప్రయత్నంలో 1.88 మీ. ఎత్తు కోసం తంగవేలు, అమెరికన్‌ సామ్‌ గ్రెవే ఇద్దరూ తమ రెండో ప్రయత్నంలో విఫలమయ్యారు. చివరిదైన మూడోసారీ కూడా జంప్‌ చేయలేకపోతే ఇద్దరికీ స్వర్ణం దక్కేది. కానీ తంగవేలు విఫలమై.. సామ్‌ గట్టెక్కడంతో భారత్‌ రెండో స్థానానికి పరిమితమైంది.


భార్య నగలు అమ్మి..


షూటింగ్‌ ప్రాక్టీస్‌ ఆరంభించిన నాలుగేళ్లలోనే ఒలింపిక్‌ పతకం సాధించాడు 39 ఏళ్ల సింగ్‌రాజ్‌ అదాన. అయితే, దీని వెనుక ఎంతో కృషి, పట్టుదలతోపాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంది. హరియాణాలోని ఫరీదాబాద్‌కు చెందిన అదానకు పోలియో కారణంగా రెండుకాళ్లు చచ్చుబడ్డాయి. తన మేనల్లుడు షూటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు చూడడానికి వెళ్లి.. అనుకోకుండా గన్‌ పట్టుకున్నాడు. గురిపెట్టి కాల్చితే ఐదు షాట్లలో నాలుగు టార్గెట్‌కు తగలడంతో.. షూటింగ్‌పై ఆసక్తి పెంచుకున్నాడు. అయితే, ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నప్పుడు ఎంతో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కరోనా కారణంగా సరైన ప్రాక్టీస్‌ లేకపోవడంతో ఆందోళనకు గురయ్యాడు. దీంతో ఇంట్లోనే షూటింగ్‌ రేంజ్‌ను నిర్మించుకోవాలని చూసినా.. ఆర్థికంగా వెసులుబాటు కాలేదు. చివరకు అతడి భార్య నగలు అమ్మి.. లక్షలు ఖర్చు చేసి షూటింగ్‌ రేంజ్‌ను తయారు చేయించాడు. వాస్తవంగా తాను జూదం ఆడానని సింగ్‌రాజ్‌ చెప్పాడు. ‘ఆశించిన విధంగా జరగకపోతే.. మనం బతకడానికి ఇబ్బందిలేకుండా చూడాలని అమ్మ కోరింద’ని మెడల్‌ సాధించిన సందర్భంగా సింగ్‌ గుర్తు చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడం, కోచ్‌లు సహకారం అందించడంతో సింగ్‌రాజ్‌ పతకంతో సగర్వంగా నిలిచాడు. 



నిషేధాన్ని దాటుకొని.. 


బిహార్‌కు చెందిన శరద్‌ కుమార్‌ (25).. పోలియో బాధితుడు. నకిలీ వ్యాక్సిన్‌ కారణంగా పోలియో సోకడంతో ఎడమకాలు చచ్చుబడినా.. ఏమాత్రం అధైర్యపడలేదు. డార్జిలింగ్‌ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఆటలపట్ల కూడా ఆసక్తి కనబరిచే వాడు. ఏడో తరగతిలో శరద్‌ హైజం్‌పలోకి అడుగుపెట్టాడు. ఆరంభంలో అందరూ నిరాశపరిచినా.. పట్టుదలతో ప్రాక్టీస్‌ చేశాడు. వైకల్యం ఉన్నా.. మిగతా వారితో పోటీపడుతూ స్కూల్‌, జిల్లా రికార్డులను అధిగమించాడు. ఇంటర్మీడియట్‌ నుంచి ఢిల్లీలో చదువుకున్నాడు. జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిలో పీజీ పూర్తి చేశాడు. 2010లో ఆసియా పారా గేమ్స్‌లో తొలిసారి అంతర్జాతీయ పోటీల్లో బరిలోకి దిగాడు. అయితే, డోపింగ్‌లో పట్టుబడడంతో రెండేళ్లు నిషేధం ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆవేదన చెందినా కుటుంబసభ్యులు ఇచ్చిన ధైర్యంతో కోలుకున్న శరద్‌.. పట్టుదలతో శ్రమించి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. 2014లో ఆసియా పారా గేమ్స్‌ రికార్డుతో స్వర్ణం సాధించాడు. రియోలో పాల్గొన్నా పతకం సాధించలేక పోయాడు. అయితే, టోక్యో క్రీడల కోసం రెండేళ్లపాటు ఉక్రెయిన్‌లో శిక్షణ పొందాడు. 


