థాలీ బజావో... కేంద్ర భారీ వడ్డనలపై రాహుల్

ABN , First Publish Date - 2022-03-22T19:40:43+05:30 IST

నాలుగున్నర నెల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియకు తెరపడి, ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే కేంద్రం..

థాలీ బజావో... కేంద్ర భారీ వడ్డనలపై రాహుల్

న్యూఢిల్లీ: నాలుగున్నర నెల పాటు సాగిన ఎన్నికల ప్రక్రియకు తెరపడి, ఫలితాలు వెలువడిన కొద్ది రోజులకే కేంద్రం అమాంతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను భారీగా పెంచడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు చేశారు. ''పెట్రోల్, గ్యాస్, డీజిల్‌పై విధించిన లాక్‌డౌన్ ఎత్తేశారు'' అంటూ  రాహుల్ ట్వీట్ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో మోదీ ఏం చెప్పారో అదే చేశారని పేర్కొంటూ..'థాలి బజావో' (ప్లేటు వాయించడం) అంటూ ఆ ట్వీట్‌ యాష్‌ట్యాగ్ ఇచ్చారు. దాదాపు 137 రోజుల తర్వాత మంగళవారంనాడు పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు 80 పైసలు చొప్పున ఆయిల్ సంస్థలు పెంచాయి. ఎల్‌పీజీ గ్యాస్ ధరను అమాతం రూ.50 పెంచారు.


మేం చెప్పలేదా?: అథీర్

కేంద్ర ప్రభుత్వ చర్యను పలువురు కాంగ్రెస్ నేతలు ఎండగట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇంధనం ధరలు అమాంతం పెంచేస్తారని తాము ముందే చెప్పామని, అదే నిజమైందని అధీర్ రంజన్ చౌదరి అన్నారు. పేద ప్రజలను కొల్లగొట్టేందుకు మోదీ ఎప్పుడూ వెనుకాడరని, సామాన్య ప్రజల తరఫున తాము లోక్‌సభ వెలుపల, లోపల కూడా పోరాటం చేస్తూనే ఉన్నామని చెప్పారు. ఇంధనం ధరలను పెంచడం ద్వారా పేద ప్రజల నుంచి మోదీ రూ.10,000 కోట్లు కొల్లగొట్టారని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ఉక్రేయిన్, రష్యా సంక్షోభం వల్ల ధరలు పెరిగి, పెట్రోలియం కనిష్ట స్థాయిలో ఉంటుందని చాలా మంది చెబుతూ వచ్చారని, మనం ఒక్క శాతం క్రూడాయిల్ కూడా రష్యా నుంచి కొనుగోలు చేయలేదని ఆయన అన్నారు. కాగా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ కేంద్రంపై విరుచుకుపడ్డారు. ఎన్నికల తర్వాత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అసాధారణంగా కేంద్రం ధరలు పెంచేస్తుందని అఖిలేష్ యాదవ్ తన ప్రసంగంలో పదేపదే ప్రజలను హెచ్చరిస్తూనే ఉన్నారని, అదే ఇప్పుడు జరిగిందని అన్నారు.

Updated Date - 2022-03-22T19:40:43+05:30 IST