అయినవారికే అందలం

ABN , First Publish Date - 2020-08-11T13:05:21+05:30 IST

తమ అడుగులకు మడుగులొత్తేవారి కోసం అధికార పక్షం చేసిన ఒత్తిళ్లకు..

అయినవారికే అందలం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): తమ అడుగులకు మడుగులొత్తేవారి కోసం అధికార పక్షం చేసిన ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా యంత్రాంగం డిప్యుటేషన్ల పేరుతో అడ్డగోలుగా తహసీల్దార్లను బదిలీలు చేసింది. దీంతో అనేక సాంకేతిక సమస్యలు ఎదురవటంతో వాటిని సరిచేసేందుకు వారి బదిలీలకు తాజాగా రాజముద్ర వేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఇక డిప్యుటేషన్లపై వచ్చిన కొందరు ఆయా స్థానాల్లో పాతుకుపోయే పరిస్థితి ఏర్పడగా, మరికొందరు బాధితులుగా మారిపోయారు. అధికార పక్ష ప్రజా ప్రతినిధుల కోరిక మేరకు బదిలీలు చేసిన జిల్లా యంత్రాంగానికి ఇప్పుడు మరో చిక్కు వచ్చి పడింది. ఈ బదిలీల్లో కొందరికే అనుకూలురు రాగా.. మిగతా వారు తమ మాట వినటం లేదు.. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నారంటూ లేఖలు రాస్తున్నారు. దీంతో బదిలీలు చేసినా తంటానే! చేయకపోయినా తంటానే! జిల్లా యంత్రాంగం పరిస్థితి ఇప్పుడు ఎలా తయారైందంటే.. అడకత్తెరలో ఇరుక్కున్నట్లయింది.


కరోనాకు ముందు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో భారీ కుదుపు జరిగింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే అధికార పక్ష ప్రజా ప్రతినిధులు తమ మాట వినే అధికారులను బదిలీలపై రప్పించాలని వేసిన ఆర్డర్‌ కోసం జిల్లా యంత్రాంగం జిల్లాలోని సగం మండలాల పరిధిలో తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. అప్పట్లో వారు కోరినట్టుగా బదిలీలు చేశారు. తర్వాత కొద్ది కాలానికే జిల్లాలో దాదాపుగా సగం మందిని కొద్ది వ్యవధిలోనే బదిలీలు చేశారు. కొత్త నేతలు అధికారంలోకి రావటం, అధికారులపై అవగాహన లేక సిఫార్సు లెటర్లు ఇవ్వటం.. ఇచ్చినా పని జరగకపోవటం, మాట వినకపోవటం వంటి కారణాలతో వారి నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు జిల్లా యంత్రాంగం ఆకస్మిక బదిలీలు చేపట్టింది. అయితే ఈ బదిలీలన్నీ ప్రజాప్రతినిధుల చెప్పుచేతల్లో పనిచేసేవారు కాదు! వీరిలో కొందరిని కదిలించటానికి మరికొందరు తహసీల్దార్లు బలి పశువులయ్యారు. దాదాపు 20 మంది బదిలీల పర్వంలో మూడొంతుల మంది అధికారపార్టీ ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల ఫలితంగా బదిలీ చేసినవే.


ఆ.. తహసీల్దార్లు మాకొద్దు..!

అధికార పక్ష ప్రజా ప్రతినిధుల సిఫార్సులతో డిప్యుటేషన్ల బదిలీల్లో కొందరు తహసీల్దార్లు మాత్రం బాధితులయ్యారు. వీరు పనిచేసేందుకు వెళ్లిన మండలాల్లోని ప్రజా ప్రతినిధులు వీళ్లు మాకొద్దంటూ జిల్లా యంత్రాంగంపై ఒత్తిళ్లు తెస్తున్నారు. ఒక ప్రజా ప్రతినిధి మాట విని బదిలీ చేస్తే మరో ప్రజా ప్రతినిధికి ఇబ్బందిగా మారుతోంది. ముసునూరు తహసీల్దార్‌గా టీ మదన్‌ మోహన్‌రావును కావాలని పోస్టింగ్‌ వేయించుకున్న స్థానిక ప్రజా ప్రతినిధికి ఆయన చుక్కలు చూపించటంతో వెంటనే బదిలీ చేయాలని ఉన్నతాధికారిపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం జరిగింది. ఇదే క్రమంలో ఓ భూ వివాదంలో మదనమోహనరావు పాత్రపై ఆధారాలు లభించటంతో సీసీఎల్‌ఏ అతన్ని సస్పెండ్‌ చేసింది. ఇక విజయవాడ సెంట్రల్‌కు కోరి మరీ తెచ్చుకున్న పీ జయశ్రీ స్థానిక ప్రజా ప్రతినిధి మాట వినకపోవటంతో ఆయన కూడా ఈమెపై గుర్రుగా ఉన్నారు. ఏకంగా అధికార పార్టీ నగరాధ్యక్షుడు సైతం జిల్లా ఉన్నతాధికారికి ఆమె ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా పనిచేస్తున్నారని లేఖ రాసే వరకు వెళ్లింది. విజయవాడ రూరల్‌ తహసీల్దార్‌గా పనిచేస్తున్న డీ వనజాక్షి తమ మాట వినటం లేదని అధికార పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు చూసే నేత జిల్లా యంత్రాంగంపై ఒత్తిళ్లు తేవటంతో ఆమెను గూడూరు బదిలీ చేశారు. పెనుగంచిప్రోలు తహసీల్దార్‌ డీ కోటేశ్వరరావు, ఉంగుటూరు తహసీల్దార్‌ డీవీఎస్‌ ఎల్లారావును మచిలీపట్నం కలెక్టరేట్లకు బదిలీ చేయటంతో వారు బాధితులుగా మారారు. విజయవాడ సబ్‌ కలెక్టర్‌ ఏఓగా పనిచేస్తూ పట్టుమని 4నెలలు కూడా పనిచేయకుండా బదిలీ అయిన తహసీల్దార్‌ ఎం మాధురి కూడా బాధితురాలే. బాధిత తహసీల్దార్లు వెళ్లిన స్థానాల్లో అక్కడి ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు రావటంతో జిల్లా యంత్రాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది.  


డెప్యుటేషన్ల బదిలీలకు రాజముద్ర.. పాత తేదీతో ఆదేశాలు! 

అధికారపక్ష ఒత్తిళ్లకు తలొగ్గిన జిల్లా యంత్రాంగం భారీగా తహసీల్దార్లను డెప్యుటేషన్‌ విధానంలో బదిలీ చేయటంతో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. ప్రధానంగా ఆయా తహసీల్దార్‌ కార్యాలయాల సిబ్బంది జీతాల కోసం ఫైళ్లతో ఊళ్లు తిరగటం ప్రారంభమైంది. ఇలా డెప్యూటేషన్‌పై బదిలీలు జరగటంతో సీఎఫ్‌ఎంఎస్‌లో వారి పేరుతో ఉండటం వల్లనే ఈ సమస్య ఏర్పడింది. దీన్ని పరిష్కరించే పేరుతో ఈ బదిలీలన్నింటికీ ఇటీవలే జిల్లా యంత్రాంగం రాజముద్ర వేసింది. కరోనా వేళ బదిలీలు చేపట్టకూడదు కాబట్టి రెండు వారాల కిందట పాత తేదీతో రాజముద్రవేయటం గమనార్హం.


Updated Date - 2020-08-11T13:05:21+05:30 IST