తల్లడిల్లుతున్న ‘తల్లీ బిడ్డ’

ABN , First Publish Date - 2021-08-11T23:22:29+05:30 IST

నెల్లూరు: ప్రభుత్వ ఆసుత్రుల్లో పురుడుపోసుకున్న నిరుపేదల తల్లులు, నవజాతా శిశువులను సురక్షితంగా ఇంటికి చేర్చే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకానికి గ్రహణం పట్టింది.

తల్లడిల్లుతున్న ‘తల్లీ బిడ్డ’

తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ పథకానికి గ్రహణం

8 నెలలుగా నిధులు ఇవ్వని ప్రభుత్వం

కాలం చెల్లిన వాహనాలతో డ్రైవర్ల కుస్తీ 

వేతనాలు అందక ఉద్యోగుల అవస్థలు


నెల్లూరు: ప్రభుత్వ ఆసుత్రుల్లో పురుడుపోసుకున్న నిరుపేదల తల్లులు, నవజాతా శిశువులను సురక్షితంగా ఇంటికి చేర్చే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకానికి గ్రహణం పట్టింది. కాలం చెల్లిన వాహనాలతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండేళ్ల క్రితం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకం నిర్వహణకు సంబంధించి.. జీవీకే సంస్థ కుదుర్చుకున్న టెండర్‌ ప్రక్రియ పూర్తయినా తిరిగి టెండర్లు పిలవలేదు. జూలైకే తాత్కాలిక నిర్వాహణ బాధ్యతలు ముగిసినా.. సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలావుంటే 8 నెలలుగా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ నిర్వాహణకు ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. 

కాలం చెల్లిన వాహనాలతో అవస్థలు

2016, జనవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీన్నే అప్పట్లో 102 అంబులెన్స్‌గా పిలిచేవారు. అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 13 వాహనాలు ఉండగా, రెండు మరమ్మతులకు గురవగా..  ప్రస్తుతం 11 మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. నెల్లూరులోని జీజీహెచ్‌లో 3, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రిలో 1, కావలి, గూడూరు జిల్లా ఆసుపత్రులలో రెండేసి చెప్పున, వెంకటగిరి 1, పొదలకూరు 1, కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో 1 అందుబాటులో ఉన్నాయి. నిత్యం 25 మంది బాలింతలను వారి నివాసాలకు ఈ వాహనాల ద్వారా చేరుస్తున్నారు. 

వేతనాల కోసం ఎదురుచూపులు

తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ పథకంలోని 11 వాహనాలకు 11 మంది డ్రైవర్లు ఉన్నారు. రోజుకు 12 గంటలకు పైగా పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.7,200 మాత్రమే వేతనం ఇస్తున్నారు. 8 నెలలుగా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా జీవీకే సంస్థ వేతనాలు చెల్లించేది. అయితే, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో మూడు నెలలుగా ఆ సంస్థ కూడా వేతనాలు ఇవ్వడం లేదు. 

Updated Date - 2021-08-11T23:22:29+05:30 IST