Texas స్కూల్లో కాల్పులు జరపకముందే ఇంట్లో బామ్మను షూట్ చేశాడు కదా.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే..

ABN , First Publish Date - 2022-05-31T02:58:20+05:30 IST

టెక్సాస్ స్కూల్లోని విద్యార్థులపై కాల్పులు జరిపి 19 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్న నిందితుడు రామోస్..అంతకుమునుపు తన నాన్నమ్మ శాలీ గొన్సా్ల్వెస్‌పై కూడా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు.

Texas స్కూల్లో కాల్పులు జరపకముందే ఇంట్లో బామ్మను షూట్ చేశాడు కదా.. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటంటే..

ఎన్నారై డెస్క్: టెక్సాస్ స్కూల్లోని విద్యార్థులపై కాల్పులు జరిపి 19 మంది చిన్నారులను పొట్టనపెట్టుకున్న నిందితుడు రామోస్(Ramos)..అంతకుమునుపు తన బామ్మ శాలీ గొన్సాల్వెస్‌పై  కూడా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. ఆమె మొహంపై కాల్పులు జరిపిన అనంతరం సమీపంలోని రాబ్ ప్రైమరీ స్కూలుకు వెళ్లి చిన్నారులను బలితీసుకున్నాడు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన శాలీ.. ఇక జీవితంలో ఎప్పటికీ మాట్లాడలేకపోవచ్చని ఆమె బంధువులు చెబుతున్నారు. తూటా ఆమె దవడని ఛేదించుకుంటూ వెళ్లిపోయిందని చెప్పారు. రామోస్ తన గురిని మరో రెండు సెంటీమీటర్లు పక్కకు జరిపి ఉండి ఉంటే.. ఆమె తల పేలిపోయి ఉండేదన్నారు. 


శాలీ ప్రస్తుతం స్పృహలోనే ఉన్నప్పటికీ.. మాట్లాడలేని స్థితిలో ఉన్నారని కుటుంబసభ్యులు చెప్పారు. తాను చెప్పాలనుకున్నది కాగితంపై రాసి చూపించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమె చేతిరాత తమకు అర్థం కావట్లేదన్నారు. ఈ క్రమంలో.. శాలీ తీవ్ర అసంతృప్తికి లోనవుతోందని చెప్పారు. కాగా.. వైద్యులు ఇప్పటికే ఆమెకు పలు శస్త్రచికిత్సలు చేశారు. ఇంకా చాలా ఆపరేషన్లే చేయాల్సి ఉందని వైద్యులు తమకు చెప్పినట్టు శాలీ కుటుంబసభ్యులు మీడియాకు చెప్పారు. మే 24న  నిందితుడు రామోస్.. క్లాస్‌లో ఉన్న 19 మంది చిన్నారులతో పాటూ ఇద్దరు టీచర్లను దారుణంగా అంతమొందించిన విషయం తెలిసిందే. స్కూల్ వెనకవైపు ఉన్న తలుపు ద్వారా లోపలికి వచ్చిన అతడు తరగతిలోకి ఎవరూ ప్రవేశించకుండా అడ్డాలు పెట్టి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మరణించిన చిన్నారులందరూ 11 ఏళ్ల లోపువారే కావడంతో యావత్ అమెరికా శోకసంద్రంలో మునిగిపోయింది. 



Updated Date - 2022-05-31T02:58:20+05:30 IST