గాయంతోనే బరిలోకి..

ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న శరద్‌ కుమార్‌కు సోమవారమే మోకాలికి గాయమైంది. దీంతో అతడు పతకంపై ఆశలు కోల్పోయాడు. అయినా కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో బరిలోకి దిగాడు. పట్టువదలకుండా ప్రయత్నించి 1.83మీ.లతో కాంస్యం సాధించాడు. అలాగే రియో గేమ్స్‌లో కాంస్యం సాధించిన మరో హైజంపర్‌ వరుణ్‌ సింగ్‌ భాటియా (1.77మీ.) ఏడో స్థానంలో నిలిచాడు. 


విధిని జయించి.. 


        (ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)


కష్టాల కడలిలో పెరిగినా.. వైకల్యం బాధించినా.. మనోబలంతో విధిని జయించి.. అత్యున్నతస్థాయికి ఎగసిన అథ్లెట్‌ తంగవేలు మరియప్పన్‌. తమిళనాడులోని సేలానికి చెందిన మరియప్పన్‌ది కడుపేద కుటుంబం. చిన్నతనంలోనే తండ్రి వదిలేసి వెళ్లినా.. తల్లి సరోజ్‌ కూలి పనులు, కూరగాయలు అమ్మి ఆరుగురు సంతానాన్ని పెంచిపెద్ద చేసింది. ఐదేళ్ల వయసులో జరిగిన రోడ్డు ప్రమాదం రూపంలో మరియప్పన్‌ను విధి వెక్కిరించింది. స్కూలుకు వెళ్తున్న సమయంలో డ్రైవర్‌ నిర్లక్ష్యంగా నడపడంతో.. బస్సు కిందపడి కుడి మోకాలు కింది భాగం నుజ్జునుజ్జయింది. డాక్టర్లు కాలు తీసేయాలన్నా.. అతడి తల్లి అందుకు ఒప్పుకోలేదు. ఎలాగోలా కొడుకును బతికించుకున్నా.. ఆర్థిక కష్టాలు మరింత వెంటాడాయి. తమ పోషణ కోసం తల్లి పడుతున్న కష్టాలను చూసి.. ఆమెకు అండగా నిలవాలనే సంకల్పంతో చదువుపై దృష్టిసారించాడు. వాలీబాల్‌ ఆడాలనే ఆసక్తి ఉన్నా.. ఎగిరి ఆడడం సాధ్యమయ్యేది కాదు. అయితే, టీచర్‌ సలహా మేరకు హైజం్‌పను ఎంచుకోవడంతో అతడి జీవితం మలుపుతిరిగింది. 2013లో జాతీయ పారా అథ్లెటిక్స్‌లో పాల్గొనడంతో కోచ్‌ సత్యనారాయణ దృష్టిలోపడ్డాడు. అతడి ప్రతిభను గుర్తించిన కోచ్‌ వెంటనే బెంగళూరు సాయ్‌ సెంటర్‌లో చేర్చాడు. ఏడాదిన్నర శిక్షణ తర్వాత మరియప్పన్‌ అంతర్జాతీయస్థాయికి ఎదిగాడు. 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. మరియప్పన్‌ ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం అర్జున, పద్మశ్రీతో సత్కరించింది.

    



అభినందనల వెల్లువ


‘మన పారా అథ్లెట్లు దేశం గర్వించే ప్రదర్శనను కొనసాగిస్తూనే ఉన్నారు. తంగవేలు రజతం.. శరద్‌, సింగ్‌రాజ్‌ కాంస్యాలు అందరికీ ప్రేరణగా నిలుస్తాయి’ 

- రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌


‘స్థిరత్వం, ఉన్నత స్థాయి ప్రదర్శనకు తంగవేలు నిదర్శనం. ఈసారి రజతంతో అతడు దేశాన్ని మురిపించాడు. అలాగే శరద్‌ కుమార్‌ ఎందరికో ఆదర్శంగా నిలుస్తాడు. సింగ్‌రాజ్‌ కఠోర శ్రమకు ఫలితం దక్కింది’          

 - ప్రధాని నరేంద్ర మోదీ

 

‘పతకాలు గెలిచిన ముగ్గురు అథ్లెట్లకు అభినందనలు. వారి ప్రదర్శనతో భారత్‌ గర్విస్తోంది. భవిష్యత్‌లో వీరంతా మరింతగా రాణించాలి’ 

- ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

Updated Date - 2021-09-01T09:49:25+05:30 IST