దారి చూపండి

ABN , First Publish Date - 2021-07-30T05:35:30+05:30 IST

దారి చూపండి

దారి చూపండి
చిన్నంపేట వద్ద తమ్మిలేరుపై అసంపూర్తి కాజ్‌వే

చిన్నంపేటలో తమ్మిలేరుపై అసంపూర్తిగా కాజ్‌వే

ఏటా వర్షాకాలంలో రెండు జిల్లాల రాకపోకలు బంద్‌

30 ఏళ్లుగా తీరని సమస్య.. రైతుల ఇక్కట్లు

చిన్న కాజ్‌వే.. రెండు గ్రామాల మధ్య రాకపోకలను స్తంభింపజేస్తోంది. చిన్న సమస్య.. 30 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోక ప్రమాదాలకు కారణమవుతోంది. చాట్రాయి మండలం చిన్నంపేట-పశ్చిమ గోదావరి జిల్లాలోని శివపురం గ్రామాల మధ్య తమ్మిలేరుపై 30ఏళ్ల కిందట కాజ్‌వే నిర్మించారు. అయితే, పనులు అసంపూర్తిగా వదిలేయడంతో ఈ కాజ్‌వే ఏటా వర్షాకాలంలో రెండు గ్రామాలను విడదీసేస్తోంది. వర్షం పడిన ప్రతిసారీ ఇక్కడ గండి పడుతుండటంతో రాకపోకలు నిలిచిపోయి రెండు జిల్లాల ప్రజలు, రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. రోజూ అధిక సంఖ్యలో రైతులు, కూలీలు తమ్మిలేరు మీదుగా రాకపోకలు సాగిస్తుంటారు. శివపురానికి చెందిన విద్యార్థులు చిన్నంపేట స్కూళ్లలో చదువుతున్నారు. గండి పడిన ప్రతిసారీ వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. 1986లో ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా, తమ్మిలేరును దాటుతూ ఆరుగురు కూలీలు వరదలో కొట్టుకుపోయారు. దీనిపై స్పందించిన ఎన్టీఆర్‌ కాజ్‌వే నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అప్పటి చింతలపూడి ఎమ్మెల్యే, మంత్రి కోటగిరి విద్యాధరరావు కృషితో నిధులు మంజూరై 1992లో కాజ్‌వే నిర్మాణం ప్రారంభమైంది. అయితే, నిధులు సరిపోక కృష్ణాజిల్లావైపు రెండు ఖానాలు తక్కువగా నిర్మించి, అప్రోచ్‌ రోడ్డు వేసి, రెయిలింగ్స్‌ కూడా లేకుండా అసంపూర్తి కాజ్‌వేను ఉపయోగంలోకి తెచ్చారు. ఆ తరువాత దీని గురించి ఎవరూ పట్టించుకోలేదు. ఏటా తుఫాన్లు, భారీ వర్షాలు పడినపుడు తమ్మిలేరుకు భారీగా వరద రావటం, అప్రోచ్‌ రోడ్డుకు గండి పడటం సాధారణమైపోయింది. కాజ్‌వే మిగతా నిర్మాణానికి రూ.40 లక్షలతో అంచనాలు తయారుచేసి పదేళ్ల కిందటే ప్రభుత్వానికి పంపారు. ఇంతవరకు అనుమతులు రాలేదు. ఫలితంగా ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాజ్‌వే శాశ్వత మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని రెండు జిల్లాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.  - చాట్రాయి

Updated Date - 2021-07-30T05:35:30+05:30 IST