వాచక నిర్మాణం

ABN , First Publish Date - 2021-02-08T06:09:57+05:30 IST

కొన్ని పొరపాట్లు జరుగుతాయి వాటినిప్పుడు సరిదిద్దలేము మొదట పొరపాటు జరిగినప్పుడు...

వాచక నిర్మాణం

కొన్ని పొరపాట్లు జరుగుతాయి

వాటినిప్పుడు సరిదిద్దలేము

మొదట పొరపాటు జరిగినప్పుడు

పొరపాటులా వుండదు- సరైనదే అనుకుంటాం

కాలం తలకిందులు చేస్తుంది

తనదే పైచేయని రుజువు చేస్తుంది

తర్వాత కొన్ని నిజాలు అవగతమౌతాయి

కాని అప్పుడు ఏమీ చేయలేని

                  నిస్సహాయ స్థితిలో వుంటాం

వర్షం కురవకుండా మేఘం జరిగిపోతుంది

ఎదురుచూస్తున్న కళ్లు ఎదురుచూస్తూనే వుంటాయి

ఏదీ అందదు, ఏదీ తెలియదు

జీవితాలు నరకప్రాయాలౌతాయి

నిరవధిక శిక్షలో మగ్గిపోతుంటాయి

ఎవడూ భవిష్యత్తును చూడడు

                    ఊహిస్తాడు-

ఒక్కొక్కప్పుడు ఊహ భ్రమ అని తేలుతుంది

నీటి మీదో- రైలు పట్టాల మీదో- శవం తేలుతుంది

అది మాట్లాడదు


ఎవడు చెప్పగలడు

ఏది సత్యమో ఏది అసత్యమో-

స్థలకాలాలకు అతీతంగా జీవితం వుండదు-

చరిత్రలో జీవితం ఒక కీలకమైన మలుపు

నీళ్లు పారిపోతాయి- వంతెన మిగులుతుంది

కొత్తతరం వంతెన మీద నుంచొని చూస్తూ వుంటుంది

నిన్నటి నుంచి జారిపోయిన నీళ్లను లెక్కగడుతుంది

లెక్కలు ఒక కొలబద్ద

అక్కడ జీవితం వుండదు

ఇప్పుడేం మిగిలింది

        దుఃఖానుభవం మిగిలింది

దురంతమైన జీవన వేదన

        నదిలా మెలికలు తిరుగుతూ

సాగిపోతుంది

ఇదే జీవితం- ఇక్కడే లోతైన అడుగుజాడ-

కన్నీళ్లు ఉబుకుతున్న ఒక దొరువు

వల విసరలేవు- గాలమెయ్యలేవు

నువ్వెళ్లిపోయినా నీ నీడ

ఒడ్డున కూర్చుని చూస్తూ వుంటుంది

ఎవడో ఒక బాలుడొచ్చి నీ నీడ పక్కన నిల్చొని

దాన్ని తనలో లీనం చేసుకుంటాడు

అంతే- భవిష్యత్తు వర్తమానంలోకి

వర్తమానం గతంలోకి జొరబడతాయి

వాచక నిర్మాణం మొదలౌతుంది

కె. శివారెడ్డి

9502167764

Updated Date - 2021-02-08T06:09:57+05:30 IST