పాఠ్యపుస్తకాలు రాలే !

ABN , First Publish Date - 2021-12-20T06:15:16+05:30 IST

విద్యాసంవత్సరం ప్రారంభమై ఎఫ్‌ఏ-1 పరీక్షలు పూర్తికాగా, ఎస్‌ఏ-1 పరీక్ష ఈ నెల 20వ తేదీతో పూర్తికానుంది.

పాఠ్యపుస్తకాలు రాలే !

 నేటికీ పూర్తిస్థాయిలో అందని పుస్తకాలు 

గతేడాది వారి పుస్తకాలతో చదవులు

విద్యాసంవత్సరం ప్రారంభమై ఎఫ్‌ఏ-1 పరీక్షలు పూర్తికాగా, ఎస్‌ఏ-1 పరీక్ష ఈ నెల 20వ తేదీతో పూర్తికానుంది. కాగా, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేటికీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. కొన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్‌ పుస్తకాల కొరత ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో గణితం పుస్తకాల కొరత ఉంది. దీంతో ఉపాధ్యాయులు ముగ్గురు విద్యార్థులు కలిపి ఒక పుస్తకాన్ని ఇచ్చి సర్దుతున్నారు. ఈ పుస్తకాన్ని ఒకరు తీసుకెళ్తే మిగతా ఇద్దరు ఇద్దరు ఇంటివద్ద హోంవర్క్‌, చదువుకునేందుకు పుస్తకం ఉండటం లేదు.

ఆంధ్రజ్యోతి, సూర్యాపేట

కరోనా కారణంగా ఈ ఏడాది పాఠశాలలు జూన్‌ 1కి బదులు సెప్టెంబరు 1న ప్రారంభమయ్యాయి. పాఠశాలలు ప్రారంభమై 100 రోజులు గడిచినా నేటికీ పూర్తిస్థాయిలో పాఠ్యపుస్తకాలు అందలేదు. కరోనా అనంతరం ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల అడ్మిషన్ల సంఖ్య భారీగా పెరిగింది. గత ఏడాది విద్యార్థుల సంఖ్య ప్రకారం ఇండెంట్‌ పెట్టగా, ఆ మేరకే పాఠ్యపుస్తకాలు వచ్చాయి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఈ ఏడాది 4,54,913 పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉండగా, 3,83420 పుస్తకాలు మాత్రమే అందాయి. ఇంకా 7,1,493 పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేయాల్సి ఉంది. కొంతమంది విద్యార్థులు పూర్వ విద్యార్థుల నుంచి పాఠ్యపుస్తకాలు సేకరించి చదువుకుంటున్నారు. పదో తరగతి విద్యార్థులకు సైతం పూర్తిస్థాయిలో పుస్తకాలు లేవు.

ప్రైవేట్‌లోనూ దొరకని

పాఠ్యపుస్తకాలు


ప్రభుత్వ పాఠశాలలకు పాఠ్యపుస్తకాలను ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ప్రైవేట్‌ దుకాణాల్లో కొనుగోలుచేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకే పూర్తిస్థాయిలో పుస్తకాలు పంపిణీకాలేదు. విద్యార్థులు డబ్బుపెట్టి కొనుగోలుచేద్దామన్నా దుకాణాల్లో కూడా పాఠ్యపుస్తకాలు దొరకడం లేదు. కనీసం 8వ తరగతి నుంచి 10వ తరగతికి సంబంధించిన పాఠ్యపుస్తకాలనైనా ముద్రించి పంపిణీ చేయాలని విద్యానిపుణులు కోరుతున్నారు. 

ప్రభుత్వ పాఠశాల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య

జిల్లాలో మొత్తం 998 వరకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో కేజీబీవీఎస్‌, మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌, ప్రైవేట్‌ ఎయిడెడ్‌, రాష్ట్ర ప్రభుత్వ, టీఎస్‌ మోడల్‌ స్కూల్స్‌, టీఎ్‌సఆర్‌ఈఐ సొసైటీ స్కూల్స్‌, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలు 700 ఉంటే ప్రాథమికోన్నత పాఠశాలలు 81 వరకు ఉన్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు 217 వరకు ఉన్నాయి. అన్నింటిలో కలిపి 2020-21 సంవత్సరంలో 73,739 విద్యార్థులు ఉండగా, 2021-22 విద్యా సంవత్సరానికి ఆ సంఖ్య 1,39,263 చేరింది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 65,524 మంది విద్యార్థుల సంఖ్య పెరిగింది. కరోనా నేపథ్యంలో చాలా మంది ఉపాధిలేక తల్లడిల్లారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ పాఠశాలలకు పంపించే స్థోమత లేక తల్లిదండ్రులు విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. జిల్లాలో సుమారు 200 ప్రైవేట్‌ పాఠశాలలు ఉండగా, కరోనాకు ముందు ఒక్కో ప్రైవేట్‌ పాఠశాలలో సుమారు 600 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం 400 మందికి మించి విద్యార్థులు లేరు. చాలా ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. వాటి భవనాలను యజమానులు అద్దెకి ఇచ్చారు. ప్రైవేట్‌ పాఠశాలలు స్కూల్‌ బస్సులను కూడా కుదించాయి. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఇప్పటికైనా పూర్తిస్థాయిలో పుస్తకాలు పంపిణీచేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.

పుస్తకాలు రాగానే పంపిణీ చేస్తాం

జిల్లాలో పాఠ్యపుస్తకాల కొరత ఉన్న మాట వాస్తవమే. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు అనూహ్యంగా విద్యార్థుల సంఖ్య పెరిగింది. ప్రభుత్వం పంపిణీ చేసిన వరకు పుస్తకాలను విద్యార్థులకు అందించాం. ఇంకా 7,1,493 పాఠ్యపుస్తకాలు రావాల్సి ఉంది. అవి రాగానే విద్యార్థులకు పంపిణీ చేస్తాం.

శైలజ, ఏడీ, సూర్యాపేట

చదవలేక పోతున్నాం

పాఠ్యపుస్తకాలు లేకపోవడంతో చదవలేకపోతున్నాం. గణితం పుస్తకం రాలేదు. కొందరికి తెలుగు పుస్తకాలు రాలేదు. గత ఏడాది సైతం పుస్తకాలు ఇవ్వకపోవడంతో లాక్‌డౌన్‌ సందర్భంగా ఆన్‌లైన్‌ క్లాసులు వినలేకపోయాం.

రమావత్‌ పావని, నాలుగో తరగతి, 

పీపానాయక్‌తండా, ఆత్మకూర్‌(ఎస్‌) మండలం 

Updated Date - 2021-12-20T06:15:16+05:30 IST