ఏపీ ప్రాజెక్టులపై..తాడోపేడో

ABN , First Publish Date - 2021-06-20T09:00:28+05:30 IST

కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న అనుమతిలేని ప్రాజెక్టులపై తాడో పేడో తేల్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీ ప్రాజెక్టులపై..తాడోపేడో

  • జల దోపిడీపై న్యాయస్థానాల్లో పోరాటం
  • ప్రధానికి, జల మంత్రికి వినతి పత్రాలు
  • కృష్ణా బేసిన్లోనూ ఎత్తిపోతల పథకాలు
  • అలంపూర్‌ వద్ద జోగులాంబ బ్యారేజీ
  • 60-70 టీఎంసీల వరద జలాల తరలింపు
  • పాలమూరు, కల్వకుర్తి అవసరాలే లక్ష్యం
  • పులిచింతలకు ఎడమ కాల్వ.. భీమా వరద కాల్వ
  • సుంకేశుల, టెయిల్‌పాండ్‌ల వద్ద 2 లిఫ్టులు
  • కల్వకుర్తి సామర్థ్యం 20 టీఎంసీలకు పెంపు
  • రాష్ట్ర మంత్రి మండలి సంచలన నిర్ణయాలు
  • కేంద్ర నిష్ర్కియాపరత్వంపై కేబినెట్‌ ఆగ్రహం
  • రైతాంగ ప్రయోజనాల పరిరక్షణకు ఎందాకైనా..


హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్‌ నిర్మిస్తున్న అనుమతిలేని ప్రాజెక్టులపై తాడో పేడో తేల్చుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌తోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించినా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను నిలుపు చేయడం లేదని, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా పోవాలని కేబినెట్‌ నిశ్చయించింది. ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌ జల దోపిడీని ఎత్తి చూపాలని నిర్ణయించింది. రాబోయే 


పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో గళం విప్పాలని అభిప్రాయపడింది. ఏపీ ప్రాజెక్టుల కారణంగా జరగబోయే తీవ్ర నష్టాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిశ్చయించింది. ఏపీ ప్రాజెక్టులతో పాలమూరు, నల్లగొండ, ఖమ్మం, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్‌కు తాగునీరు విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతోందని అభిప్రాయపడింది. అందుకే రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నీటి వాటా కోసం కృష్ణా బేసిన్లోనూ ప్రాజెక్టులను నిర్మించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, ‘జోగులాంబ బ్యారేజీ’ పేరిట గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్‌ వద్ద కృష్ణా నదిపై ఓ బ్యారేజీని నిర్మించాలని రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయించింది. గుమ్మడం, గొందిమల్ల, వెలటూరు, పెద్ద మారూరు గ్రామాల పరిధిలో దీనిని నిర్మించనుంది. ఇక్కడి నుంచి 60-70 టీఎంసీల వరద నీటిని పైపులైను ద్వారా తరలించాల ని భావిస్తోంది. 


జోగులాంబ బ్యారేజీ ద్వారా పాలమూ రు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అంతర్భాగమైన ఏదుల రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోసి, పాలమూరు, కల్వకుర్తి ప్రాజెక్టుల ఆయకట్టు అవసరాలను తీర్చాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన శనివారం ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో సాగునీటి పారుదల రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జోగులాంబ బ్యారేజీతోపాటు పులిచింతలలో ఎడమ కాల్వ నిర్మాణం, సుంకేశుల, నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ల వద్ద మరో రెండు ఎత్తిపోతల పథకాలు నిర్మించనున్నారు. వీటికి సర్వేలు నిర్వహించి, డీపీఆర్‌లను తయారు చే యాలని జల వనరుల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే, కృష్ణా జలాలపై హక్కులను పరిరక్షించుకుంటూనే రాష్ట్ర రైతులను, వ్యవసాయాన్ని కాపాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను నిర్ణయించింది. ఏపీ అనుమతిలేని ప్రాజెక్టులపై ప్రధాన మంత్రిని, కేంద్ర జలశక్తి మంత్రిని కలిసి వినతి పత్రాలు సమర్పించాలని కేబినెట్‌ నిర్ణయించింది. వాటిని ఆపించే విధంగా చూడాలని కోరనుంది.


కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తి

ఏపీ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్‌డీఎస్‌) కుడి కాల్వ నిర్మాణాలను కేబినెట్‌ తీవ్రంగా నిరసించింది. ఏపీ అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించిందని, సుప్రీం కోర్టులో కేసులు వేసిందని నీటిపారుదల శాఖ కేబినెట్‌కు వివరించింది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌ ఏర్పడి 17 సంవత్సరాలైనా.. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లయినా.. రాష్ట్రానికి కృష్ణా జలాల్లో న్యాయమైన నీటి వాటా నిర్ధారణ కాలేదని, ఈ దృష్ట్యా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్ష న్‌ 3 ప్రకారం కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని గతంలోనే కేంద్రానికి తెలంగాణ సర్కారు విజ్ఞప్తి చేసిం ది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వేసిన కేసు అడ్డుగా ఉందని చెప్పడంతో దానిని ఉపసంహరించుకున్నామని, కేంద్రం సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తుందనే నమ్మకంతోనే వెనక్కి తగ్గామని, కానీ, కేంద్ర ప్రభుత్వ నిష్ర్కియాపరత్వంతో తెలంగాణ రైతుల ప్రయోజనాలకు భంగం కలిగే పరిస్థితి ఏర్పడిందని కేబినెట్‌ ఆక్షేపించింది. కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడినప్పుడు అది కుదురుకోవడానికి కేంద్రం కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టి సహకారం అందించాల్సి ఉంటుందని, కానీ.. అలాంటి చొరవ తీసుకోకుండా,  నదీ జలాల విషయంలో కేంద్రం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తోందని కేబినెట్‌ తప్పుబట్టింది.


కృష్ణా బేసిన్‌లో ప్రాజెక్టులు ఇవే!

గద్వాల, వనపర్తి జిల్లాల మధ్య అలంపూర్‌ వద్ద కృష్ణా నదిపై జోగులాంబ పేర బ్యారేజీ నిర్మాణం.

పులిచింతల ఎడమ కాల్వను నిర్మించి నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం.

సుంకేశుల రిజర్వాయర్‌ నుంచి మరో ఎత్తిపోతల పథకం చేపట్టి, నడిగడ్డ ప్రాంతంలో మరో లక్ష ఎకరాలకు సాగునీటిని అందించడం.

తెలంగాణలో ప్రవేశించే కృష్ణ మండలంలోని కుసుమర్తి వద్ద భీమా వరద కాల్వ నిర్మాణం.

కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో జలాల నిల్వ సామర్థ్యాన్ని 20 టీఎంసీలకు పెంచడం.

నాగార్జున సాగర్‌ టెయిల్‌ పాండ్‌ నుంచి ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి, సాగర్‌ ప్రాజెక్టు పరిధిలోని రెండు లక్షల ఎకరాల ఎగువ భూములకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించడం

జల విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా వీలైనంత ఎక్కువ విద్యుత్తును ఉత్పత్తి చేసి ఎత్తిపోతల పథకాలకు వినియోగించుకోవాలి. ఎత్తిపోతలకు విద్యుత్తు ఖర్చు తగ్గించుకోవచ్చు.

కృష్ణా, గోదావరి నదులపై 2,375 మెగావాట్ల జల విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగిన ప్రాజెక్టులున్నాయని, వాటి సంపూర్ణ సామర్థ్యంతో జల విద్యుత్తును ఉత్పత్తి చేసి, కాళేశ్వరం, దే వాదుల, ఏఎంఆర్పీ తదితర ఎత్తిపోతల పథకాలకు నిరంతర విద్యత్తు సరఫరా చేయాలం టూ విద్యుత్తు శాఖను కేబినెట్‌ ఆదేశించింది. 

Updated Date - 2021-06-20T09:00:28+05:30 IST