Delta వేరియంట్‌‌కు చెక్ పెట్టే ప్లాన్.. ప్రపంచంలోనే తొలిసారిగా..

ABN , First Publish Date - 2021-07-12T23:28:18+05:30 IST

డెల్టా వేరియంట్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రస్తుత తరుణంలో థాయ్‌ల్యాండ్ టీకా మిక్సింగ్‌ను తమ దేశంలో అమలు చేసేందుకు సిద్ధమైంది.

Delta వేరియంట్‌‌కు చెక్ పెట్టే ప్లాన్.. ప్రపంచంలోనే తొలిసారిగా..

బ్యాంకాక్: కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే రక్షణను మరింత పెంచే వ్యూహంగా వ్యాక్సిన్ మిక్సింగ్ విధానం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇందులో భాగంగా.. తొలి డోసుగా ఓ కంపెనీకి చెందిన కరోనా టీకాను రెండో డోసు కింద మరో కంపెనీ టీకాను ఇవ్వాల్సి ఉంటుంది! ఈ విధానంతో రోగనిరోధక శక్తి మరింతగా బలపడి కరోనాను ధీటుగా ఎదుర్కొంటుందని పలు అధ్యయనాలు ఇప్పటికే రుజువు చేశాయి. ఇక డెల్టా వేరియంట్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రస్తుత తరుణంలో థాయ్‌ల్యాండ్ టీకా మిక్సింగ్‌ను తమ దేశంలో అమలు చేసేందుకు సిద్ధమైంది. చైనా సైనోవాక్ టీకాను తొలి డోసుగా  ఆస్ట్రాజెనెకా టీకాను రెండో డోసుగా ఇచ్చేందుకు నిర్ణయించినట్టు సోమవారం నాడు ప్రకటించింది. ‘‘టీకా మిక్సింగ్ ద్వారా డెల్టా వేరియంట్‌ నుంచి మరింత రక్షణ లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది’’ అని థాయ్‌ల్యాండ్ ఆరోగ్య శాఖ మంత్రి తాజాగా పేర్కొన్నారు.


థాయ్‌ల్యాండ్‌తో పాటూ పొరుగున ఉన్న ఇండోనేషియాలో టీకా తీసుకున్న తరువాత కూడా పలువురు ఫ్రంట్‌లైన్ వర్కర్లు కరోనా బారినపడ్డారు. ఈ రెండు దేశాలు చైనా టీకానే అధికంగా వినియోగించాయి. ఇక థాయ్‌ల్యాండ్‌కు జూన్‌లో ఆస్ట్రాజెనెకా టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో కరోనా నుంచి మరింత రక్షణనిచ్చే టీకా మిక్సింగ్ పద్ధతిని అమలు చేసేందుకు థాయ్‌ల్యాండ్ నిర్ణయించింది. అంతేకాకుండా.. చైనా టీకా రెండు డోసులు తీసుకున్న వారికి మూడో డోసు కింద ఫైజర్ టీకా ఇచ్చే అంశాన్ని కూడా థాయ్‌ల్యాండ్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ లెక్కల ప్రకారం.. థాయ్‌ల్యాండ్‌లో సోమవారం నాడు కొత్తగా 8,656 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. మరో 80 మంది ఈ మహమ్మారికి బలయ్యారు. ఇప్పటివరకూ అక్కడ 345027 కరోనా కేసులు, 2791 మరణాలు సంభవించాయి. 


Updated Date - 2021-07-12T23:28:18+05:30 IST