మెదడు తినే అమీబాతో బాలుడి మృతి.. టెక్సాస్‌లో అలెర్ట్!

ABN , First Publish Date - 2020-09-29T23:19:14+05:30 IST

అమెరికాలోని టెక్సాస్‌లో మెదడు తినే అమీబా వల్ల ఆరేళ్ల బాలుడు మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోట్ అలెర్ట్ ప్రకటించారు.

మెదడు తినే అమీబాతో బాలుడి మృతి.. టెక్సాస్‌లో అలెర్ట్!

హూస్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో మెదడు తినే అమీబా వల్ల ఆరేళ్ల బాలుడు మృతిచెందినట్లు నిర్ధారణ కావడంతో ఆ రాష్ట్ర గవర్నర్ గ్రెగ్ అబోట్ అలెర్ట్ ప్రకటించారు. టెక్సాస్‌లోని బ్రేజోరియా కౌంటీ, లేక్ జాక్సన్‌లో గవర్నర్ ఆదివారం విపత్తు ప్రకటన చేశారు. ఇక ఒకవైపు మహమ్మారి కరోనావైరస్ ప్రపంచాన్ని వణికిస్తుండగా.. మరోవైపు అగ్రరాజ్యంలో మరో కొత్త సూక్ష్మజీవి వెలుగులోకి రావడం అక్కడి వారిని భయబ్రాంతులకు గురి చేస్తోంది. ఇది నేరుగా మనిషి మెదడుపైనే ప్రభావం చూపిస్తుండటం పట్ల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగ్లేరియా ఫౌలేరి అనే ఈ సూక్ష్మజీవి మానవ శరీరంలోకి ముక్కు ద్వారా ప్రవేశిస్తుందని వైద్యులు గుర్తించారు. ఆ తర్వాత నేరుగా మెదడుకు చేరుతుంది. దాంతో బాధితులు విపరీతమైన తలనొప్పి, వాంతులు చేసుకుని తక్కువ సమయంలోనే ప్రాణాలు కోల్పోతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


తాజాగా టెక్సాస్‌లోని లేక్ జాక్సన్‌లో జోసియా మెకింటైర్(06) అనే బాలుడు.. స్థానికంగా ఉండే నీటిలో ఆడుకుని ఇంటికి చేరిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. తలనొప్పి, వాంతులు చేసుకోవడంతో బాలుడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాలుడు సెప్టెంబర్ 8న చనిపోయాడు. అయితే, ఆ బాలుడు చనిపోవడానికి కారణం నాగ్లేరియా ఫౌలేరి అని తేలింది. బాలుడు ఆడుకున్న నీటి శాంపిళ్లలో నాగ్లేరియా ఫౌలేరిని గుర్తించారు. కనుక తాగడానికి, వంట చేసుకోవడానికి.. వేడి చేసి చల్లార్చిన నీటిని వినియోగించాలని టెక్సాస్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అలాగే ముక్కులోకి నీరు వెళ్లకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా, టెక్సాస్‌లో 1983 నుంచి 2010 మధ్యలో సుమారు 28 మంది నాగ్లేరియా ఫౌలేరి అమీబాతో మరణించడం జరిగిందని రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.    

Updated Date - 2020-09-29T23:19:14+05:30 IST