తమ్మిలేరు.. పట్టించుకోరు..

ABN , First Publish Date - 2022-01-29T06:25:55+05:30 IST

తమ్మిలేరు.. పట్టించుకోరు..

తమ్మిలేరు.. పట్టించుకోరు..
తమ్మిలేరు ప్రాజెక్టు రెగ్యులేటర్‌ (ఫైల్‌)

ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఉదాసీనత

రూ.16 కోట్ల జైకా నిధులున్నా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

నిధులు మంజూరై మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం

శిథిలావస్థకు చేరుతున్న రిజర్వాయర్‌

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు కీలకం

నీరందక ఆయకట్టు రైతుల ఆగ్రహం


రెండు జిల్లాలకు ప్రతిష్టాత్మకమైన.. 25వేల ఎకరాల ఆయకట్టుకు కీలకమైన తమ్మిలేరు ప్రాజెక్టును ప్రభుత్వం అనాథగా వదిలేసింది. ప్రాజెక్టు మరమ్మతులకు రూ.16 కోట్ల జైకా నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని దుస్థితికి తెచ్చింది. ప్రాజెక్టు అందుబాటులో లేక, పచ్చటి పంటలకు సాగు నీరందక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు.

చాట్రాయి : కృష్ణా-పశ్చిమ గోదావరి జిల్లాల ఉమ్మడి ప్రయోజన పథకం తమ్మిలేరు రిజర్వాయర్‌ ప్రాజెక్టు మరమ్మతులకు 2018లో జపాన్‌ బ్యాంకు (జైకా) నుంచి రూ.16 కోట్లు మంజూరయ్యాయి. అయినా ఇంకా పనులు ప్రారంభంకాలేదు. ఫలితంగా రెండు జిల్లాల్లో 25వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2 ద్వారా జలాశయానికి గోదావరి జలాలు అనుసంధానం చేసే పనులు కూడా పూర్తి కాలేదు. 

ప్రభుత్వాలు మారినా..

1978లో ప్రాజెక్టు ఉపయోగంలోకి వచ్చిన దగ్గర నుంచి అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు జలాశయం నిర్వహణ పట్ల సవతి ప్రేమ చూపిస్తూనే ఉన్నాయి. దీంతో 30ఏళ్ల నుంచి మరమ్మతులు లేక జలాశయం మట్టికట్ట, రివిట్‌మెంట్‌, తూములు, కాలువలు, ఆయకట్టు చెరువులు, రెగ్యులేటర్‌ గేట్లు, పంట కాలువల షట్టర్లు శిథిలావస్థకు చేరాయి. ఫలితంగా పంటలకు సక్రమంగా నీరు అందట్లేదు. వరదలు వచ్చినప్పుడు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టుకు గండి పడితే కృష్ణా, పశ్చిమ గోదావరి  జిల్లాల్లోని ఏటి ఒడ్డున ఉన్న గ్రామాలతో పాటు ఏలూరు సైతం మునిగిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

టెండర్లు పిలుస్తారా?

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు మరమ్మతులకు టెండర్లు పిలిచారు. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించటానికి సన్నాహాలు చేసుకుంటుండగా, ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. దీంతో పనులకు బ్రేక్‌ పడింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో పాత టెండర్‌ను రద్దు చేసింది. మళ్లీ 2021, జూన్‌లో టెండర్‌ పిలవగా, ఓ కాంట్రాక్టర్‌ పని దక్కించుకోగా, ఉన్నతస్థాయి కమిటీ పరిశీలన అనంతరం ఈ టెండర్‌ కూడా రద్దు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి టెండర్లు పిలిచి మరమ్మతు పనులు ప్రారంభించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. 

ప్రాజెక్టు చరిత్ర

ఏలూరు పట్టణానికి వరద ముంపు నివారణ, మెట్ట ప్రాంతానికి సాగు, తాగునీరు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ఇంజనీర్‌ డాక్టర్‌ కేఎల్‌ రావు తమ్మిలేరు ప్రాజెక్టును డిజైన్‌ చేశారు. 1962లో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శంకుస్థాపన చేశారు. అనేక ఆటుపోట్లు అధిగమించి కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల భూభాగం నాలుగు వేల ఎకరాల్లో, ఏడు కిలోమీటర్ల మట్టికట్టతో, మూడు టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో 1978 నాటికి ప్రాజెక్టు ఉపయోగంలోకి వచ్చింది. 

త్వరలో టెండర్లు పిలుస్తాం..  - అప్పారావు, ఏలూరు ఇరిగేషన్‌ డీఈఈ 

తమ్మిలేరు ప్రాజెక్టు మరమ్మతులకు టెండర్లు పిలవటానికి ఎస్‌ఈ కార్యాలయంలో అవసరమైన కసరత్తు జరుగుతోంది. జైకా నిధులు రూ.16 కోట్లు అందుబాటులో ఉన్నందున పనులు కొన్ని నెలల్లోనే మొదలుకావచ్చు. 

Updated Date - 2022-01-29T06:25:55+05:30 IST