పాఠ్యపుస్తకాలు రెడీ

ABN , First Publish Date - 2022-05-14T05:56:52+05:30 IST

పాఠ్యపుస్తకాలు రెడీ

పాఠ్యపుస్తకాలు  రెడీ
విజయవాడలోని గిడ్డంగిలో పాఠ్య పుస్తకాల దిగుమతి

ఉమ్మడి జిల్లాకు కావాల్సిన పుస్తకాలు 34,81,272

మొదటి విడతలో వచ్చినవి 24,00,893

ఈనెలాఖరు నుంచి మండల కేంద్రాలకు..


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఉచిత పాఠ్యపుస్తకాలు ముందే వచ్చేశాయి. విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తెలంగాణా ప్రాంతాల్లోని ముద్రణ కేంద్రాల నుంచి ఈ పుస్తకాలను తీసుకొచ్చారు. ప్రస్తుతం విజయవాడలోని గిడ్డంగిలో వీటిని దిగుమతి చేసుకుంటున్నారు. వారంలో దిగుమతి పూర్తవుతుందని, ఈ నెల చివరి వారం నుంచి మండల కేంద్రాలకు పంపుతామని జిల్లా పుస్తక పంపిణీ కేంద్రం మేనేజర్‌ బి.నాగమల్లేశ్వరరావు తెలిపారు. 

34,81,272 పాఠ్యపుస్తకాలు అవసరం

కరోనా వ్యాప్తి అంతగా లేకపోవడంతో రానున్న విద్యా సంవత్సరంలో తరగతులు అనుకున్న సమయానికే ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాకు ఒకటి నుంచి పదో తరగతి వరకూ 34,81,272 ఉచిత పాఠ్యపుస్తకాలు అవసరమని గుర్తించారు. మొదటి విడతగా జిల్లాకు 24,00,893 పాఠ్యపుస్తకాలు వస్తాయని, మిగిలినవి పాఠశాలలు తెరిచే నాటికి దశలవారీగా చేరుతాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. 

ఆర్టీసీతో ఒప్పందం

ఉమ్మడి కృష్ణాజిల్లాలో పాఠ్యపుస్తకాల రవాణాకు సంబంధించి ఆర్టీసీతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. మొదటి విడత పాఠ్యపుస్తకాల దిగుమతి పూర్తయిన వెంటనే ఆర్టీసీ ఏర్పాటుచేసిన ప్రత్యేక వాహనాల్లో ఆయా జిల్లా, మండల కేంద్రాలకు వీటిని చేరవేస్తారు. జిల్లా విద్యాశాఖ అధికారుల సూచనలతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పెట్టిన ఇండెంట్‌ ఆధారంగా ఈ పంపిణీ ఉంటుందని నాగమల్లేశ్వరరావు తెలిపారు. 

ఈ ఏడాదైనా సక్రమంగా అందేనా..?

పాఠ్యపుస్తకాల పంపిణీలో ఏటా జాప్యం జరుగుతూ వస్తోంది. పాఠశాలలు తెరిచిన అనంతరం నెలలు గడిచినా పుస్తకాలు అందట్లేదు. పాఠ్య పుస్తకాలు వచ్చినా ఉపాధ్యాయులు వాటిని సకాలంలో విద్యార్థులకు అందజేయట్లేదు. ఇందుకు విద్యాశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపమే కారణంగా తెలుస్తోంది. ఈసారైనా సకాలంలో పాఠ్యపుస్తకాలు అందేలా అధికారులు దృష్టిపెట్టాలి.

Read more