విద్యార్థులకు పరీక్షే

ABN , First Publish Date - 2021-07-21T06:22:47+05:30 IST

అసలే కరోనా కాలం. ఆపై ఒకదాని తర్వాత మరో పరీక్ష. ఇటు భౌతిక తరగతులు లేక, ఆన్‌లైన్‌ క్లాస్‌లు విన్నా అత్తెసరు జ్ఞానంతో పరీక్షలకు హాజరవుతూ నానా యాతన పడుతున్నారు. ఎంజీయూ అధికారులు మాత్రం అనుభవం లేని అధ్యాపకులకు మూల్యాంకనం, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బాధ్యతలు అప్పగిస్తూ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలయిన ఎంజీయూ డిగ్రీ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల గత సెమిస్టర్‌ టాపర్లను సైతం ఫెయిల్‌ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విద్యార్థులకు పరీక్షే

సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణలో గందరగోళం

పరీక్షల మధ్య సన్నద్ధానికి గడువు కరువు

పైరవీకారులకు మూల్యాంకనం బాధ్యతలు

ప్రభుత్వ కళాశాలలపై ‘ఎంజీయూ’ కన్నెర్ర

గత సెమిస్టర్‌ టాపర్లను సైతం ఫెయిల్‌ చేస్తున్న వైనం


అసలే కరోనా కాలం. ఆపై ఒకదాని తర్వాత మరో పరీక్ష. ఇటు భౌతిక తరగతులు లేక, ఆన్‌లైన్‌ క్లాస్‌లు విన్నా అత్తెసరు జ్ఞానంతో పరీక్షలకు హాజరవుతూ నానా యాతన పడుతున్నారు. ఎంజీయూ అధికారులు మాత్రం అనుభవం లేని అధ్యాపకులకు మూల్యాంకనం, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బాధ్యతలు అప్పగిస్తూ విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకంగా మారుస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల విడుదలయిన ఎంజీయూ డిగ్రీ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల గత సెమిస్టర్‌ టాపర్లను సైతం ఫెయిల్‌ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

నల్లగొండ క్రైం, జూలై 20: ఆది నుంచి వివాదాలకు కేంద్ర బిందువైన మహాత్మాగాంధీ యూనివర్సిటీ అధికారుల తీరు మారడంలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూనివర్సిటీకి గుండె కాయలాంటి పరీక్ష ల విభాగం పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. కొన్నేళ్లుగా పరీక్షల విభాగం పనితీరుతో ఉమ్మడి జిల్లాలో ని పలు కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థులు తీవ్రఆందోళనకు గురవుతున్నారు. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యంతోపాటు వారి ఒంటెత్తు పోకడలతో పలువురి విద్యార్థుల భవిష్యత్‌ అంధకారంగా మారనుంది. గత కొన్నేళ్లుగా పరీక్షల విభాగం నిర్లక్ష్యంతో ప్రశ్నపత్రాల తయారీతోపాటు మూల్యాంకనం, పరీక్షల నిర్వహణ తీరు యూనివర్సిటీ నిబంధనలకు విరుద్దంగా కొనసాగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. యూనివర్సిటీ పరీక్షల విభాగం అధికారులే ప్రభుత్వ కళాశాలలపై కుట్ర పన్ని ఫలితాలను తగ్గించేందుకు ప్రణాళికతోనే ప్రభుత్వ విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల విడుదలయిన ఎంజీయూ డిగ్రీ ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలల గత సెమిస్టర్‌ టాపర్లను సైతం ఫెయిల్‌ చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ విషయంపై విద్యార్థులు రీవాల్యూయేషన్‌తోపాటు ఆన్సర్‌ షీట్‌ ఫొటో కాపీకోసం దరఖాస్తు చేసుకున్నా, వాటినిచ్చేందుకు అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని తెలుస్తోంది. యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని పలువురు వాపోతున్నారు. 


కరోనా వ్యాప్తి నేపథ్యంలో..

కరోనా కాలంలో ఇళ్లకే పరిమితమై ఆన్‌లైన్‌ తరగతులకు హాజరైన విద్యార్థులకు సిలబ్‌సను అర్థం చేసుకోవడంతోపాటు అభ్యసించడం కష్టతరంగా మారింది. ప్రస్తుతం యూనివర్సిటీ పరీక్షల విభాగం ఈ నెల 27నుంచి 1,2,4,6 సెమిస్టర్‌ పరీక్షలను ఒకేసారి నిర్వహించడంతో పరీక్షలకు మధ్య సమయం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటర్నల్‌ సమర్పించే విషయంలో కూడా గందరగోళం నెలకొంది. విద్యార్థులు పరీక్షలకు ముందు సమర్పించాలా, లేదంటే పరీక్షల తర్వాత అందజేయాలా అనే సందిగ్ధంలో ఉన్నారు. అదేవిధంగా డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు ఉదయం, మధ్యాహ్నం రెండు పూటలా పరీక్షలకు హాజరుకావాల్సిన పరిస్థితి నెలకొంది. 


పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తం 

ఉమ్మడి జిల్లా పరిధిలోని డిగ్రీ, పీజీ కళాశాలలన్నీ ఎంజీయూ పరిధిలోనే ఉండగా, ఇక్కడి అధికారులు మాత్రం పరీక్షల నిర్వహణను గాలికొదిలారన్న ఆరోపణలు ఉన్నాయి. పరీక్షల నిర్వహణ విధులతోపాటు మూల్యాంకనం సైతం అనుభవంలేని అధ్యాపకులకు అప్పగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మూ ల్యాంకనంలో ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులకు ప్రాధాన్యం ఇవ్వకుండా పైరవీకారులకే ప్రాధాన్యమిస్తున్నారు. గతంలో పనిచేసి ప్రస్తుతం ఎక్కడా పనిచేయని అధ్యాపకులకు సిట్టింగ్‌ స్క్వాడ్‌లుగా బాధ్యతలు అప్పగిస్తున్నారన్న విమర్శలున్నాయి. ఇదిలా ఉంటే జిల్లాకేంద్రంలోని ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఏడేళ్లుగా ఓప్రైవేటు కళాశాల సెంటర్‌లోనే పరీక్షలు రాస్తూ ఇబ్బందులు పడుతున్నారు. 


నిబంధనల ప్రకారమే విధులు : మిర్యాల రమేష్‌, పరీక్షల నియంత్రణ అధికారి, ఎంజీయూ 

ఉమ్మడి జిల్లాలోని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న యాజమాన్యాలకు సంబంధించిన అధ్యాపకులనే పరీక్షల విధుల్లోకి తీసుకుంటున్నాం. ఆయా కళాశాలల నుం చి పనిచేస్తున్నట్లు లెటర్లు తీసుకొస్తే బాధ్యతలు అప్పగిస్తున్నాం. లేకుంటే విధులకు అనుమతించడం లేదు. కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరైనా అలాంటి వారు ఉంటే అధికారుల దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. 


చర్యలు తీసుకోవాలి : పి. నాగరాజు, ఏబీవీపీ రాష్ట్ర నాయకుడు

కరోనా సమయంలో విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమవడం కష్టంగా మారింది. సెమిస్టర్‌ పరీక్షలకు మధ్య విద్యార్థులకు అంతరం ఉండేలా చర్య లు తీసుకోవాలి. ఒకేసారి అన్ని పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. దూర ప్రాంతాలనుంచి వచ్చే విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో సెల్ఫ్‌సెంటర్లనే పరీక్షల కోసం కేటాయించాలి. పరీక్షల విభాగం తీరు వివాదాస్పదంగా ఉంది. గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చినా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం నూతన వీసీ, రిజిస్ట్రార్లు పరీక్షల విభాగంపై దృష్టిసారించి విద్యార్థులకు న్యాయం చేయాలి. 


Updated Date - 2021-07-21T06:22:47+05:30 IST